హోమ్ /వార్తలు /Explained /

Talibans: అసలు ఎవరీ తాలిబన్లు.. బలమైన రాజకీయ శక్తిగా ఎలా ఎదిగారు?.. వీరి లక్ష్యంగా ఏమిటి ?

Talibans: అసలు ఎవరీ తాలిబన్లు.. బలమైన రాజకీయ శక్తిగా ఎలా ఎదిగారు?.. వీరి లక్ష్యంగా ఏమిటి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోవియట్ దళాలు వైదొలిగిన తరువాత దేశంలోని ఉత్తర ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల కోసం తాలిబన్ సంస్థ ఏర్పడింది. వీరిలో కొందరు సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ పోరాట యోధులు ఉన్నారు.

అమెరికా దళాలు వీడిన తరువాత అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. అఫ్గాన్ దళాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నప్పటికీ తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను వారు ఆధీనంలోకి తీసుకున్నారు. విదేశీ బలగాల ఉపసంహరణ తరువాత నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలోని 65 శాతం భూభాగాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అఫ్గాన్‌లోని ఏడు ప్రావిన్సులను తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం నైరుతి అఫ్గాన్ ప్రావిన్స్‌ రాజధాని ఫరా నగరాన్ని, ఉత్తర ప్రావిన్స్ సమంగాన్ రాజధాని అయబాక్‌ను వారు ఆధీనంలోకి తీసుకున్నారు. గత వారాంతంలో మూడు ప్రావిన్షియల్ రాజధానులను వశం చేసుకున్నారు. దక్షిణ నిమ్రోజ్ ప్రావిన్స్ రాజధాని జరాంజ్, ఉత్తర నిమ్రోజ్ ప్రావిన్స్ రాజధాని సార్-ఇ-పుల్, ఈశాన్య తఖర్ ప్రావిన్స్ రాజధాని తలోకాన్ ప్రాంతాలు వారి పరిపాలనలోకి మారాయి. అంతకు ముందే ఉత్తర ప్రావిన్షియల్ రాజధాని కుండుజ్, నైరుతి హెల్మాండ్ ప్రావిన్స్ రాజధాని లష్కర్ గాహ్‌ నగరాలను సైతం ఆధీనంలోకి తీసుకున్నారు.

ఆ దేశం నుంచి యూఎస్ సైనిక దళాలు స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించిన తరువాత.. అఫ్గాన్‌లో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని తాలిబన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ దళాలు, ప్రజలపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. గత 72 గంటల్లో దక్షిణ కందహార్ ప్రావిన్స్‌లో 20 మంది పిల్లలు చనిపోయారని, 130 మంది పిల్లలు గాయపడ్డారని యూనిసెఫ్ సోమవారం తెలిపింది. దీన్ని బట్టి అక్కడ పరిస్థితులు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.

* అసలు తాలిబన్లు ఎవరు?

1990ల ప్రారంభంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఉద్భవించింది. తాలిబన్ అంటే విద్యార్థులు అని అర్థం. సోవియట్ ఆక్రమణకు వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిద్దీన్ లేదా ఇస్లామిక్ గెరిల్లా పోరాట యోధులు ఒక దశాబ్దం పాటు యుద్ధం చేశారు. అప్పట్లో వారికి అమెరికా, ఇతర దేశాల నుంచి నిధులు అందాయనే వాదనలు ఉన్నాయి. 1989లో సోవియట్ యూనియన్ దళాలు వెనక్కు వెళ్లడంతో వారిపై ఆధారపడి పరిపాలిస్తున్న అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం పతనమైంది. 1992 నాటికి ముజాహిదీన్ ప్రభుత్వం ఏర్పడింది.

సోవియట్ దళాలు వైదొలిగిన తరువాత దేశంలోని ఉత్తర ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల కోసం తాలిబన్ సంస్థ ఏర్పడింది. వీరిలో కొందరు సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ పోరాట యోధులు ఉన్నారు. ఆ తరువాత ఇది అతివాద సున్నీ మత సంస్థల చేతుల్లోకి వెళ్లింది. దీనికి సౌదీ అరేబియా నుంచి నిధులు అందేవి. ముందు ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసినప్పటికీ, ఆ తరువాత ఆధిపత్య ధోరణిని ఈ సంస్థ అవలంభించింది. 1994లో తాలిబన్లు దక్షిణ అఫ్గానిస్థాన్ నుంచి సైనిక ప్రచారాన్ని ప్రారంభించారు. 1996 నాటికి ఈ బృందం పెద్దగా ప్రతిఘటన లేకుండా అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకుంది.

* తాలిబన్లపై అమెరికా యుద్ధం

ఆగస్టు 31 లోపు అమెరికా సైనికులు అఫ్గాన్‌ను వీడుతారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. కాబూల్‌లోని యూఎస్ రాయబార కార్యాలయానికి రక్షణగా 650 మంది అమెరికా సైనికులు అక్కడ విధులు నిర్వర్తిస్తారు. మిగతా బలగాలు స్వదేశానికి చేరుకుంటాయి. 9/11 దాడుల అనంతరం అఫ్గాన్‌లో అడుగుపెట్టిన 20 సంవత్సరాల తరువాత యూఎస్ సైనికులు ఆ దేశాన్ని వీడనున్నారు. అల్-ఖైదా గ్రూపును నిర్మూలించడం, అఫ్గాన్‌ నుంచి మరోసారి అమెరికాపై దాడులు చేసే అవకాశం లేకుండా చేయడం.. వంటి లక్ష్యాలను చేరుకున్నామని బైడెన్ తెలిపారు. అయితే ఆ దేశ పునర్నిర్మాణం తమ పని కాదని బైడెన్ అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్థాన్‌లో సైనిక కార్యకలాపాలకు కీలకమైన బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను యూఎస్ దళాలు ఇప్పటికే ఖాళీ చేశాయి. అమెరికా దళాల ఉపసంహరణ 90 శాతం పూర్తయిందని యూఎస్ రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. అయితే సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని బైడెన్ అంగీకరించారు. అక్కడి ప్రభుత్వం మొత్తం దేశాన్ని నియంత్రించే అవకాశం చాలా తక్కువని చెప్పారు.

* అవకాశంగా మార్చుకుంటున్న చైనా

గత నెలాఖరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో తాలిబన్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. వాంగ్‌ యి తో సీనియర్ తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్, ఇతర ప్రతినిధుల బృందం టియాంజిన్ నగరంలో సమావేశమయ్యారు. తాలిబన్లు చట్టబద్ధంగా అధికారాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో చైనా మద్దతు కోరుతున్నట్లు తెలుస్తోంది. చైనా కూడా ఈ విషయంపై దృష్టి సారించింది.

చైనా, అఫ్గాన్‌ల మధ్య వాఖాన్ లోయ ప్రాంతంలో సరిహద్దు ఉంటుంది. గతంలో అస్థిర పరిస్థితులు నెలకొన్న జిన్జియాంగ్ ప్రాంతంలోకి.. ఈ సరిహద్దు నుంచి ఇస్లామిక్ మిలిటెన్సీ గ్రూపులు విస్తరించే అవకాశం ఉందని చైనా ఆందోళన చెందింది. అయితే తాలిబన్లతో సఖ్యత వల్ల ఈ ప్రమాదాన్ని నిరోధించవచ్చని ఆ దేశం భావిస్తోంది. అఫ్గాన్‌తో చమురు, గ్యాస్, రాగి తవ్వకాల కోసం చైనా గతంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయినప్పటికీ అవి చాలాకాలంగా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో సయోధ్య ఉంటే అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని చైనా భావిస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు కీలక సైనిక, రాజకీయ శక్తిగా ఎదుగుతారని.. ఆ దేశంలో శాంతి, సయోధ్య, దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని వాంగ్ చెప్పడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

* పాకిస్థాన్ ఏమంటోంది?

