హోమ్ లోన్ అర్హత ప్రమాణాలను (Home Loan Eligibilities) అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) ప్రత్యేకంగా నిర్దేశించుకుంటాయి. ఈ జాబితాలో రుణదాత అవసరాలకు అనుగుణంగా వర్తించే నిర్దిష్ట ప్రమాణాలు కూడా ప్రత్యేకంగా ఉండవచ్చు. అయితే అన్ని సంస్థలు కొన్ని సాధారణ పారామితులను కలిగి ఉంటాయి. హోమ్ లోన్‌కు (Home Loan) అర్హత పొందేందుకు అవసరమైన ప్రమాణాలను రుణ గ్రహీతలు అర్థం చేసుకోవాలి. దీనివల్ల దరఖాస్తు ప్రక్రియ (Home Loan Application Process) సులభతరం అవుతుంది. అయితే హోమ్ లోన్ ఎలిజిబిలిటీ అనేది రుణగ్రహీతల ఆదాయాలు, క్రెడిట్ ప్రొఫైల్, బ్యాంక్‌తో ఇప్పటికే ఉన్న సంబంధాలు.. వంటి వివిధ రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది.
హోమ్ లోన్ అర్హత ప్రమాణాలు (Home Loan Eligibilities)
వయసు:
రుణ గ్రహీతల కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 70 సంవత్సరాలుగా ఉండాలి.
నివాసం రకం (Resident Type):
దరఖాస్తుదారులు భారత పౌరులు లేదా నాన్-రెసిడెంట్ ఇండియా (NRI) లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులై (PIO) ఉండాలి.
ఉపాధి (Employment):
రుణ గ్రహీతలు నెలవారీ జీతం పొందేవారు లేదా స్వయం ఉపాధి ఆదాయ మార్గంగా ఉన్నవారై ఉండాలి.
పని అనుభవం:
రుణ దాతలను బట్టి 1- 2 సంవత్సరాల కనీస పని అనుభవం అవసరం.
నికర వార్షిక ఆదాయం (Net Annual Income):
ఇది ఉపాధి రకాన్ని బట్టి కనీసం రూ.5-6 లక్షలుగా ఉండాలి.
నివాసం (Residence):
దరఖాస్తుదారులకు శాశ్వత నివాసం ఉండాలి. లేదా రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు కనీసం ఒక సంవత్సరం పాటు స్థిరంగా అద్దె నివాసంలో ఉండాలి.
క్రెడిట్ స్కోర్ (Credit score):
గుర్తింపు పొందిన క్రెడిట్ బ్యూరో నుంచి దరఖాస్తుదారులు కనీసం 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.
ఆస్తి రకం (Property Type):
ఏదైనా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లేదా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్ కోసం లోన్ తీసుకోవచ్చు. భూమి/ప్లాట్ కొనుగోలు, సొంత స్థలంలో ఇల్లు నిర్మించడం, స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించడం వంటి అవసరాల కోసం హోమ్ లోన్ తీసుకోవచ్చు.
హోమ్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ (Home Loan Eligibility Calculator)
సాధారణంగా హోమ్ లోన్ అర్హత అనేది రుణగ్రహీతల నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయసు, క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, పదవీ విరమణ వయసు.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే హోమ్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్లను ఉపయోగించి గృహ రుణాల అర్హతకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి మీ లోన్ అర్హతను అర్థం చేసుకోవడానికి ఈ క్యాలిక్యులేటర్లు సాయం చేస్తాయి. అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ వెబ్సైట్లలో ప్రత్యేకంగా ఆన్లైన్ హోమ్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటితో పాటు కొన్ని థర్డ్‌పార్టీ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాంలు సైతం వివిధ బ్యాంకుల హోమ్ లోన్ అర్హతలను పోల్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటి సాయంతో సులభంగా హోమ్ లోన్లను పోల్చుకుంటూ ఉత్తమమైన రుణాన్ని ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా హోమ్ లోన్ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.
హోమ్ లోన్ అర్హతను ప్రభావితం చేసే అంశాలు
హోమ్ లోన్ అర్హతను కొన్ని అంశాలు నేరుగా ప్రభావితం చేయగలవు. అవేంటంటే..
