బ్రిటన్‌లో ఇంధన సంక్షోభానికి దారితీసిన ట్రక్కు డ్రైవర్ల కొరత.. ఈ సమస్యకు కారణాలేంటి? దీన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది?

బ్రిటన్‌లో ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతున్నది? (File Photo)

ట్రక్కు డ్రైవర్ల కొరత బ్రిటన్‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య కారణంగా ఇంధన సంక్షోభం సైతం ఏర్పడుతోంది. గత కొన్ని రోజులుగా ఇంధన కొరత ఏర్పడటంతో వినియోగదారులు బంకుల వద్ద క్యూలు కడుతున్నారు.

  • Share this:
ట్రక్కు డ్రైవర్ల (Truck Drivers) కొరత బ్రిటన్‌ను (Britain) తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య కారణంగా ఇంధన (Fuel) సంక్షోభం  సైతం ఏర్పడుతోంది. గత కొన్ని రోజులుగా ఇంధన కొరత ఏర్పడుతోందనే ఊహాగానాలతో వాహనదారులు (Vehicle Owners) పెట్రోల్ బంకుల (Petrol Pumps) వద్ద వరుసలు కడుతున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో UK లోని పెట్రోల్ స్టేషన్ల వద్ద పెద్దపెద్ద క్యూ లైన్లు కనిపించాయి. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం.. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతోంది. కానీ ట్రక్ డ్రైవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య తలెత్తుతోందని ప్రకటించింది.

ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణం కోవిడ్ మహమ్మారి అని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు, బ్రిటిష్ ప్రజలు మాత్రం బ్రెగ్జిట్ కారణంగానే ఈ సంక్షోభం ఎదురైందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుత సమస్యకు కారణాలు ఏంటనే వివరాలు తెలుసుకుందాం.

* ఈ సంక్షోభం ప్రభావం ఎలా ఉంది?
తమ దేశంలో ఇంధన కొరత ఏమాత్రం లేదని బ్రిటిష్ ప్రభుత్వం, అక్కడి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ ఫ్యూయెల్ స్టేషన్‌ల బయట కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం వేరేలా ఉన్నాయి. కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లు.. ప్రస్తుతం ఇంధనం లేదని ప్రకటించాయి. మరికొన్ని బంకుల ముందు వాహనాలు బారులుతీరాయి. ఈ క్రమంలో బ్రిటన్‌లో 1,000 కి పైగా ఫ్యూయెల్ స్టేషన్లను నిర్వహిస్తున్న BP సంస్థ స్పందించింది. సెప్టెంబర్ 26న దాదాపు మూడో వంతు స్టేషన్లలో రెండు ప్రధాన గ్రేడ్ల ఇంధనం అయిపోయిందని ఆ సంస్థ ప్రకటించింది. ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురవుతూ సొంతంగా ఇంధనాన్ని నిల్వచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత మూడు రోజులుగా పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం కొరత కొనసాగుతుంది. దీనికి తోడు వారాంతాల్లో డిమాండ్ అధికమైంది. ఫలితంగా ఫ్యూయెల్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయని BP సంస్థ చెబుతోంది. తమ ఫ్యూయెల్ సెంటర్లలోని 90 శాతం అవుట్‌లెట్లకు డెలివరీలు తగ్గించినట్లు తెలిపింది. ప్రస్తుతం కొన్ని గ్రేడ్‌ల ఇంధనం కొరత ఉందని ‘షెల్’ అనే మరో సంస్థ సైతం ప్రకటించింది.

* ఈ సమస్యకు ట్రక్ డ్రైవర్లు కారణమా?
రెండేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అత్యధిక స్థాయిలో ఉంటున్నాయి. అయితే బ్రిటన్‌లో ఇంధన కొరతకు ఇది కారణం కాదు. ట్రక్కు డ్రైవర్ల కొరత కారణంగానే ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందని బ్రిటన్‌ ప్రభుత్వం, చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఆ దేశంలో దాదాపు లక్ష మంది ఆపరేటర్ల కొరత ఉందని పరిశ్రమ వర్గాలు గుర్తించాయి. వాస్తవానికి ఆ దేశంలో లారీ డ్రైవర్ల కొరత ఒక తీవ్రమైన సంక్షోభంగా మారింది. గత ఏడాది యూరోపియన్ యూనియన్ నుంచి దాదాపు 25,000 మంది HGV (హెవీ గూడ్స్ వెహికల్) డ్రైవర్లు వెళ్లిపోయారు.

