China Diseases: రోగాల పుట్ట.. గత 20 ఏళ్లలో చైనా నుంచి వ్యాపించిన ప్రాణాంతక వ్యాధులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

గత 20 ఏళ్లలో చైనా నుంచే ప్రపంచాన్ని వణికించిన నాలుగు ప్రధాన వ్యాధులు వ్యాపించాయి. ఈ వ్యాధులతో కూడా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. SARS, ఏవియన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కరోనావైరస్‌ల ద్వారా ఈ వ్యాధులు వ్యాపించాయి.

  • Share this:
కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఈ మహమ్మారిని చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే తయారు చేశారని ముందునుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఒక అమెరికన్ వార్తా సంస్థ సైతం ఈ విషయం నిజమేనని పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోని చాలామంది ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఈ వాదన నిజమేనని చెబుతున్నారు. కరోనా వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్‌కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల్లో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయని తాజా నివేదిక వెల్లడించింది. దీంతో కరోనా వైరస్‌ను చైనా ప్రణాళిక ప్రకారం ల్యాబ్‌లో అభివృద్ధి చేసిందనే వాదనకు మరింత బలం చేకూరింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా కరోనా మూలాలు పూర్తిగా గుర్తించాలని నిఘా వర్గాలకు సూచించారు. అయితే ఇప్పటి వరకు కరోనా కాకుండా మరికొన్ని వైరస్‌లు చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాపించాయి. ఇవి మానవాళికి తీవ్రమైన నష్టం చేకూర్చాయి. వీటిలో సార్స్, ఏవియన్ వైరస్ వంటివి ప్రధానమైనవి.

గత 20 ఏళ్లలో చైనా నుంచే ప్రపంచాన్ని వణికించిన నాలుగు ప్రధాన వ్యాధులు వ్యాపించాయి. ఈ వ్యాధులతో కూడా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. SARS, ఏవియన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కరోనావైరస్‌ల ద్వారా ఈ వ్యాధులు వ్యాపించాయి. స్వైన్ ఫ్లూ చైనాలో పుట్టకపోయినా, వ్యాధి వ్యాప్తికి చైనా కారణమైందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలో పడేశాయి. చైనాలో వినియోగిస్తున్న మాంసాహారం వల్ల వైరస్‌లు మనుషులకు వ్యాపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవి ఎక్కడ మొదటిసారి వెలుగులోకి వచ్చాయో తెలుసుకుందాం.

* సార్స్
SARS మహమ్మారి 2002 నవంబర్‌లో చైనాలో మొదటిసారి వ్యాపించింది. ఈ వైరస్ దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో బయటపడింది. 2002 నవంబర్ నుంచి 2003 జులై మధ్య దక్షిణ చైనాలో SARS వ్యాధి వ్యాప్తి చెందింది. అనేక దేశాలలో వేలాది మంది ప్రజలు ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సార్స్ కారణంగా హాంకాంగ్‌లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధి ప్రపంచంలోని 37 దేశాలకు వ్యాపించింది. ఈ అంటువ్యాధిలో మరణాల రేటు 9.6 శాతంగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ కూడా SARS కుటుంబానికి చెందినదే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ SARS వైరస్‌కు టీకా, మెడిసిన్ సిద్ధం కాలేదు.

SARS సమయంలోనే చైనాలోని మాంసాహార మార్కెట్లు, జంతువుల విక్రయాలు జరిగే మార్కెట్లపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మాంసం వ్యాపారం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు అడవులు తగ్గుతున్నాయి. అడవి జంతువులను చైనీయులు ఎక్కువగా తింటారు. కొంతమంది వాటిని అక్రమంగా పెంచుతారు కూడా. వీటన్నింటి కారణంగా అడవి జంతువుల్లో ఉండే వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి. చైనా మాంసం మార్కెట్లో అనేక రకాల అడవి జంతువుల మాంసం లభిస్తుంది. అందువల్ల కొత్త వైరస్‌లు అక్కడి నుంచి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అంటువ్యాధులు కావడంతో అవి ప్రపంచమంతటా వ్యాపిస్తున్నాయి.

* ఏవియన్ ఫ్లూ
AVIAN ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పక్షుల నుంచి పక్షులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోళ్లు లేదా ఇతర పక్షులకు దగ్గరగా ఉండే వారికి, వారి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సోకుతుంది. మానవుల్లో నోరు, కళ్లు, ముక్కు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ అంటువ్యాధిలో అనేక రూపాలు ఉన్నాయి. అయితే ప్రబలంగా ఉన్న H5N1 వైరస్‌ మాత్రం 1996లో చైనాలో మొదటిసారి కనిపించింది. ఇది అధిక తీవ్రత ఉండే వ్యాధికారక వైరస్‌. 2000 సంవత్సరం తరువాత అనేక దేశాల్లో ఏవియన్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో చైనా అంటువ్యాధులను వ్యాప్తి చేస్తోందని అప్పటి నుంచే అమెరికా ఆరోపించడం ప్రారంభించింది.

* స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ ఒక అంటు వ్యాధి. తేలికగా తీసుకుంటే ఇది తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక స్వైన్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయకపోతే, అది కూడా ప్రాణాంతకమవుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ఇది చాలా ప్రమాదకరం. చిన్న పిల్లలు, వృద్ధులకు కూడా ఇది ప్రమాదకరంగా మారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా ఈ వ్యాధికి బలైపోతారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారికి స్వైన్‌ ఫ్లూ వల్ల ఎక్కువ ముప్పు ఉంటుంది. 2007లో ఈ అంటువ్యాధి ఫిలిప్పీన్స్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.

* కరోనా వైరస్
కరోనా వైరస్ ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధిగా పరిణమించింది. ఈ మహమ్మారి మరణాల రేటు SARS, స్వైన్ ఫ్లూ కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, వేగంగా వ్యాపించడంతో పాటు తీవ్రమైన నష్టాలను కలుగజేసే స్వభావంతో ఇది ఎక్కువ ప్రమాదకారిగా మారింది. ఒక అంటువ్యాధి ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురిచేయడం కొన్ని శతాబ్దాలలో ఇదే మొదటిసారి కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్‌ను చైనాలోనే తయారు చేశారని చాలామంది నమ్ముతారు. అయితే వుహాన్ ల్యాబ్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అయితే అంటువ్యాధి గురించి సమాచారాన్ని చైనా దాచిపెట్టిందని, దీనివల్ల ఇతర దేశాలకు వైరస్ తక్కువ సమయంలో వ్యాపించిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.

* చైనా మార్కెట్లే వ్యాధులకు కేంద్రం
చైనా ప్రజలు సీ ఫుడ్ నుంచి పాము, బల్లి వంటి జంతువులను సైతం తింటారు. ఇవన్నీ అక్కడి నగరాల్లోని మాంసం మార్కెట్లో బహిరంగంగా కనిపిస్తాయి. ఆ దేశంలోని నగరాల్లో ఎక్కువగా ఉన్న జనాభా, అక్కడి మాంసం మార్కెట్ల కారణంగానే కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయి. చైనా నుంచి కొత్త వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఒక కారణం అక్కడి ఫుడ్ మార్కెట్లే అని నిపుణులు అంటున్నారు. చైనా నగరాల్లో పండ్లు, కూరగాయలతో పాటు మాంసం మార్కెట్లు సైతం విస్తృతంగా ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర దేశాల్లో కనిపించని జంతువుల మాసం కూడా ఇక్కడి మార్కెట్లలో కనిపిస్తుంది. దీంతో ఈ మాంసం మార్కెట్లు కొత్త వ్యాధులకు మూలంగా మారుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో అనేక కొత్త వ్యాధులు తెరపైకి వచ్చాయి. వీటికి కారణమయ్యే వైరస్‌లు జంతువుల మాంసం నుంచి మనిషి శరీరాలకు వ్యాపించాయి. తరువాత వాటి సంక్రమణ ఊహించని విధంగా వేగంగా పెరిగింది.

* జంతువులకు దగ్గరగా ఉండటమూ కారణమే
చైనీయులు అడవి జంతువులకు చాలా దగ్గరగా ఉంటారు. వాటి మాంసం కోసం మార్కెట్లకు ప్రజలు పోటెత్తుతారు. దీంతో వాటి శరీరంలో ఉండే వైరస్‌లు మనుషులకు వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైరస్ వ్యాప్తికి ఇది అతిపెద్ద కారణం. పరిశుభ్రతను విస్మరించడం కూడా వైరస్ వ్యాప్తికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఎబోలా వైరస్ ఆఫ్రికా నుంచి ప్రపంచమంతటా వ్యాపించింది. ఎబోలా వైరస్ చింపాంజీ నుంచి మనుషులకు సోకింది. ఆఫ్రికాలో చింపాంజీని చంపడం వల్ల, దాని శరీరంలో ఉండే వైరస్ మనిషి శరీరానికి చేరుకుంది. ఆ తరువాత ఇది ప్రపంచమంతటా వ్యాపించింది.
Published by:Shiva Kumar Addula
First published: