భారత్‌లో త్వరలో అందుబాటులోకి జైకోవ్-డి వ్యాక్సిన్.. ఇతర వ్యాక్సిన్ల కంటే భిన్నంగా..

ఫ్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా సైతం తమ జైకోవ్-డి వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు మంజూరు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు దరఖాస్తు చేసుకుంది.

  • Share this:
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇతర దేశాల్లో వినియోగిస్తున్న టీకాలకు, ప్రయోగాలు పూర్తి చేసుకున్న దేశీయ సంస్థలకు వీలైనంత వేగంగా అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా సైతం తమ జైకోవ్-డి వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు మంజూరు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు వస్తే.. సార్స్ కోవ్-2 వైరస్‌ను నిరోధించేందుకు ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి DNA వ్యాక్సిన్‌గా ZyCov-D నిలవనుంది.

* ZyCov-D వ్యాక్సిన్ పని చేస్తుంది?
జైకోవ్-డి అనేది “ప్లాస్మిడ్ డీఎన్‌ఎ” టీకా. జన్యుపరమైన మార్పులు చేసిన ‘ప్లాస్మిడ్’ అనే ఒక రకమైన డీఎన్‌ఏ మాలిక్యూల్‌ను ఉపయోగించి దీన్ని అభివృద్ధి చేశారు. కరోనావైరస్‌కు సంబంధించిన స్పైక్ ప్రోటీన్‌ను తయారుచేసేలా ఈ ప్లాస్మిడ్‌లను రూపొందించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత, శరీరం కణాలు.. కరోనా వైరస్‌లో ఉండే స్పైక్ ప్రోటీన్ బయటి పొరను తయారు చేయగలవు. రోగనిరోధక వ్యవస్థ దీన్ని ముప్పుగా గుర్తించి, ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తుంది.

ZyCov-D వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సింగిల్ డోస్, డబుల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ZyCov-D వ్యాక్సిన్‌ను మాత్రం మొత్తం మూడు డోసుల్లో ఇస్తారు. ఒక్కో డోసు మధ్య 28 రోజుల విరామం ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌కు మరోక ప్రత్యేకత ఉంది. సూది అవసరం లేకుండానే ఈ టీకా ఇస్తారు. స్పింగ్ పవర్‌తో పనిచేసే ఒక రకమైన డివైజ్ ద్వారా వ్యాక్సిన్‌ను చర్మం లోపలి పొరల్లోకి పంపిస్తారు. మిగతా వ్యాక్సిన్లను శరీర కండరాల్లోకి సూది ద్వారా ఇస్తారు.

* జైకోవ్‌-డి ఎంత సమర్థంగా పనిచేస్తుంది?
జైకోవ్-డి వ్యాక్సిన్‌ను మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షించారు. ట్రయల్స్‌లో మొత్తం 28,000 మంది పాల్గొన్నారు. వీరిలో 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు వెయ్యిమంది ఉండటం గమనార్హం. మొదటి రెండు దశల పరీక్షల్లో వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు జైడస్ కాడిలా సంస్థ గత ఏడాది డిసెంబరులో ప్రకటించింది.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ట్రయల్స్ డేటా ప్రకారం, ఈ టీకా రోగలక్షణాలతో వచ్చే కొవిడ్‌ను 67 శాతం వరకు అడ్డుకుంటుందని తేలింది. లక్షణాలు లేకుండా, మధ్యస్థ లక్షణాలతో కొవిడ్‌ వచ్చే ప్రమాదాన్ని 100 శాతం నిరోధిస్తుందని డేటా ద్వారా తెలుస్తోంది. తీవ్ర లక్షణాలతో కోవిడ్ బారిన పడే ప్రమాదాన్ని వ్యాక్సిన్ రెండు డోసులు సమర్థంగా నిరోధిస్తాయని జైడస్ కాడిలా ప్రకటించింది. మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే మరణాల ప్రమాదం తగ్గుతుందని సంస్థ వెల్లడించింది.