వయో పరిమితి:
గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత/ఫైనాన్షియర్ పరిగణించే మొదటి, అతి ముఖ్యమైన అంశం ఇది. సాధారణంగా ఆర్థిక సంస్థలు హౌస్ లోన్ గడువును ప్రాథమిక దరఖాస్తుదారుల (primary applicant) పదవీ విరమణ వయసుకి పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాయి. అంటే 20లు, 30లలో ఉన్న యువ నిపుణులు ఎటువంటి ఇబ్బంది లేకుండా 25 సంవత్సరాల వరకు రుణాన్ని పొందవచ్చు. కానీ 40 ఏళ్లు దాటిన వారు ఎక్కువ గడువుతో హోమ్ లోన్‌కు అర్హత పొందడం చాలా కష్టం. ఈ ప్రాతిపదికన రుణదాతలు 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగత దరఖాస్తుదారులకు పూర్తిగా గృహ రుణాలను తిరస్కరిస్తుంటారు.
ఆదాయం:
లోన్ విషయంలో ఆదాయాన్ని జీతం (Salaried Individual), వృత్తిపరమైన ఆదాయం (Independent Professionals), స్వయం ఉపాధిగా (Self Employed) వర్గీకరిస్తుంటారు. దరఖాస్తుదారులు ఈ మూడింట్లో ఏ విభాగానికి చెందినా, స్థిరమైన ఆదాయ వనరు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారులు సంపాదిస్తున్న వ్యక్తి అయితే, లోన్ తీసుకోవడం కాస్త సులువు అవుతుంది.
జీతం పొందే వ్యక్తులు
ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నవారు ఈ విభాగానికి చెందుతారు. దరఖాస్తు సమయం నాటికి వీరు ప్రస్తుత సంస్థలో కనీసం ఒక సంవత్సరం వరకు ఉద్యోగం చేసి ఉండాలని చాలా బ్యాంకులు పట్టుబడుతున్నాయి. పే స్లిప్‌లు, ఫారం 16, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఎంప్లాయర్ రిఫరెన్స్ లెటర్.. వంటి డాక్యుమెంట్లను రుణదాతలు అడుగుతారు. సహ-దరఖాస్తుదారులు, గ్యారంటర్లకు (లోన్‌కు వర్తిస్తే) కూడా ఇవే రుజువులు అవసరం.
స్వతంత్ర నిపుణులు
వైద్యులు, దంతవైద్యులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు వంటివారు ఈ కోవకు చెందుతారు. రుణదాతలు బ్యాంకు స్టేట్మెంట్లు, ఐటీఆర్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
స్వయం ఉపాధి
సొంత కంపెనీ లేదా వ్యాపారం ఉన్నవారు.. షేర్లు లేదా అద్దె ద్వారా ఆదాయం పొందేవారు.. ఇతర ఆదాయ మార్గాలు ఉన్నవారు ఈ విభాగానికి చెందుతారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, పన్ను సంబంధిత పత్రాలతో వీరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వడ్డీ రేటు: (Home Loan Interest rate)
హోమ్ ఫైనాన్స్ అర్హత వడ్డీ రేటుకు విలోమానుపాతంలో (inversely proportional) ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, లోన్‌కు అర్హత పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుతో అందించే లోన్లను సులభంగా పొందవచ్చు.
లోన్ టర్మ్: (Home Loan Term)
దీర్ఘకాల లోన్ గడువును ఎంచుకుంటే, లోన్‌కు అర్హత మెరుగుపడుతుంది. EMIలు కూడా తగ్గుతాయి. కానీ కొన్నిసార్లు ఇందుకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
చెల్లించాల్సిన రుణాలు (Outstanding Loans):
గతంలో ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి తీసుకున్న రుణాలను సెటిల్ చేయకపోతే.. మీ రుణ అర్హత బాగా తగ్గుతుంది.
CIBIL స్కోర్ రిపోర్ట్:
బ్యాంకులు మీ క్రెడిట్ రీపేమెంట్ హిస్టరీని ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయిన CIBIL (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) నుంచి కూడా పరిశీలిస్తాయి. మీకు, రుణదాతలు/క్రెడిటర్ల మధ్య క్రెడిట్ హిస్టరీని సిబిల్ నివేదిక విశ్లేషిస్తుంది. ప్రతి అంశానికి చెందిన వివరణాత్మక రికార్డుల్లో ఏవైనా ప్రతికూలతలు ఉంటే, మీ లోన్ అర్హత గణనీయంగా తగ్గిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan