భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూవారి కేసులు 2 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో, ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్లతో పాటు పాక్షిక లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించాయి. అయినా సరే కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు కరోనా కట్టడికి ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా తీవ్రత కాస్త తక్కువగా ఉండటంతో వ్యాక్సిన్‌కు వెనకడుగు వేసిన ప్రజలు.. ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో వాక్సిన్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే, దగ్గర్లో వ్యాక్సిన్ కేంద్రం ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్లాలి? వ్యాక్సిన్ వేసే సమయం? ఇలా అనేక అంశాలపై ప్రజల్లో అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ప్రజల సౌకర్యార్థం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ను చేర్చింది. గూగుల్ మ్యాప్స్‌తో పాటు కోవిన్ యాప్, మ్యాప్ మై ఇండియా వంటి యాప్స్ ద్వారా కూడా మీ సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. మే 1 నుంచి మూడో దశ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవ్వనుంది. ఈ ప్రక్రియలో 18 ఏళ్లు పైబడిన వారికి సైతం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఇలా సెర్చ్ చేయండి
స్టెప్ 1: గూగుల్ మ్యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ నుండి గూగుల్ మ్యాప్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోండి.
స్టెప్ 2: మీరు ఉంటున్న ఏరియాను సెర్చ్ చేయండి
మీ స్మార్ట్‌ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు ప్రస్తుతం ఉంటున్న మీ సిటీ/ ఏరియాను చూపిస్తుంది. లేదా ప్రస్తుతం మీరు ఉంటున్న సిటీని మాన్యువల్‌గా సెర్చ్ బాక్స్‌లో టైప్ చేయండి. ఉదాహరణకు, మీరు హైదరాబాద్‌లో ఉంటే సెర్చ్ బాక్స్‌లో హైదరాబాద్ అని టైప్ చేయండి.
స్టెప్ 3: ‘వాక్సినేషన్ సెంటర్స్’ను సెర్చ్ చేయండి
గూగుల్ మ్యాప్స్ యాప్‌లో మీ సిటీని సెర్చ్ చేసిన తర్వాత, అదే సెర్చ్ బాక్స్‌లో ‘వ్యాక్సిన్ సెంటర్స్’ అని టైప్ చేయండి. తద్వారా, ప్రభుత్వ అనుమతి పొందిన మీ దగ్గర్లోని క్లినిక్/హాస్పిటల్ వ్యాక్సిన్ కేంద్రాల జాబితాను చూడవచ్చు.
స్టెప్ 4: వ్యాక్సిన్ కేంద్రంపై క్లిక్ చేయండి
సదరు వ్యాక్సిన్ కేంద్రంపై క్లిక్ చేస్తే దాని అడ్రస్, వ్యాక్సిన్ వేసే సమయం వంటి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. మీ సమయం, సౌలభ్యం ప్రకారం మీ అవసరాలకు తగిన ఉత్తమ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, COVID-19 vaccine