హోమ్ /వార్తలు /Explained /

Andhra Pradesh: వైన్ షాపుల్లో నో స్టాక్ : చిందులేస్తున్న మందుబాబులు

Andhra Pradesh: వైన్ షాపుల్లో నో స్టాక్ : చిందులేస్తున్న మందుబాబులు

ఏపీలో నో స్టాక్

ఏపీలో నో స్టాక్

ఏపీలో మందు బాబులకు టెన్షన్ తప్పడం లేదు. అసలే భారీగా పెరిగిన ధరలు.. దీనికి తోడు నచ్చిన బ్రాండ్లు దొరకవు.. ఇప్పుడు ఉన్నవి కూడా నో స్టాక్ అనే మాట వినపడడంతో చిందులు వేస్తున్నారు? మందు దొరికెదెలా అంటూ మండిపడుతున్నారు.

  ఏపీలో మందుబాబుల కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయి. నచ్చిన బ్రాండ్లు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన షాపుల్లో దొరకడం లేదు. సరే ఉన్నవాటిలో నచ్చిన వాటితో సరిపెట్టుకుందామంటే.. ఇప్పుడు అవి కూడా లేవని వైన్ షాపుల్లో చెబుతుంటే మందుబాబులు చిర్రెత్తిపోతున్నారు. ఇంతకీ ఎందుకంత డిమాండ్ పెరుగుతోంది ఏపీలో మందుకు..

  ఏపీ వ్యాప్తంగా వరుస ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోంది. మొన్నటి వరకు పంచయాతీ ఎన్నికల్లో మద్యం ప్రవాహం చూశాం. అయితే గ్రామాల్లో ఎన్నికలు కావడంతో నాటు సారాకూ విపరీమతైన డిమాండ్ పెరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికలకు వేళైంది. దీంతో నగరాల్లో వైన్ షాపులకు డిమాండ్ పెరిగింది. అయితే ఎన్నికల నేపథ్యంలో.. మద్యం షాపుల దగ్గర నిబంధనలు కూడా కఠినతరం చేశారు. సాధరణంగా ఏపీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక మనిషికి మూడు బాటిళ్లు ఇవ్వాలి.. అయితే ఎన్నికల నేపథ్యంలో ఒక మనిషికి ఒక్క బాటిల్ మాత్రమే విక్రయిస్తున్నారు.. అయినా వైన్ షాపుల్లో నో స్టాక్ ఏంటి అంటూ మందు బాబులు మండిపడుతున్నారు..

  అయితే పోలింగ్‌ ముందురోజు ఓటర్లకు పంపిణీ చేయడానికి పలువురు అభ్యర్థులు ముందుచూపుతో మద్యం సేకరణపై ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాపత్యంగా ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు.. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం ధరలు రెట్టింపు ఉన్నాయి. ఇతర రాష్ట్ర్రాల నుంచి అక్రమ మద్యం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నా పటిష్ట నిఘా ఉండడం.. పోనీ చేతులు తడిపి ఎలాగోలా తప్పించుకోవచ్చు అంటే ప్రత్యర్థి వర్గాల నిఘా ఉండడం.. చేతిలో ఫోన్ లో ఉండడంతో ఎవరో ఒకరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో రచ్చ రచ్చ అవుతోంది. అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించడం కూడా తలనొప్పిగా మారింది. దీంతో సరికొత్త ఆలోచనకు తెరలేపారు ఆయా పార్టీల అభ్యర్థులు.

  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కార్యకర్తలు, ప్రచార సామగ్రి ఎంత ముఖ్యమో, మద్యం కూడా అంతే ముఖ్యం. ఓటర్లకు మద్యం పంపిణీ చేయడం సర్వసాధారణం. ముఖ్యంగా మందుబాబులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు బలమైన ఇండిపెండెంట్లు కూడా మద్యం భారీగా పంపిణీ చేస్తుంటారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ప్రవాహం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నెల పదో తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, మద్యం సేకరణపై దృష్టిసారించారు.

  గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు వున్నప్పుడు ఎంత మద్యం కావాలన్నా దొరికేది. కానీ ప్రస్తుతం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకు తప్ప మిగిలిన వారికి మద్యం సేకరణ తలనొప్పిగా మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సీసాలు ఒక్కో మనిషికి మూడు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత దీనిని ఒక సీసాకే పరిమితం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మద్యం సేకరించడానికి కొత్త మార్గాలను కనిపెట్టారు.

  ఎవరైనా ఒక మందు బాటిల్ కొని తెచ్చి తమకు ఇస్తే 10 నుంచి 20 శాతం వరకు కమిషన్ ఇస్తామంటున్నారు. దీనికి ఒక టీంను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక దుకాణంలో ఒక వ్యక్తికి ఒక సీసా మాత్రమే అమ్మాలన్న నిబంధన వుండడంతో వీరు ప్రతి దుకాణానికి వెళ్లి ఒక్కో సీసా చొప్పున మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధ్యమైనన్ని ఎక్కువ షాపులకు తిరిగి.. కుదిరినన్ని బాటిళ్లు సేకరిస్తున్నారు. వంద సీసాలు కాగానే ముందుగా.. ఒక దగ్గర స్టోర్ చేసుకుని.. తరువాత ఆయన నేతల అనుచర వర్గానికి విక్రయిస్తూ కమీషన్లు దండుకుంటున్నట్టు తెలుస్తోంది.

  దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చిన మనుషులకు ఒక్కో సీసాకు అభ్యర్థులకు అక్కడి డిమాండ్ ను బట్టి 10 నుంచి 20 శాతం వరకు కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వంద బాటిళ్లు సేకరిస్తే ఒక మనిషికి వేయి రూపాయలపైనే లాభం వస్తోంది. దీంతో అభ్యర్థుల అనుచరుల్లో కొంతమంది మద్యం సేకరణకు నడుం బిగించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఈ తరహాలోనే మద్యం సేకరిస్తుండడంతో దుకాణాల్లో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా కాస్త మంచి బ్రాండ్ లకు డిమాండ్ ఉండడంతో.. త్వరగానే అయిపోతున్నాయి. దీంతో మందుబాబులకు తిప్పలు తప్పడం లేదు. షాపుకు వెళ్లి తమకు కావాల్సిన బ్రాండ్ అడిగితే నో స్టాక్ అని చెప్పడంతో షాక్ కు గురవుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, AP Politics, Municipal Elections, Wine shops

  ఉత్తమ కథలు