Andhra Pradesh: సముద్రంలో చేపల వేట నిషేధం. మత్య్సకారులకు ఆదాయం ఎలా? ప్రభుత్వానికి ధరఖాస్తు ఎలా చేసుకోవాలి?

సముద్రంలో చేపల వేట నిషేధం.. మత్య్సకారులకు ఆదాయం ఎలా?

ఏపీ వ్యాప్తంగా సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలు కానుంది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిషేధం అమలవుతుంది. మరి ఆ సమయంలో మత్స్యకారులకు ఆదాయం ఎలా? ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలి అంటే? ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?

 • Share this:
  సముద్రంలో చేపల వేటకు బ్రేకులు పడుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తున్నారు. సముద్రంలో మత్స్య సంపద వేటపై ఈ నెల 15 నుంచి నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు ఏపీ వ్యాప్తంగా సముద్ర తీరంలో వేట నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వస్తున్నాయి. సముద్రంలో మత్స్యసంపద పెంపొందించేందుకు ఏటా ఈ పద్ధతిని అమలు చేస్తూనే ఉన్నారు.

  లోతైన సముద్రజలాల్లో వేటకు వెళ్లే మెకనైజ్డ్‌ బోట్లు, మోటరైజ్డ్‌ బోట్లు, నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లతో సాగించే చేపలవేటకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సముద్రంలో చేపలు గుడ్లుపెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకే ఈ సమయంలో వేటను విరమిస్తూ వస్తున్నారు. రాబోయే కాలంలో నిర్వహించే చేపలవేటలో పుష్కలంగా మత్స్యసంపద లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వేట నిషేధం సరే.. మరి ఈ సమయంలో ఇదే వృత్తిని నమ్ముకుని జీవించే వారి పరిస్థితి ఏంటి. వేటను పక్కన పెట్టి ఇళ్ల దగ్గరే ఉండిపోయే మత్స్యకారుల కడుపు నిండేది ఎలా? అయితే అలాంటి వారిని ఆదుకోవడానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

  మరి ఈ పరిహారం ఎవరికి లభిస్తుంది. నిబంధనలు ఏం చెబుతాయి. అధునాతనమైన యాంత్రిక పడవలు, వెసల్స్‌లో పనిచేసే వారిలో ఒక్కోదానిలో ఎనిమిది మందికి ప్రభుత్ం ఈ పరిహారాన్ని అందిస్తోంది. అలాగే ఆయిల్‌ ఇంజను బోట్లు, తెప్పల ద్వారా మర పడవల్లో వేట సాగించే వారిలో ఒక్కో దానిలో ఆరుగురుకి ఈ పథకం వర్తిస్తుంది. తెరచాప సాయంతో రెక్కల కష్టంతో సంప్రదాయక కుట్టు పడవల్లో వేటచేసే వారిలో ముగ్గురికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది.

  ఈ పరిహారం ఎవరికి ఎలా అందుతుంది. చేపలవేట కోసం తమ శాఖలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న యాంత్రిక, మర, సంప్రదాయక పడవలకు మాత్రమే పరిహారం సొమ్మును అందిస్తాం. నిషేధం అమల్లోకి వచ్చే నాటికి ఆయా బోట్లని సంబంధిత ఫిషింగ్‌హార్బర్‌తోపాటు, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లకు తీసుకొచ్చి లంగర్లు వేయాలి. పరిహారం కోసం నిర్దేశించిన 10వేల రూపాయల ఆ నగదును ఆయా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు అధికారులు. మహోన్నత ఉద్దేశంతో చేపడుతున్న మత్స్యవేట నిషేధాన్ని పక్కాగా అమలయ్యేందుకు ఆయా మత్స్యకారులు తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

  అలాగే ఈ ఆంక్షలు అందరూ పాటించాలా చేయడానికి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తారు. నిషేధ కాలంలో ఎవరూ సముద్రంలోకి చేపలవేటకు వెళ్లకుండా ఉండేందుకు మత్స్యశాఖ, మెరైన్‌ పోలీసులు, తీర రక్షణదళం విభాగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటాయి. ఎవరూ వేటకు వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒకవేళ ఎవరైనా ఆంక్షలను పక్కన పెట్టి యాంత్రిక పడవలతో చేపలవేట చేస్తూ పట్టుబడితే ఈ సంపదను స్వాధీనం చేసుకుని నిందితులకు జరిమానాలు విధిస్తారు.

  విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే.. యాంత్రిక పడవలు 739, మరపడవలు 3,338, సంప్రదాయ పడవలు 907, వీటిమీద జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంఖ్య 28 వేల661 మందిగా రికార్డుల్లో ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవారికి మాత్రమే ఈ పరిహారం అందుతుంది. అప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి అకౌంట్లు ఉంటాయి కాబట్టి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకే ఈ నగదు జమ అవుతుంది.

  సాధారణంగా ఇతర సమయాల్లో సముద్రంలో విచక్షణారాహిత్యంగా నిర్వహించే చేపలవేట వల్ల అంతరించిపోయే చేపలు నిషేధ కాలంలో సమృద్ధిగా పెరుగుతాయి. అయితే వర్షాలు కురిసే సమయంలో వరదనీరు సముద్రంలోకి చేరి అంతర్భాగంలో ఉన్న చేపలు బయటకు వచ్చి మత్స్యకారుల వలలకు చిక్కుతూ ఉంటాయి.
  Published by:Nagesh Paina
  First published: