Fasting: రోజు విడిచి రోజు ఉపవాసం.. ఇలా చేస్తే మంచిదా? కాదా? తప్పక తెలుసుకోండి

fasting

Health Tips: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి కూడా ఉపవాసం చేస్తుంటారు. కానీ రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేవారి శరీరంలోని కొవ్వు కణజాలాల్లో విస్తృతమైన మార్పులు జరుగుతున్నట్టు తాజా పరిశోధన చెబుతోంది.

  • Share this:
భారతీయులకు ఉపవాసం వల్ల కలిగే ఉపయోగాల గురించి బాగా తెలుసు. వివిధ వర్గాల ప్రజలు పండుగలు, ఫంక్షన్ల సమయంలో ఉపవాసాలు ఉండటం కొత్త విషయం కాదు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి కూడా ఉపవాసం చేస్తుంటారు. కానీ రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేవారి శరీరంలోని కొవ్వు కణజాలాల్లో విస్తృతమైన మార్పులు జరుగుతున్నట్టు తాజా పరిశోధన చెబుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. రోజు విడిచి రోజు ఉపవాసం (intermittent fasting) ఉండేవారి శరీరంలో.. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. దీనివల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతోందని తెలిపారు. ఆహారం తీసుకోని సమయంలో కొవ్వు కణజాలాల్లో చోటుచేసుకునే మార్పుల ద్వారా ఈ అంచనాకు వచ్చారు.

సిడ్నీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మార్క్ లారెన్స్ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనం చేసింది. ఈ పరిశోధనను ఎలుకల్లో చేసి, ఫలితాలను మనుషులకు అనుకరించారు. ఇందుకు అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. మనుషుల్లో పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు ప్రమాదకరంగా మారుతోందని కనుగొన్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతోందని వారు గుర్తించారు. ఈ అధ్యయనాన్ని సెల్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

రెండు రకాల కొవ్వులు:
రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేవారి శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు కణజాలాలను రిసెర్చర్లు పరీక్షించారు. సాధారణంగా మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. పొట్ట, ఇతర శరీర భాగాల చుట్టూ పేరుకుపోయే కొవ్వును విసెరల్ కొవ్వులు అంటారు. చర్మం కింది పొరల్లో ఉండే కొవ్వులను సబ్ క్యుటేనియస్ కొవ్వులు అంటారు. విసెరల్ కొవ్వులు అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంది. సబ్ క్యుటేనియస్ కొవ్వులు జీవక్రియల వృద్ధికి తోడ్పడే మంచి కొవ్వులు. ఉపవాసం సమయంలో విసెరల్, సబ్ క్యుటేనియస్ కొవ్వు కణజాలాల్లో చాలా మార్పులు జరుగుతున్నట్లు డాక్టర్ లారెన్స్ చెప్పారు.

కొవ్వు నుంచి శక్తి:
ఉపవాసం సమయంలో కొవ్వు కణజాలం ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్‌ను విడుదల చేయడం ద్వారా శరీరానికి శక్తినిస్తుంది. కానీ ఉపవాసం ఉన్నప్పుడు విసెరల్ కొవ్వులు ఈ ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేయట్లేదని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి తోడు మరుసటి ఉపవాసానికి ముందు.. ఈ రెండు రకాల కొవ్వులూ తమ కొవ్వు కణజాలాలను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. కొవ్వు శాతాన్ని వేగంగా భర్తీ చేసుకుంటున్నాయి. వరుసగా ఉపవాసాలు చేసేవారి శరీరంలో కొవ్వులు కోల్పోవడం, భర్తీ కావడం తరచుగా జరుగుతుంది. శక్తిని భర్తీ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. దీనివల్ల విసెరల్ కొవ్వులు ఎక్కువగా పోగుపడే అవకాశం ఉందని డాక్టర్ లారెన్స్ చెప్పారు. ఎక్కువగా డైటింగ్ చేసే కొంతమంది వ్యక్తులు బరువు తగ్గకపోవడానికి ఇదే కారణం కావచ్చని చెప్పారు.

ఎలుకలపై పరిశోధన:
ఈ పరిశోధనను ఎలుకలపై చేసి, ఫలితాలను మానవులకు అనుకరించారు. ఎలుక శరీర ధర్మశాస్త్రం మనుషులను పోలి ఉంటుంది. కానీ వాటి జీవక్రియ రేటు (మెటబాలిజం) చాలా వేగంగా ఉంటుంది. దీంతో వాటి శరీరంలో వేగంగా మార్పులను గమనించడానికి వీలు కలుగుతోంది. అందువల్ల మనుషులపై పూర్తి స్థాయిలో పరిశోధన చేయడానికి ముందు ఎలుకలను పరీక్షించారు. భవిష్యత్తులో ఎలుకలు, మానవులపై కలిపి చేయనున్న మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తూ, బరువు తగ్గే మార్గాలను అన్వేషించనున్నారు. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహారంపై కూడా పరిశోధనలు చేయనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: