HOW TO APPLY FOR EDUCATION IN INDIA TAX BENEFITS EXPLAINED BA
ఎడ్యుకేషన్ లోన్‌తో బోలెడు లాభాలు.. అటు చదువుకోవచ్చు.. ఇటు ఇలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా
ప్రతీకాత్మక చిత్రం
Education Loan Tax Benefits | హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్‌లో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి మన పని పూర్తవుతుంది. అలాగే, దాంతోపాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లోన్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి చాలా మందికి తెలియదు. అవి ఇప్పుడు తెలుసుకుందాం.
గృహ రుణాలు (Home Loan) లేదా వ్యక్తిగత రుణాల (Personal Loan) మాదిరిగా కాకుండా.. విద్యా రుణాలు (Education Loan) మీరు తీసుకున్న కోర్సు వ్యవధి కంటే 6-12 నెలల పాటు మారటోరియంతో వస్తాయి. మారటోరియం సమయంలో బ్యాంకులు లోన్ రీపేమెంట్ లేదా ఈఎంఐలను ఆశించవు. అంటే విద్య పూర్తయిన తరువాత, ఉద్యోగం చేస్తూ లోన్‌ను తిరిగి చెల్లించే అవకాశం లభిస్తుంది. దీంతో లోన్ రీపేమెంట్‌కు తగినంత సమయం రుణ గ్రహీతలకు ఉంటుంది. విద్యా రుణాలపై వర్తించే పన్ను ప్రయోజనాలు (Tax Benefits on Education Loan).. ఈ లోన్లకు ఆదరణ పెరగడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఆదాయ పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 80E ప్రకారం.. విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు (Tax deduction) పొందవచ్చు. ఉన్నత విద్య కోసం లోన్ తీసుకున్న వ్యక్తిగత రుణగ్రహీతలకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. భారతదేశంలో లేదా విదేశాల్లో ఒకేషనల్‌తో పాటు రెగ్యులర్ కోర్సులు చదివేందుకు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్‌పై ట్యాక్స్ డిడక్షన్ ఆప్షన్‌ను రుణ గ్రహీతలు ఎంచుకోవచ్చు.
ఈ పన్ను మినహాయింపు అసలుపై కాకుండా EMI వడ్డీ విభాగంపై మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి గరిష్ట పరిమితి లేదు. అయితే ట్యాక్స్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయడానికి రుణ దాతలు అందించే సంబంధిత లోన్, EMI పత్రాలు అవసరం. ఎడ్యుకేషన్ లోన్ తిరిగి చెల్లించడం ప్రారంభించినప్పటి నుంచి 8 సంవత్సరాలు లేదా మీ లోన్ వడ్డీ భాగాన్ని తిరిగి చెల్లించే వరకు.. రెండింట్లో ఏది ముందుగా జరిగితే దానికి సంబంధించిన ప్రయోజనాన్ని రుణ గ్రహీతలు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎడ్యుకేషన్ లోన్ ఉన్నత విద్యను అభ్యసించడానికి సాయం చేయడంతో పాటు ఎక్కువ కాలం పాటు క్రమపద్ధతిలో రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. అదే సమయంలో పన్ను మినహాయింపులను అందించడంతో పాటు తక్కువ ఖర్చుతో లోన్ రీపేమెంట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే..
క్లెయిమ్ చేయగల మొత్తంపై గరిష్ట పరిమితి లేనప్పటికీ.. ఎడ్యుకేషన్ లోన్‌పై చెల్లించే వడ్డీపై మాత్రమే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. అసలుపై కాదు.
లోన్ పొందిన వ్యక్తి మాత్రమే ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని తిరిగి చెల్లిస్తే.. వారే ఈ పన్ను మినహాయింపును పొందవచ్చు. కానీ పిల్లలు తమ సొంత ఆదాయంతో ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తే.. తల్లిదండ్రులు లేదా పిల్లలు కూడా మినహాయింపులను క్లెయిమ్ చేయలేరు. రుణం తల్లిదండ్రుల పేరు మీద ఉంది.. కానీ వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంతో రుణాన్ని తిరిగి చెల్లించట్లేదు కాబట్టి పన్ను ప్రయోజనాలు వర్తించవు.