* ఈ టీకా డెల్టా వేరియంట్‌ను నిరోధిస్తుందా?
జైకోవ్-డి మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 50 క్లినికల్ ట్రయల్ సైట్లలో నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తుది దశ ట్రయల్స్ కొనసాగాయి. అందువల్ల ఈ వ్యాక్సిన్‌ డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా గణనీయమైన ప్రభావం చూపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆ సమయంలో నిర్వహించిన సీరో సర్వేలో.. మొత్తం పాజిటివ్ కేసుల్లో మెజారిటీ వాటా డెల్టా వేరియంట్ కేసులేనని సంస్థ గుర్తు చేస్తోంది. అవసరమైతే జైకోవ్-డి వ్యాక్సిన్‌ను కొత్త వేరియంట్లను లక్ష్యంగా చేసుకునేలా అప్‌గ్రేడ్ చేయవచ్చని జైడస్ వెల్లడించింది.

* డీఎన్‌ఏ వ్యాక్సిన్లతో సమస్యలు ఉన్నాయా?
జైడస్ కాడిలా జైకోవ్-డి వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను సమర్పించింది. ‘పీర్ రివ్యూ’ తరువాత ప్రీప్రింట్ సర్వర్‌లో ప్రచురించడానికి ఈ డేటా సిద్ధంగా ఉంది. దీంతో పాటు రెండో దశ ట్రయల్స్ డేటాను ప్రచురణ కోసం సిద్ధం చేస్తోంది. కానీ మూడో దశ క్లినికల్ ట్రయల్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇది పూర్తవ్వడానికి మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. దీంతో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా చూస్తే.. ఇప్పటి వరకు తక్కువ శాస్త్రీయ ఆధారాలతో కూడిన డేటా మాత్రమే అందుబాటులో ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి స్థాయిలో టీకా భద్రత, రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించే సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు తగినంత శాస్త్రీయ డేటా లేదని భావిస్తున్నారు. సిద్ధాంత పరంగా డీఎన్‌ఏ టీకాలపై మొదటి నుంచి కొంత వ్యతిరేకత ఉంది. అయితే వైరల్ వెక్టర్స్ వంటి ఇతర హానికరమైన కణాల వాడకం లేనందువల్ల, తమ వ్యాక్సిన్‌పై ఆందోళన అవసరం లేదని జైడస్ సంస్థ చెబుతోంది. ఈ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు సైతం చాలా తక్కువగా ఉంటాయని ప్రకటించింది.

* అనుమతులు ఎలా మంజూరు చేస్తారు?
అత్యవసర వినియోగ అనుమతి కోసం జైడస్ కాడిలా చేసుకున్న దరఖాస్తును సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తనిఖీ చేస్తుంది. ఆ తరువాత ఈ సంస్థ నిపుణుల కమిటీ(SEC)తో సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలో వ్యాక్సిన్‌ డేటాను విశ్లేషించి అత్యవసర వినియోగ అనుమతులపై నిర్ణయం తీసుకుంటుంది. క్లినికల్ ట్రయల్స్‌ను 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారిపై కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కౌమారదశలో ఉన్నవారికి ఈ టీకాను సిఫారసు చేయడానికి తగినంత డేటా ఉందా? వ్యాక్సిన్ డోసుల సమర్థత, ప్రభావశీలత ఎలా ఉంది అనే వివరాలను సైతం నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది.

* ధర ఎంత ఉంటుంది?
అనుమతులు లభిస్తే ఈ ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. ప్రతి నెలా కోటి డోసులను.. 2021 డిసెంబర్ నాటికి ఐదు కోట్ల డోసులను సరఫరా చేయాలని భావిస్తోంది. అయితే జైకోవ్-డి వ్యాక్సిన్‌ ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Published by:Kishore Akkaladevi
First published: