Gold Loan vs Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలా.. ఏది మంచిది...

Gold and Silver (ప్రతీకాత్మక చిత్రం)

గోల్డ్​ లోన్ల విషయంలో, ప్రాసెసింగ్ ఛార్జీలు లోన్​ మొత్తంలో 2% వరకు ఉంటాయి. అందువల్ల, లోన్​ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్​ ఫీజును కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది.

  • Share this:
డబ్బుతో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ ఎదురైనప్పుడు చేతిలో డబ్బులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, ఒకవేళ డబ్బులు లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. అయితే, ఇటువంటి క్లిష్ట సమయాల్లో కొందరు తెలిసిన వారి వద్ద అప్పు తీసుకుంటుండగా. మరికొందరు మాత్రం గోల్డ్​లోన్​ లేదా పర్సనల్​ లోన్​ వైపు మొగ్గుచూపుతుంటారు. అయితే, అత్యవసర సమయాల్లో గోల్డ్​ లోన్​ తీసుకోవడం మంచిదా? లేక పర్సనల్​ లోన్​ తీసుకోవడం మంచిదా? అనే విషయాన్ని పోల్చి చూసుకొని ముందుకెళ్లాలి. ఈ రెండూ భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్లే వీటి మధ్య వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్​ ఫీజు, ఇతర ఛార్జీలు, లోన్​ ప్రాసెస్​ వ్యవధి ఇలా అనేక కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు ఏ లోన్​ తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం.

వడ్డీ రేట్లు
పర్సనల్​ లోన్​ వడ్డీ రేట్లు సాధారణంగా ఏడాదికి 9% నుండి 24% . వరకు ఉంటాయి. ఈ వడ్డీ రేట్లను ఆయా బ్యాంకులు మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి నిర్ణయిస్తాయి. అదే, గోల్డ్​ లోన్​ విషయానికి వస్తే దీని వడ్డీ రేట్లు ఏడాదికి 7.50% నుండి 29% వరకు ఉంటాయి. రిస్క్ అసెస్‌మెంట్, లోన్​ పదవీకాలం, లోన్​ మొత్తం, రీపేయిమెంట్​ ఆప్షన్లను బట్టి ఈ వడ్డీ రేట్లు నిర్ణయించబడుతాయి. మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్నవారి విషయంలో గోల్డ్​ లోన్​, పర్సనల్​ లోన్​ వడ్డీ రేట్లకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు. అయితే, కాస్త తక్కువ క్రెడిట్​ స్కోర్​ ఉన్న వారు మాత్రం పర్సనల్​ లోన్​ కంటే గోల్డ్​ లోన్​ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, అనేక బ్యాంకులు గోల్డ్​ లోన్​లపై సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను అమలు చేస్తాయి.

లోన్​ ప్రాసెసింగ్ టైం
పర్సనల్​ లోన్​ దరఖాస్తు సమయంలో మీరు మీ ఆదాయానికి సంబంధించిన ఐటిఆర్ ఫారాలు / పేస్లిప్స్, ఇతర పత్రాలను సమర్పించాలి. వీటి ధృవీకరణకు సమయం పడుతుంది కాబట్టి, లోన్​ మంజూరు చేయడానికి 2 నుంచి -7 రోజుల సమయం పట్టవచ్చు. అయితే, గోల్డ్​ లోన్​లు మాత్రం చాలా త్వరగా పంపిణీ చేయబడతాయి. దరఖాస్తు చేసిన కొద్ది గంటల్లోనే మీకు లోన్​ మొత్తం అందజేయబడుతుంది. అందువల్ల, తక్షణమే డబ్బు కావాల్సిన వారు పర్సనల్​ లోన్​ కంటే గోల్డ్​ లోన్​ వైపు వెళ్లడం మంచిది.

క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే..
సాధారణంగా బ్యాంకులు మీ క్రెడిట్​ స్కోరును పరిగణనలోకి తీసుకుని పర్సనల్​ లోన్​ మంజూరు చేస్తుంటాయి. అందువల్ల, తక్కువ క్రెడిట్​ స్కోరు ఉన్న వారి విషయంలో అవి కఠినంగా వ్యవహరిస్తాయి. వారికి లోన్​ మంజూరు చేయడానికి నిరాకరిస్తాయి. అయితే, ఒకవేళ మీ దరఖాస్తును ఆమోదించినప్పటికీ, మీ క్రెడిట్ స్కోరు, నెలవారీ జీతం, జాబ్ ప్రొఫైల్, యజమాని ప్రొఫైల్ మొదలైన వాటిని పరిశీలించి వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. మరోవైపు, గోల్డ్​లోన్​ విషయంలో మాత్రం క్రెడిట్​ స్టోరు తక్కువగా ఉన్నా సులభంగా లోన్​ మంజూరు చేస్తాయి. ఎందుకంటే, మీరు తీసుకున్న లోన్​ తిరిగి చెల్లించకపోతే, మీ బంగారాన్ని విక్రయించి డబ్బు తీసుకునే వెసులుబాటు బ్యాంకులకు ఉంటుంది. అందువల్ల, బ్యాంకులు తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి సైతం గోల్డ్​లోన్​ ఇవ్వడానికి మొగ్గుచూపుతుంటాయి.

పేమెంట్​ ఆప్షన్లు
పర్సనల్​ లోన్లు EMI ల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు, వడ్డీ రెండూ కలిపి ఉంటాయి. అయితే, గోల్డ్​ లోన్​ రీపేమెంట్​లో మాత్రం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నెలవారీ EMI మోడ్ కాకుండా, ప్రతి నెలా వడ్డీ మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లించి, అసలును మెచ్యూరిటీ తేదీన తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తాయి. మరి కొన్ని బ్యాంకులు రుణ మంజూరు సమయంలోనే వడ్డీ భాగాన్ని ముందస్తుగా తిరిగి చెల్లించడానికి, అసలును చివర్లో తిరిగి చెల్లించడానికి అనుమతిస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు తీసుకున్న రుణం, వడ్డీ రెండింటినీ రుణ పదవీ కాలం ముగిసిన చివర్లో చెల్లించడానికి అనుమతిస్తాయి. అందువల్ల, తక్షణ అవసరాలు, తిరిగి చెల్లించే వెసులుబాటు ఎంపికల దృష్ట్యా బంగారు రుణాలు మరింత అనుకూలంగా ఉంటాయి.

రీపేమెంట్​ పీరియడ్​
పర్సనల్​ లోన్ల రీపేమెంట్ గడువు సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు గరిష్టంగా 7 సంవత్సరాల సమయం ఇస్తాయి. అదే, గోల్డ్​ లోన్ల విషయంలో రీపేమెంట్ గడువు సాధారణంగా 7 రోజుల నుండి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. కొన్ని బ్యాంకులు 4-5 సంవత్సరాల అధిక గడువు కూడా ఇస్తాయి. ఎక్కువ గడువు అధిక వడ్డీ వ్యయానికి దారి తీస్తుండటంతో, గోల్డ్​లోన్​ తీసుకునే వారు తక్కువ వ్యవధిని ఎంచుకోవడం మంచిది. పర్సనల్​ లోన్లు అధిక మొత్తంలో రుణం కావాల్సిన వారికి, ఎక్కువ కాలం అవసరమయ్యే వారికి సరిపోతాయి.

టోటల్​ లోన్​
పర్సనల్​ లోన్ల కింద బ్యాంకులు సాధారణంగా రూ .50,000 నుండి రూ. 15 లక్షల మధ్య మంజూరు చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య కూడా ఇస్తుంటాయి. దరఖాస్తుదారుడు తిరిగి చెల్లించే సామర్థ్యం, రుణం తిరిగి చెల్లించే కాలం బట్టి ఈ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. బంగారు రుణాల విషయంలో మాత్రం ఇది మీరు తాకట్టు పెట్టే గోల్డ్​ మొత్తం వాల్యూ​, రుణదాత నిర్ణయించిన లోన్- టు- వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. కరోనా సంక్షభంతో కొనుగోలు శక్తి పడిపోవడంతో రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే చర్యగా, ఆర్‌బిఐ తాత్కాలికంగా ఎల్‌టివి నిష్పత్తిపై నియంత్రణ పరిమితిని పెంచింది. బంగారం వాల్యూలో 90 శాతం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇదివరకు ఇది కేవలం 75 శాతం మాత్రమే ఉండేది. కాగా, ఇది 2021 మార్చి 31 వరకు తీసుకునే బంగారు రుణాలపై మాత్రమే వర్తిస్తుంది.

ప్రాసెసింగ్ ఫీజు
పర్సనల్​ లోన్ల ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా లోన్​ మొత్తంలో 3% వరకు ఉంటుంది. అదే, గోల్డ్​ లోన్ల విషయంలో, ప్రాసెసింగ్ ఛార్జీలు లోన్​ మొత్తంలో 2% వరకు ఉంటాయి. అందువల్ల, లోన్​ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్​ ఫీజును కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది.
Published by:Krishna Adithya
First published: