అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రిజర్వేషన్ వర్తించని సామాజిక వర్గాలకు చెందిన పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇటీవలే ఈడబ్ల్యూఎస్ కింత రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజర్వేషన్ ఇప్పటికే విద్యాసంస్థల్లో అమలవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకపై ఉద్యోగాల్లోనూ వర్తించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుత్తం అన్నిరకాల ఎంట్రెన్స్ టెస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. దీంతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లకు ప్రాధాన్యత పెరిగింది. అర్హులైన వారు ఈ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఐతే కొంతమందికి ఎలా అప్లై చేయాలనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
ఇవి అవసరం
కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన పేదలు ఈడబ్య్లూఎస్ సర్టిఫికెట్ పొందడానికి అర్హులు, తొలుత గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. రేషన్ కార్డు, ఏడాదికి రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్నట్లు బ్యాంక్ ఎకౌంట్ స్టేట్ మెంట్, ఇన్ కమ్ ట్యాక్స్ వివరాలు, అఫిడవిట్, ఫోటో జత చేయాలి, అలాగే చిరునామా కోసం ఆధార్ కార్డు, టీసీ, బర్త్ సర్టిఫికెట్లలో ఏదో ఒకదానితో పాటు ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి ఉంటే అనర్హులే...
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి, పట్టణాల్లో 100 చదరపు గజాలు, ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాల కంటే ఎక్కువ ఇంటిస్థలం, గ్రామాల్లో అయితే వెయ్యి గజాల కంటే ఎక్కువ నివాస స్థలం ఉండకూడదు.
కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ధృవీకరిస్తూ న్యాయవాది ద్వారా నోటరి అఫిడవిట్ తో పాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని అప్లికేషన్ తో పాటు తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకునే వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే.. మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసుకోని ప్రస్తుతం నివశిస్తున్న మండల తహసీల్దార్ కు సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు ఫీజు చెల్లిస్తే 30 రోజుల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే తహసీల్దార్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి ఆమోదం తెలుపుతారు. సంబంధిత గ్రామ సచివాలయంలో డిజిటిల్ అసిస్టెంట్ ద్వారా సర్టిఫికెట్ తీసుకోవచ్చు.
తహసీల్దార్ జారీ చేసిన సర్టిఫికెట్ ను విద్యా సంస్థల్లో సీటు పొందడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందడానికి సమర్పించాల్సి ఉంటుంది. బీసీల జాబితాలో కొత్తగా చేరి ఇంకా కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేని కులాల వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కీలకం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, EBC Reservation