సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. రే-బాన్ కంపెనీ భాగస్వామ్యంతో స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. రే-బాన్ స్టోరీస్ (Ray-Ban Stories) పేరుతో ఇవి మార్కెట్లోకి రానున్నాయి. ఫేస్బుక్ ఆక్యులస్ వంటి ప్రత్యేకమైన AR- గ్లాసెస్ కానప్పటికీ, ఇవి స్నాప్ (స్నాప్‌చాట్ మాతృసంస్థ) స్పెక్టకిల్స్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి ఫేస్బుక్ అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, రే-బాన్ తీర్చిదిద్దుతున్న ఈ ప్రొడక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇతర కంపెనీల ప్రొడక్ట్స్ కంటే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.
ఫేస్బుక్ రే-బ్యాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్ అంటే ఏంటి? వీటి వల్ల ఉపయోగాలు ఏవి?
ఫేస్బుక్ రూపొందిస్తున్న మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్ ఐకానిక్ వేఫేరర్ డిజైన్‌లో (Wayfarer design) రానున్నాయి. రే బాన్ ముందు నుంచి రూపొందిస్తోన్న ఈ మోడల్ ఐవేర్ బ్రాండ్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ స్మార్ట్‌గ్లాసెస్ రౌండ్, మెటోర్ వంటి రెండు ఇతర డిజైన్లలో కూడా రానున్నాయి. చూడటానికి ఇవి సాధారణ సన్ గ్లాసెస్ లాగా అనిపించవచ్చు. కానీ వీటిలో LED లైట్ ఉన్న రెండు 5MP కెమెరాలను అమర్చుతారు.
ఈ కెమెరాల సాయంతో రికార్డ్ చేసేటప్పుడు తెలుపు రంగులో LED లైట్ ఆన్ అవుతుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరించి వినియోగదారులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రికార్డ్ చేయవచ్చు. ఫోటోలు కూడా తీయవచ్చు. స్నాప్స్ స్పెక్టకిల్స్ కూడా ఇలానే పనిచేస్తాయి. వినియోగదారులు క్యాప్చర్ బటన్ని ఉపయోగించి 30 సెకన్ల వీడియోలను రికార్డ్ చేయవచ్చు. లేదా ఫేస్బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్లతో హ్యాండ్స్-ఫ్రీ విధానంలో ఫోటోలు తీయవచ్చు.
ఫేస్బుక్ గ్లాసెస్‌లో ఇన్‌బిల్ట్ ఓపెన్-ఇయర్ స్పీకర్లు, మైక్రోఫోన్ ఆడియో డివైజ్ ఉంటాయి. వీటి ద్వారా వినియోగదారులు కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఫేస్బుక్ హెడ్‌ఫోన్స్‌లో ఉన్నట్లు మెరుగైన కాలింగ్ అనుభవం కోసం "బీమ్‌ఫార్మింగ్ టెక్నాలజీ", "బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ సస్పెన్షన్ అల్గారిథం" వంటి అధునాతన టెక్నాలజీని వీటిలో ఉపయోగిస్తున్నారు.
స్మార్ట్ గ్లాసెస్ ధర ఎంత? ఇవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి?
రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్ ధర 299 డాలర్ల వద్ద ప్రారంభమవుతుంది. ఇవి ఆన్లైన్లో, రిటైల్ స్టోర్లలో లభిస్తాయి. మొత్తం 20 స్టైల్ కాంబినేషన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ గ్లాసెస్ ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, బ్రిటన్లలో లాంచ్ అవుతున్నాయి.
రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్ ఎలా పని చేస్తాయి?
వీటిని ధరించే వినియోగదారులు స్మార్ట్ గ్లాసెస్‌ను Facebook View యాప్‌తో లింక్ చేయాలి. ఇవి ఫేస్బుక్ అసిస్టెంట్‌కి కూడా సపోర్ట్ చేస్తాయి. యూజర్లు వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా స్మార్ట్ గ్లాసెస్ సాయంతో ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. ఈ గ్లాసెస్ iOS, ఆండ్రాయిడ్ డివైజెస్‌తో కూడా పనిచేస్తాయి. అయితే ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ డివైజ్‌తో క్యాప్చర్ చేసే ఫోటోలు, వీడియోలను.. ఫేస్బుక్ వ్యూ యాప్ ద్వారా డౌన్లోడ్ చేయవచ్చు. వాటిని ఎడిట్ చేయడంతో పాటు షేర్ కూడా చేయవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, ట్విట్టర్, టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫాంలకు కూడా కంటెంట్‌ను పోస్ట్ చేసే ఆప్షన్లు ఉన్నాయి.