అన్ని రకాల విద్యా రుణాలు పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉండవు. బ్యాంకులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన నిర్ధిష్ట ఆర్థిక సంస్థలు అందించే ఎడ్యుకేషన్ లోన్లకు మాత్రమే సెక్షన్ 80E ప్రకారం పన్ను ప్రయోజనం వర్తిస్తుంది. ఒకవేళ రుణ గ్రహీతలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ (NBFC) నుంచి లోన్ తీసుకుంటే.. ఆ సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
సెక్షన్ 80E ప్రకారం పన్ను మినహాయింపు అంటే ఏంటి?
ఎడ్యుకేషన్ లోన్ విదేశీ విద్యకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా రుణగ్రహీతలకు పన్ను కూడా ఆదా చేస్తుంది. మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని దాన్ని తిరిగి చెల్లిస్తుంటే.. ఆ విద్యా రుణంపై చెల్లించే వడ్డీని సెక్షన్ 80E కింద మొత్తం ఆదాయం నుంచి మినహాయింపుగా పరిగణిస్తారు. అయితే EMI వడ్డీ భాగానికి మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. EMI ప్రధాన భాగానికి పన్ను ప్రయోజనం లేదు.
ఈ మినహాయింపును ఎవరు క్లెయిమ్ చేయవచ్చు?
లోన్ తీసుకున్న వ్యక్తులు (individual) మాత్రమే ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది HUF లేదా మరే ఇతర పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదు. స్వీయ, జీవిత భాగస్వామి లేదా పిల్లల ఉన్నత విద్య కోసం లేదా చట్టపరమైన సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి విద్యార్థి కోసం విద్యా రుణం తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకున్న రుణానికి ఈ మినహాయింపును సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ లోన్ ఎక్కడ తీసుకోవచ్చు?
ఏదైనా బ్యాంకు, ఆర్థిక సంస్థ లేదా ఆమోదం పొందిన స్వచ్ఛంద సంస్థల నుంచి లోన్ తీసుకొని ఉండాలి. స్నేహితులు లేదా బంధువుల నుంచి తీసుకున్న రుణాలు ఈ మినహాయింపుకు అర్హత పొందవు.
రుణ ప్రయోజనం ఎలాంటి కోర్సులకు వర్తిస్తుంది?
ఉన్నత చదువుల కోసమే ఈ అప్పు తీసుకోవాలి. అయితే ఈ లోన్‌ను భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల ఉన్నత చదువుల కోసం తీసుకున్నారా అనే పట్టింపు లేదు. సీనియర్ సెకండరీ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యసించే అన్ని కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ జాబితాలో ఒకేషనల్, రెగ్యులర్ కోర్సులు రెండూ ఉన్నాయి.
పన్ను మినహాయింపు మొత్తం (Deduction amount) ఎంత?
అనుమతించిన మినహాయింపు అనేది ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన EMI మొత్తం వడ్డీ భాగం. మినహాయింపుగా అనుమతి పొందే గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. అయితే ఇందుకు రుణ గ్రహీతలు బ్యాంక్ నుంచి సర్టిఫికేట్ పొందాలి. ఆ సర్టిఫికేట్లో.. ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన విద్యా రుణం అసలు, వడ్డీ భాగాలను వేరు చేయాలి. దీంట్లో చెల్లించిన మొత్తం వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. లోన్ మొత్తం తిరిగి చెల్లించేటప్పుడు (ప్రిన్సిపల్ రీపేమెంట్) ఈ పన్ను ప్రయోజనం వర్తించదు.
పన్ను మినహాయింపు వర్తించే కాలం (Period of deduction)
మీరు రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించిన సంవత్సరం నుంచి ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీపై డిడక్షన్ ప్రారంభమవుతుంది. సాధారణంగా లోన్ రీపేమెంట్ ప్రారంభమైన సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ల వరకు లేదా వడ్డీని పూర్తిగా తిరిగి చెల్లించే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అంటే 5 సంవత్సరాలలో మాత్రమే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినట్లయితే, అప్పుడు పన్ను మినహాయింపు 8 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకు వర్తిస్తుంది. ఒకవేళ మీ లోన్ కాలవ్యవధి 8 సంవత్సరాలు దాటితే.. మీరు 8 సంవత్సరాలకు మించి చెల్లించిన వడ్డీకి మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. కాబట్టి ఎనిమిదేళ్లలోపు విద్యా రుణం మొత్తాన్ని చెల్లించడం మంచిది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.