అఫ్గాన్‌లో శాంతికి పాకిస్థాన్ కీలకమని చెప్పవచ్చు. తాలిబన్ల ప్రధాన కార్యాలయం దాయాది దేశంలోనే ఉంది. వారి పరపతిని పాకిస్థాన్ సైతం ఉపయోగించుకుంటోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతి మంత్రాన్ని జపించేందుకు పాక్‌కు తాలిబన్ల రూపంలో ఒక ఆధారం దొరికినట్లు కనిపిస్తోంది. తాము లక్షలాది మంది అఫ్గాన్ శరణార్థులకు పునరావాసం కల్పిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ గొప్పలు చెబుతున్నారు.

* రష్యాకు హామీ

తాలిబాన్ల ప్రతినిధి బృందం గత నెలలో రష్యాలో సైతం పర్యటించారు. అఫ్గాన్‌లో తమ కార్యకలాపాల వల్ల రష్యాకు గానీ, మధ్య ఆసియాలోని రష్యా మిత్రదేశాలకు గానీ ఎలాంటి ప్రమాదం ఉండదని తాలిబన్లు హామీ ఇచ్చారు. అయితే తాలిబన్ల ఆక్రమణల కారణంగా వందలాది మంది అఫ్గాన్‌ సైనికులు సరిహద్దు దాటి రష్యన్ సైనిక స్థావరానికి ఆతిథ్యం ఇచ్చే తజికిస్థాన్‌కు పారిపోయి తలదాచుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌తో దక్షిణ ప్రాంతంలో ఉన్న తమ సరిహద్దును బలోపేతం చేయడానికి తజికిస్థాన్ 20,000 మంది సైనికులను మోహరించింది. ఈ క్రమంలో రష్యా లేదా పొరుగు దేశాలపై దాడి చేయడానికి అఫ్గాన్‌ భూభాగాన్ని ఉపయోగించడానికి తాము ఎవరినీ అనుమతించబోమని తాలిబన్ ప్రతినిధి మొహమ్మద్ సోహైల్ షహీన్ పేర్కొన్నారు. రష్యాతో తమకు మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.

* ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?

ఇస్లామిక్ షరియా చట్టాలను కఠినంగా అమలు చేయడంతో పాటు ప్రజలను దారుణంగా హింసించిన తాలిబన్ల చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించింది. 1996 నుంచి 2001 వరకు కొనసాగిన తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌ పౌరులపై మారణకాండ కొనసాగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడటంతో దేశ పౌరులకు ఆహారం సరఫరా చేస్తామని ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితిని తాలిబన్లు అడ్డుకున్నారు. సారవంతమైన పంట భూములను ఉగ్రవాదులు తగలబెట్టారు. పదివేల ఇళ్లను ధ్వంసం చేశారు. 2010లో అఫ్గాన్‌ పౌరుల మరణాల్లో 76 శాతం, 2011లో 80 శాతం, 2012లో 80 శాతం మరణాలకు తాలిబన్లు, దాని వారి మిత్రదేశాలే కారణమని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి.

* భారత్ వైఖరి ఏంటి?

భారత దేశం సైతం అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వాన్ని ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి సాయం, పునర్నిర్మాణం కోసం దాదాపు 3 బిలియన్ డాలర్ల మేర సాయం చేసింది. సంపన్నమైన, సురక్షితమైన భవిష్యత్తు కోసం అన్ని శక్తులూ కలిసి పని చేయాలని ఆ దేశంలోని అన్ని రాజకీయ వర్గాలకు భారత్ పిలుపునిచ్చింది. గత కొన్ని వారాలుగా అఫ్గాన్‌లో పరిస్థితులు క్షీణించడంతో.. ప్రస్తుత పరిణామాలపై భారతదేశం అంతర్జాతీయ శక్తులతో పాటు అఫ్గాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. అఫ్గాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ హనీఫ్ మంగళవారం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో మాట్లాడారు. తమ దేశంలో తాలిబన్ల హింస, మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపడానికి కృషి చేయాలని కోరారు. దీనిపై చర్చించడానికి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎన్‌ఎస్‌సి) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. ఆగస్టులో యూఎన్‌ఎసీకి భారత్ సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో హనీఫ్ ఈ విషయంపై భారత్‌ను సంప్రదించారు.

First published:

Tags: Taliban

ఉత్తమ కథలు