హోమ్ /వార్తలు /Explained /

Explained: పూరీ జగన్నాథ్ ఆలయ కారిడార్‌పై వివాదం.. ASI, ఒడిశా ప్రభుత్వం మధ్య గొడవకు కారణాలివే

Explained: పూరీ జగన్నాథ్ ఆలయ కారిడార్‌పై వివాదం.. ASI, ఒడిశా ప్రభుత్వం మధ్య గొడవకు కారణాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Puri Jagannath Temple: ఒడిశాలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ దేవాలయం చుట్టూ నిర్మిస్తున్న కొత్త కారిడార్ ప్రాజెక్టుపై వివాదం తలెత్తింది.

ఒడిశా (Odisha)లో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ దేవాలయం (Jagannath Temple) చుట్టూ నిర్మిస్తున్న కొత్త కారిడార్ ప్రాజెక్టుపై వివాదం తలెత్తింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఒడిశా బ్రిడ్జి కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌పై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కొన్ని ఆరోపణలు చేశారు. దేవాలయం చుట్టూ మూత్రశాలలు, క్లోక్‌రూమ్‌లు వంటివి నిర్మించేందుకు లోతైన తవ్వకాలు జరిపి 12వ శతాబ్దానికి చెందిన పురావస్తు అవశేషాలను ఒడిశా బ్రిడ్జి కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ ధ్వంసం చేసి ఉండవచ్చని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోమవారం హైకోర్టుకు తెలిపింది. ఆలయం చుట్టూ చేపట్టే కొత్త నిర్మాణం నిర్మాణం కారణంగా దేవాలయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పూరీకి చెందిన ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దేవాలయ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా సైట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించింది.

* శ్రీమందిర పరిక్రమ ప్రాజెక్ట్  (shree mandira parikrama)అంటే ఏంటి?

గత ఏడాది నవంబర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.800 కోట్లతో చేపట్టే శ్రీమందిర్ పరిక్రమ ప్లాన్ (లేదా జగన్నాథ టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్)కు శంకుస్థాపన చేశారు. ఇందులో జగన్నాథ ఆలయానికి 75 మీటర్ల చుట్టుకొలతలో ఉన్న ప్రాంతాన్ని వారసత్వ కారిడార్‌గా మార్చాలి. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షించడానికి కొత్త మార్పులు చేపట్టాలి. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ నమూనా ప్రకారం పూరీలోని ఆలయ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. యాత్రికులు, భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు కాశీ విశ్వనాథ దేవాలయంతో పాటు గంగా నది వెంబడి ఉన్న ఘాట్‌ల చుట్టూ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.

Delhi Fire Accident: అగ్నిప్రమాద ఘటనలో 27కి పెరిగిన మృతుల సంఖ్య.. ఈ ఘోరం ఎలా జరిగింది?

శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్ట్ పాదచారులకు మాత్రమే అందుబాటులో ఉండే మార్గం. ఇది భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. యాత్రికుల కోసం రెస్ట్‌రూమ్‌లు, డ్రింకింగ్ వాటర్ ఫౌంటైన్‌లు, 6,000 మందికి సరిపడా క్యూ మేనేజ్‌మెంట్ సౌకర్యంతో కూడిన ఆలయ రిసెప్షన్ సెంటర్, ఇన్ఫర్మేషన్-కమ్-డొనేషన్ కియోస్క్‌లు, నీడ కోసం షెల్టర్ పెవిలియన్‌లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను 2023 మే నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దేవాలయం భద్రత, రక్షణ, అభివృద్ధి కోసం ఆలయం చుట్టూ 75 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించాలనే నిబంధన ఉంది.

* వివాదం ఎలా మొదలైంది?

ఈ ఆలయం ASI సంరక్షణలో ఉంది. దీని చుట్టూ 100 మీటర్లలో నిర్మాణాలు చేపట్టకూడదు. చట్టం, నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదు. దీంతో మరుగుదొడ్లు, రిసెప్షన్ సెంటర్, ఇతర సౌకర్యాల కోసం కాంక్రీట్ పునాది వేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ సంస్థ OBCC త్రవ్వకాలు ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. 100 మీటర్ల నిషేధిత జోన్‌లో ఏ విధమైన నిర్మాణాన్ని గతంలో స్మారక చిహ్నాలకు అనుమతించనప్పటికీ, పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాలు (సవరణ, ధ్రువీకరణ) చట్టంలో 2010 సవరణ ప్రకారం.. మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల నిర్మాణాలు చేపట్టవచ్చు. ASI పర్యవేక్షణ, పురావస్తు అధికారుల సమక్షంలో ఈ పనులు జరగాలనే నిబంధన ఉంది.

PM Modi: మరోసారి ప్రధాని పదవి చేపట్టడంపై నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా జరిగిందంటూ..

అయితే ఎక్స్‌కవేటర్లు ఆలయం చుట్టూ 20 అడుగుల వరకు మట్టిని తవ్వడం ప్రారంభించడంతో, పూరీలోని ASI ప్రతినిధులు ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. పురావస్తు ప్రదేశాల చట్టాన్ని తాజా నిర్మాణాలు ఉల్లంఘిస్తున్నందున, పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తవ్వకం పనులు చేపట్టేందుకు పొందిన అనుమతుల వివరాలను తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఎస్‌ఐ కోరింది. ఈ క్రమంలో నిరసనలు చెలరేగడంతో పూరీకి చెందిన దిలీప్ బరాల్ మార్చిలో ఒరిస్సా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆలయ గోడలకు దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని త్రవ్వడం వల్ల, ఆలయ నిర్మాణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఏఎస్‌ఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను హైకోర్టు కోరింది.

* ఉమ్మడి తనిఖీల ఫలితం ఏంటి?

తవ్వకాలలో వారసత్వ ప్రదేశం పురావస్తు అవశేషాలు ధ్వంసమై ఉండవచ్చని ASI తన అఫిడవిట్‌లో పేర్కొంది. దాదాపు 15 నుంచి 20 అడుగుల స్ట్రాటిఫైడ్ డిపాజిట్‌ను తొలగించడం వల్ల వారసత్వ ప్రదేశానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని, రాష్ట్ర అధికారులకు మట్టిని తొలగించే పద్ధతిపై అవగాహన లేదని నొక్కి చెప్పారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు ఎలాంటి అధ్యయనాలు నిర్వహించలేదని, ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను నిర్ధారించడానికి గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్ సర్వే (GPRS) కూడా నిర్వహించలేదని తెలిపారు.

Shocking: అమానుషం.. నడిరోడ్డు మీద మహిళను స్థంబానికి కట్టేశారు.. కారణం ఇదే..

* ఒడిశా ప్రభుత్వం వైఖరి ఏంటి?

చట్టపరిధిలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ఒడిశా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మరుగుదొడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఏఎస్‌ఐ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిందని పేర్కొంది. జగన్నాథుని దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

* ఏఎస్‌ఐ ఏం చెబుతోంది?

గత ఏడాది నిషేధిత జోన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అధికార యంత్రాంగం “ఎన్‌ఓసి” ఇవ్వడం, ఈ సమస్యపై గందరగోళానికి కారణమైందని కొందరు అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూరీని సందర్శించిన ASI డైరెక్టర్ జనరల్ V విద్యావతి.. భక్తులకు క్లోక్‌రూమ్‌లు, టాయిలెట్ సౌకర్యాల నిర్మాణం అవసరమని చెప్పారు. ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతించవచ్చని ఆమె ఒక నోట్‌ రాయడం గందరగోళానికి దారితీసింది. ప్రధాన ఆలయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏఎస్‌ఐ ఈ నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పని చేస్తుందని నోట్‌లో తెలిపారు. ఏఎస్‌ఐ చీఫ్ నోట్.. సంస్థ పనులు నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితం జారీ చేసిన లేఖకు పూర్తి విరుద్ధంగా ఉంది.

* ఇప్పుడు ఏం జరుగుతుంది?

ఒరిస్సా హైకోర్టులో ఈ కేసు జూన్ 22కు వాయిదా పడింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొనసాగుతున్న నిర్మాణ పనులపై హైకోర్టు స్టే విధించనప్పటికీ, దేవాలయంలోని నిషేధిత జోన్‌లో నిర్మాణ పనుల వల్ల వారసత్వ ప్రదేశాల పురావస్తు అవశేషాలు దెబ్బతినే అవకాశం ఉందని ASI అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాజెక్టును ప్రారంభించే ముందు తీసుకున్న చర్యలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి విశ్వాసం ప్రకటించకపోతే.. ఆలయ ప్రాజెక్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

First published:

Tags: National, National News, Odisha

ఉత్తమ కథలు