వీటికి ప్రత్యేకమైన ఛార్జింగ్ కేస్ ఉంటుంది. USB కేబుల్ ఉపయోగించి వీటిని ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. ఈ గ్లాసెస్ సాయంతో 50 వీడియోలు లేదా 200 ఫోటోలు తీసి, సింక్ చేసుకోవచ్చని ఫేస్బుక్ చెబుతోంది. పూర్తిగా ఛార్జ్ చేసిన డివైజ్‌లను మామూలుగా వినియోగిస్తే 6 గంటల వరకు పనిచేస్తాయి. ఆడియో స్ట్రీమింగ్, ఫేస్బుక్ అసిస్టెంట్‌తో పూర్తి స్థాయిలో వినియోగిస్తే 3 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
ఇవి ఆగ్మెంటెడ్ రియాలిటీతో పనిచేస్తాయా?
రే-బాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్.. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కి సపోర్ట్ చేయవు. AR సపోర్ట్ అందిస్తే, ఈ గ్లాసెస్ ఆప్టిక్స్‌లో డిజిటల్ కంటెంట్‌ను ప్రొజెక్ట్ చేసే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఫేస్బుక్ పక్కన పెట్టింది. ఫేస్బుక్ గతంలో కూడా AR గ్లాసెస్ రూపొందించాలని భావించినప్పటికీ, దాంట్లో ఎదురయ్యే టెక్నాలజీ సవాళ్లను గుర్తించి ప్రాజెక్టును పక్కన పెట్టింది.
గూగుల్ గతంలో రూపొందించిన ‘గూగుల్ గ్లాసెస్’లో కూడా ఏఆర్ టెక్నాలజీని ఉపయోగించినా, అది పెద్దగా విజయవంతం కాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో స్నాప్‌చాట్ సొంతంగా AR గ్లాసెస్‌ను రూపొందించింది. అయితే వాటిని ప్రస్తుతం డెవలపర్స్‌కు మాత్రమే పరిమితం చేసింది. సాధారణ ప్రజలకు వాటిని అమ్మలేదు. స్నాప్‌చాట్ AR గ్లాసెస్ సాయంతో వినియోగదారులు AR ఫిల్టర్స్‌తో పరిసరాలను వీక్షించడంతో పాటు AR గేమ్స్ కూడా ఆడవచ్చు.
ఫేస్బుక్ స్మార్ట్ గ్లాసెస్‌లో ప్రైవసీ ఎలా ఉంటుంది ?
ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ డివైజెస్ వినియోగదారులు ప్రైవసీపై ఆందోళన చెందుతున్నారు. ఫేస్బుక్ స్మార్ట్ గ్లాసెస్ సాయంతో రహస్య సమావేశాలను రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇతరుల అనుమతి లేకుండా రికార్డ్ చేసే వీలుంటుంది. ఇలాంటి వాటిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో ఉపయోగాలను పక్కన పెడితే, దుర్వినియోగానికి వీటిని వినియోగించే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే ప్రపంచంలో ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంగా ఉన్న ఫేస్బుక్ సంస్థకు ప్రైవసీ విలువ గురించి తెలుసు. అందువల్ల కంపెనీ ప్రైవసీతో పాటు రే-బాన్ స్టోరీస్‌పై నెలకొన్న అనుమానాలను సమాధానం ఇవ్వడానికి ఒక మైక్రోసైట్‌ని రూపొందించింది.
ఫేస్బుక్ వ్యూ యాప్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మాత్రమే పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. స్మార్ట్ గ్లాసెస్‌తో క్యాప్చర్ చేసిన డేటా ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుందని, యూజర్లు తమకు ఇష్టమైన లొకేషన్లో ఈ డేటాను స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది. బ్యాటరీ స్టేటస్, ఫేస్బుక్ లాగిన్, వైఫై కనెక్టివిటీ వంటి వివరాలను కేవలం స్మార్ట్ గ్లాసెస్ పనిచేయడానికి మాత్రమే సేకరిస్తామని వెల్లడించింది. వినియోగదారులు ఎన్ని ఫోటోలు తీసుకున్నారు, ఎంత సేపు వీడియోలు తీసుకుంటారు వంటి డేటాను యూజర్లు తమ ఇష్టప్రకారమే షేర్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ ఎప్పుడైనా మార్చుకోవచ్చని ఫేస్బుక్ వెల్లడించింది.
వాయిస్ కమాండ్, ఫేస్బుక్ అసిస్టెంట్ ఆప్షన్లను యూజర్లు ఆప్షనల్‌గా ఉపయోగించుకోవచ్చని ఫేస్బుక్ తెలిపింది. యూజర్ల ఫోటోలు, వీడియోల కంటెంట్‌ను ప్రకటనల కోసం ఉపయోగించమని స్పష్టం చేసింది. దొంగతనానికి గురైన స్మార్ట్ గ్లాసెస్‌ను కొత్త ఫోన్, ఫేస్బుక్ అకౌంట్‌తో లింక్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ డివైజ్‌లోని డేటా ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుందని సంస్థ తెలిపింది. అయితే యూజర్లు పోగొట్టుకున్న ఈ డివైజ్‌లను గుర్తించడానికి ఎలాంటి ఫీచర్‌ను అందించలేదు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.