మరోవైపు దేశంలో HGV పరీక్షల కోసం 40,000 మంది ఎదురుచూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. UKలో ట్రక్ డ్రైవర్ల సగటు వయస్సు 57 సంవత్సరాలుగా ఉంది. వీరు రిటైర్ అవుతున్నా కొద్దీ ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. ఈ వృత్తిని ఎంచుకునే వారి సంఖ్య సైతం తగ్గుతోంది. అయితే ఈ సంక్షోభానికి అసలు కారణం మాత్రం బ్రెగ్జిట్ అని నివేదికలు చెబుతున్నాయి.

* సంక్షోభానికి బ్రెగ్జిట్‌కి ఏం సంబంధం?
యూరోపియన్ యూనియన్ (EU) నుంచి UK అధికారికంగా బయటకు వెళ్లే ప్రక్రియే ఈ బ్రెగ్జిట్. ఇది గత సంవత్సరం జనవరిలో అమల్లోకి వచ్చింది. దీంతో ఆ దేశంలో కొత్త ఇమ్మిగ్రేషన్ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇతర EU దేశాల కార్మికులు బ్రిటన్‌లో నివసించడానికి, వీసా లేకుండా పని చేయడానికి అనుమతులు రద్దయ్యాయి. దీంతో గత ఏడాది నుంచి యూకే నుంచి కార్మికులు వెళ్లిపోతున్నారు.

బ్రెగ్జిట్ తరువాత కార్మికుల కొరతను అంచనా వేయడంలో విఫలమైనందుకు కన్సర్వేటివ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నిప్పులు చెరిగారు. ఇది వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో సహా బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని చెప్పారు. అయితే మహమ్మారి కారణంగానే ట్రక్ డ్రైవర్ల కొరత, ఇంధన కొరత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. ఇది తాత్కాలిక సమస్య అని పేర్కొంది.

* ఈ సంక్షోభాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది?
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ట్రక్కు డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా 5,000 తాత్కాలిక వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. బ్రెగ్జిట్‌ లక్ష్యాలకు విరుద్ధంగా.. అయిష్టంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని UK రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ తెలిపారు. తక్కువ జీతాలకు పనిచేసే యూరోపియన్ డ్రైవర్లను ట్రక్కర్ల సంఘాలు విస్మరించారని చెప్పారు.

బ్రెగ్జిట్ తరువాత.. ఇతర యూరప్ దేశాలకు చెందిన చౌకైన కార్మికులపై ఆధారపడటాన్ని దేశీయ కంపెనీలు తగ్గించుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం కోరింది. అధిక వేతనం, అధిక నైపుణ్యం కలిగిన ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని బ్రిటిష్ PM ఆఫీస్‌కు చెందిన ఒక ప్రతినిధి BBCకి చెప్పారు. దీర్ఘకాల స్థితిస్థాపకత (resilience) కోసం వ్యాపారాలు రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్‌పై ఎక్కువ పెట్టుబడులను స్వీకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే దేశం విడిచి వెళ్లిన కార్మికుల స్థానంలో కొత్తవాళ్లను రాత్రికి రాత్రే భర్తీ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.

అయితే ట్రక్ డ్రైవర్లకు తాత్కాలిక వీసాలు మంజూరు చేయడం ఈ సమస్యకు స్వల్పకాలిక పరిష్కారమని, క్రిస్మస్ నాటికి లేబర్ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బ్రిటన్‌లో ఇతర రంగాలు సైతం కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పౌల్ట్రీ కార్మికులకు 5,500 తాత్కాలిక వీసాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రక్ డ్రైవర్లుగా దేశీయ ఉద్యోగులను నియమించేందుకు ఉద్దేశించిన పరీక్షలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. డ్రైవర్లకు శిక్షణలో సహాయపడటానికి రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రక్షణ శాఖకు చెందిన నిపుణుల సహాయంతో 4,000 మందికి HGV డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Published by:John Naveen Kora
First published: