ప్రముఖ పొదుపు పథకాల్లో ఒకటైన రికరింగ్ డిపాజిట్లు (Recurring Deposit) దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixid Deposit) మాదిరిగానే పనిచేస్తాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఒకేసారి మొత్తం నగదు జమ చేసినట్లు కాకుండా ఆర్‌డీలలో స్థిరంగా నెలవారీ (Monthly Deposits) డిపాజిట్లు చేయాలి. ఆర్‌డీల కాలపరిమితి (RD Tenures) ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ఆర్‌డీలలో పెట్టుబడి పెట్టే వ్యక్తులకు సాధారణ ఇన్వెస్టింగ్ అలవాటుగా మారుతుంది. పొదుపు విషయంలో కూడా ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. రికరింగ్ డిపాజిట్లను ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తున్నాయి. ఆర్‌డీల వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి.
అయితే సగటు పెట్టుబడిదారు ప్రతిసారీ కచ్చితంగా ఆర్‌డీ రిటర్న్స్ తెలుసుకోవడం చాలా క్లిష్టంగా మారుతుంటుంది. ఆర్‌డీ తీసుకునే ముందు వడ్డీ ఎంత లభిస్తుందనేది తెలుసుకోవాలని కస్టమర్లు భావిస్తుంటారు. అలాగే మెచూరిటీ పిరియడ్ లోగా చేతికందిన మొత్తంలో వడ్డీ ఎలా లెక్కకట్టారనేది కూడా అంతుచిక్కదు. అలాంటప్పుడు ఆర్‌డీ కాలిక్యులేటర్ లేదా ఫార్ములా చాలా ఉపయోగకరం గా మారుతుంది.
ఆర్‌డీ కాలిక్యులేటర్ మీకు ఎలా సహాయం చేస్తుంది?
పేరు సూచించినట్లుగా రికరింగ్ డిపాజిట్ అనేది నెల నెలా కట్టాల్సిన డిపాజిట్. ఈ డిపాజిట్లపై రాబడిని తెలుసుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుంది. వడ్డీ త్రైమాసికానికి మారుతూ ఉంటుంది. కాబట్టి అనేక వేరియబుల్స్ కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్‌డీ డిపాజిట్ కాలిక్యులేటర్/ఫార్ములా దాని రాబడిని మాన్యువల్‌గా లెక్కగట్టడానికి అనుమతిస్తుంది. కొత్త ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ఆర్‌డీలపై కూడా టీడీఎస్ పడుతుంది. అయినప్పటికీ ఆర్థిక సంస్థలలో దాని అమలుపై ఏకాభిప్రాయం లేనందున ఆర్‌డీ కాలిక్యులేటర్లు దాన్ని పరిగణనలోకి తీసుకోవు.
ఆ చిన్న మినహాయింపు తప్ప ఆర్‌డీ అమౌంట్ కాలిక్యులేటర్ పెట్టుబడిదారుడికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడికి వచ్చే కచ్చితమైన మొత్తాన్ని క్యాలిక్యులేటర్ తెలియజేస్తుంది. తద్వారా మరింత స్పష్టతతో వారు భవిష్యత్తులో తమ ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోవడం సులభతరమవుతుంది. క్యాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా పెట్టుబడిదారులకు చాలా సమయం ఆదా అవుతుంది. ఈ కాలిక్యులేటర్‌లు పూర్తి కచ్చితత్వంతో ఇంట్రస్ట్ రేట్, మెచూరిటీ వ్యాల్యూ తెలియజేస్తాయి. ఈ నేపథ్యంలో మాన్యువల్‌గా ఒక సూత్రం ద్వారా ఆర్‌డీ మెచూరిటీ మొత్తం, వడ్డీ తెలుసుకోవడానికి ఉపయోగపడే సూత్రాల గురించి చూద్దాం.
మెచూరిటీ మొత్తం కాలిక్యులేట్ చేయడానికి సూత్రం
A = P*(1+R/N)^(Nt)
ఇక్కడ
A= మెచూరిటీ మొత్తం
P= ఆర్‌డీ ప్రతినెలా వాయిదా
N = కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ (నంబర్ ఆఫ్ క్వార్టర్స్)
R = ఆర్‌డీ వడ్డీ రేటు శాతంలో
t = కాలపరిమితి (1 ఇయర్ =12/12)
పెట్టుబడి పెట్టబడిన మొత్తం లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా, ఆర్‌డీ మెచూరిటీ మొత్తాన్ని లెక్కించడంలో ఉపయోగించే ప్రామాణిక సూత్రం ఇది. మీరు చేయాల్సిందల్లా వేరియబుల్స్‌లో మీ నెలవారీ వాయిదా, కాలపరిమితి, వడ్డీ రేటు అప్లై చేయడమే.
ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 5000 పెట్టుబడితో 1 ఏడాది మెచూరిటీతో ఆర్‌డీ ఖాతాను ప్రారంభిస్తారని అనుకుందాం. 1 సంవత్సరం అంటే 4 త్రైమాసికాల కాలానికి ప్రతి నెలకు 5000 జమ చేస్తారని అనుకుందాం. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ 8% అని భావిస్తే.. ఈ నిర్దిష్ట డిపాజిట్‌పై తుది మెచూరిటీ మొత్తం కింది ఫార్ములాతో లెక్కించవచ్చు.
A = P * (1+R/N)^(Nt)
= 5000*(1+.0825/4)^(4*12/12) = 5425.44
= 5000*(1+.0825/4)^(4*11/12) = 5388.64
…
= 5000*(1+.0825/4)^(4*1/12) = 5034.14
ఈ సిరీస్ మొత్తాన్ని.. అంటే మొదటి నెలపై వచ్చే వడ్డీ, రెండో నెలపై వడ్డీ ఇలా చివరి నెల వరకు ఒక్కో వాయిదాపై లభించే వడ్డీలన్నీ యాడ్ చేయడం ద్వారా, మొత్తం మెచూరిటీ విలువ, అంటే A = రూ. 62,730.85 వస్తుంది. ఇక్కడ 8% వడ్డీకి 12 నెలల్లో 2,730 అందుతుందనేది కూడా గమనించొచ్చు.
ప్రతి నెలకు వచ్చే ఆర్‌డీ వడ్డీని A = P*(1+R/N)^(Nt) సూత్రం ద్వారా కాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ లింక్ లోని క్యాలిక్యులేటర్ ని వాడండి.
ఈ ఈక్వేషన్ ను మాన్యువల్‌గా పరిష్కరించడం సులువైన పని కాదు. అయితే రికరింగ్ డిపాజిట్ ఆన్ లైన్ కాలిక్యులేటర్ మీకు కచ్చితమైన మొత్తం కేవలం సెకన్లలో అందిస్తుంది. ఈ ఫార్ములా కాంపౌండ్ వడ్డీని లెక్కించడానికి చాలా మంది ఉపయోగించే పాపులర్ సూత్రం. బ్యాంకులు సాధారణంగా డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని అందిస్తాయి.
రికరింగ్ డిపాజిట్ వడ్డీ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు:
రికరింగ్ డిపాజిట్ పై వడ్డీకి పన్ను వర్తిస్తుంది. ఈ వడ్డీ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి యాడ్ అవుతుంది. మీరు ఉన్న స్లాబ్ ఆధారంగా ఆదాయంపై పన్ను చెల్లించాలి.
రికరింగ్ డిపాజిట్ పథకం కింద వడ్డీని ఎలా లెక్కిస్తారు?
రికరింగ్ డిపాజిట్ పథకం కింద.. ఇన్వెస్ట్ చేసిన డబ్బు, పదవీకాలం, ఎంచుకున్న ఆర్‌డీ పథకం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వడ్డీని లెక్కిస్తారు.
మీరు ఆర్‌డీ కాలిక్యులేటర్ లేదా కింద పేర్కొన్న ఫార్ములా ఉపయోగించి వడ్డీని లెక్కించవచ్చు:
ఆర్‌డీ వడ్డీ ఫార్ములా
M = R [(1+i)^n (-1)]/ [1 – (1+i)^(-1/3)]
‘M’ అంటే మెచూరిటీ విలువ
‘R’ అంటే నెలవారీ వాయిదా
'n' అంటే క్వార్టర్స్ సంఖ్య
'i' అంటే వడ్డీ రేటు/400
వడ్డీ = M - మెచూరిటీ వరకు చెల్లించిన వాయిదాల మొత్తం
***మీరు ఇంకొక ఫార్ములా ద్వారా కూడా ఆర్‌డీ వడ్డీని చాలా ఈజీగా లెక్కకట్టొచ్చు. ఆ ఫార్ములా**
I = P*n(n+1)r
---------
2400
ఇక్కడ I = వడ్డీ, n = నెలలలో సమయం.. r = సంవత్సరానికి వడ్డీ రేటు, P = నెలవారీ డిపాజిట్
పై ఫార్ములా వాడటం ద్వారా దాదాపు కచ్చితత్వంతో ఆర్‌డీ వడ్డీని లెక్కించవచ్చు. రికరింగ్ డిపాజిట్‌పై మీరు పొందే వడ్డీని తెలుసుకోవడానికి మీరు రికరింగ్ డిపాజిట్ మెచూర్ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్‌డీ వడ్డీని I =[P*n(n+1)r]/2400 ఫార్ములాతో తెలుసుకోవచ్చు. అయితే, ఆన్ లైన్ కాలిక్యులేటర్ కొంచెం వేగంగా పైసలతో సహా కచ్చితత్వంతో ఫలితాలనిస్తుంది.
పై ఫార్ములా కూడా దాదాపు వడ్డీ మొత్తం ఆదాయం తెలియజేస్తుంది. తాత్కాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఆర్‌డీ ఖాతాను ఎంత మొత్తం తో ఎన్ని సంవత్సరాలకు ఓపెన్ చేయవచ్చో నిర్ణయించుకునే ముందు వడ్డీని, మెచూరిటీ మొత్తాన్ని కాలిక్యులేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు పైన ఇచ్చిన అన్ని సూత్రాలు కూడా మీకు ఉపయోగపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Recurring Deposits