HOW COVOVAX BOOSTER IS MUCH BETTER THAN COVISHIELD IN FIGHT WITH COVID OMICRON MKS GH
Explained: భారత్‌లో బూస్టర్ డోసుగా కొవావ్యాక్స్ -Omicron కట్టడిలో ఒకొవిషీల్డ్ కంటే బెటర్
నోవావాక్స్ తయారీ కొవావ్యాక్స్ టీకా
కోవిషీల్డ్ రెండు డోసులు పొందినవారికి ఇదే వ్యాక్సిన్‌ను మూడో డోసును బూస్టర్ షాట్‌గా ఇవ్వడానికి బదులుగా.. కొవావ్యాక్స్ లాంటి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.
కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు చట్టసభ సభ్యులు సైతం దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా అమెరికా సెనేటర్లు ఎలిజబెత్ వారెన్, కోరీ బుకర్ కోవిడ్ బారిన పడ్డారు. వీరు ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు. దీంతో కొత్త వేరియంట్లపై mRNA బూస్టర్ డోసులు సమర్థంగా పనిచేయలేవని తెలుస్తుందంటూ ట్వీట్ చేశారు బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్ షా. నోవావాక్స్ సంస్థ తయారు చేసిన కొత్త వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో చూడాలని చెప్పారు. భారతదేశంలోని పూణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ (SII) సాయంతో నోవావాక్స్ కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. భారత్‌లో దీన్ని కోవోవాక్స్ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించారు. దీని అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా అనుమతులు మంజూరు చేసింది.
కోవిషీల్డ్ రెండు డోసులు పొందినవారికి ఇదే వ్యాక్సిన్‌ను మూడో డోసును బూస్టర్ షాట్‌గా ఇవ్వడానికి బదులుగా.. ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు మంచి ఎంపిక అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విభాగానికి చెందిన కోవోవాక్స్ వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
* కోవోవాక్స్‌ను ఎవరు తయారు చేస్తున్నారు?
అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న ‘నోవావాక్స్’ అనే బయోటెక్ కంపెనీ తీవ్రమైన అంటు వ్యాధుల కోసం నెక్స్ట్ జెనరేషన్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. మహమ్మారి నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్లను రూపొందించడానికి ఈ కంపెనీ నానోపార్టికల్ బేస్డ్ విధానాన్ని అవలంభించింది. గత ఏడాది ఆగస్టులో వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నప్పుడే ఈ సంస్థ భారత్‌కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ (SII)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్ సహా తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు కనీసం100 కోట్ల వ్యాక్సిన్ డోసును ఉత్పత్తి చేయాలని ఈ రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. డిసెంబర్ 17న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవోవ్యాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. దీన్ని NVX-CoV2373 పేరుతో పిలుస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం సీరం సంస్థ గతంలో DCGIకి దరఖాస్తు చేసింది. ఆ తరువాత భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC).. కోవోవ్యాక్స్‌కు సంబంధించి SII నుంచి మరింత డేటా కోరింది. ఈ వ్యాక్సిన్, నోవావాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించిన సాంకేతికత బదిలీ అని, USలో దీని వినియోగానికి ఇంకా అనుమతులు రాలేదని SEC పేర్కొన్నట్లు గత నివేదికలు తెలిపాయి.
* నోవోవాక్స్ వ్యాక్సిన్ ఎలాంటి వర్గానికి చెందినది?
కోవోవ్యాక్స్ అనేది "రీకాంబినెంట్ నానోపార్టికల్" వ్యాక్సిన్. ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్ల కంటే ఇది భిన్నమైనది. ఏదైనా రెగ్యులేటరీ ఏజెన్సీ నుంచి లాంచ్ చేయడానికి ఆమోదం పొందిన మొదటి ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ ఇదేనని నోవావాక్స్ సంస్థ పేర్కొంది. కోవిడ్-19 వ్యాక్సిన్లు ఎక్కువగా కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇందుకు అనేక పద్ధతులను శాస్త్రవేత్తలు అనుసరిస్తారు. వీటిలో కోవోవాక్స్ ప్రోటీన్ సబ్ యూనిట్ విభాగానికి చెందినది.
ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్లలో నావెల్ కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్ శకలాలు ఉంటాయి. కానీ దానికి సంబంధించిన జన్యు పదార్థం మాత్రం ఉండదు. ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి నోవావాక్స్ శాస్త్రవేత్తలు ముందు స్పైక్ జన్యువును వేరు చేశారు. ఆ తరువాత జన్యువును మోత్ కణాల్లోకి (moth cells) తీసుకువెళ్లడానికి మరొక వైరస్‌ను ఉపయోగించారు. ఇలా కరోనావైరస్ ఉపరితలంపై కనిపించే స్పైక్‌లను సృష్టించారు. ఈ స్పైక్స్‌ను ఉత్పత్తి చేసి నానోపార్టికల్స్‌గా వ్యాక్సిన్‌తో కలిపి అందించారు.
ఈ వ్యాక్సిన్‌లో వైరస్‌కు సంబంధించిన అవశేషాలు లేనందున, ఇవి చాలా సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిని ఉత్పత్తి చేయడం చాలా సులభం. అయితే ఈ వ్యాక్సిన్లు ప్రోటీన్‌ను మాత్రమే కలిగి ఉంటాయి. టార్గెట్ వైరస్‌కు సంబంధించిన జన్యుపరమైన సమాచారాన్ని కలిగి ఉండవు. కాబట్టి, ఇతర రకాల టీకాల కంటే వీటిద్వారా రోగనిరోధక ప్రతిస్పందన బలహీనంగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధక ప్రతిస్పందనను పెంపొందించడానికి, అధిక స్థాయిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్‌ని ప్రేరేపించడానికి ‘Matrix-M’ అనే అదనపు (adjuvanted) సహాయక వ్యాక్సిన్‌ను కోవోవ్యాక్స్ తయారీలో వాడినట్లు SII తెలిపింది. నోవావాక్స్ సంస్థ నుంచి పేటెంట్ పొందిన మ్యాట్రిక్స్- Mను ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ టీకాను రెండు డోసులుగా 0.5 ml చొప్పున 21 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద సైతం ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయవచ్చు.
* వివిధ వేరియంట్లపై ఎంత మేరకు ప్రభావం చూపగలదు?
కోవోవ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను పొందింది. దీని మొత్తం ప్రభావశీలత 89.7 శాతంగా ఉంది. Sars-CoV-2 మొదటి తరం వైరస్ జన్యు శ్రేణికి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని, ఇది 96.4 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని ఈ ఏడాది ఆగస్టులో నోవావాక్స్ ప్రకటించింది. ఆందోళన రకం వేరియంట్లు అయిన ఆల్ఫాపై 86.3 శాతం సమర్థతను ప్రదర్శించింది. అయితే బీటా వేరియంట్‌పై మాత్రం దీని ప్రభావశీలత రేటు 49 శాతంగానే నమోదైంది. అయితే రెండో డోసు ఇచ్చిన ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇస్తే, యాంటీబాడీల పెరుగుదల 4.6 రెట్లుగా నమోదైందని నోవావాక్స్ వెల్లడించింది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌పై సైతం పనిచేసేలా ఈ వ్యాక్సిన్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.