గేట్‌వే ఆఫ్ హిమాలయగా పిలిచే జోషిమఠ్(Joshi Math) ఇప్పుడు విపత్తు ప్రాంతంగా మారిపోయింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఈ పట్టణం సముద్ర మట్టానికి 6150 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం హిందూ దేవాలయాలకు నిలయమని చెప్పవచ్చు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గంలో ఉండే ఇది చాలా ముఖ్యమైన పౌరాణిక, పురాతన ప్రదేశంగా నిలుస్తోంది. ఇలాంటి ప్రదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా భూమి కుంగిపోవడం, అది దాదాపు అంతరించిపోయే దశలో ఉండటం స్థానికులతో పాటు పర్యాటకులను కలిచి వేస్తోంది.
కుంగిపోవడానికి కారణాలు ఇవే
ఇప్పటికే ఈ పట్టణంలో ఎక్కువ ప్రాంతంలో భూమి కుంగిపోవడంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తపోవన్-విష్ణుగడ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులను వెంటనే ఆపేయాలని అధికారులు ఆదేశించారు. ఎందుకంటే దీని కారణంగానే జోషిమఠ్‌లో భూమి కుంగుతున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. అలానే ఇక్కడ ప్రజలు బాగుచేయలేని స్థాయిలో పర్యావరణంతో చెలగాటమాడుతున్నారని నిపుణులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు.
తపోవన్-విష్ణుగడ్ జలవిద్యుత్ ప్లాంట్ అనేది చమోలి జిల్లాలో ధౌలిగంగా నదిపై నిర్మిస్తున్న 520 మెగావాట్ల రన్-ఆఫ్ రివర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ ప్లాంట్ ఏటా 2.5 TWh కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఎలాంటి ప్లాన్ లేకుండా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టడంతో పాటు హోటల్స్, రెస్టారంట్స్ పుట్టగొడుగుల్లా ఇక్కడ నిర్మించడం వల్ల ఈ ప్రాంతం కుదేలవుతోందని నిపుణులు వివరిస్తున్నారు.
కుంగుబాటుకు గురైన వందల కొద్ది భవనాలు
బద్రీనాథ్, హేమ్‌కుండ్ సాహిబ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారమైన జోషిమఠ్‌లో ఇప్పటికే వందలాది ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌ను కొండచరియలు విరిగిపడే, విపత్తు ప్రాంతంగా, ప్రకటించామని, నివసించడానికి వీలు కాని ఇళ్లలో నివసిస్తున్న 60 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) హిమాన్షు ఖురానా ఆదివారం తెలిపారు.
ఇక్కడ భూమి కుంగిపోయిన పరిస్థితి చూస్తుంటే కనీసం 90 కుటుంబాలను వీలైనంత త్వరగా ఖాళీ చేయవలసి ఉంటుందని గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితిని పర్యవేక్షించే కమిటీకి నాయకత్వం వహిస్తున్న కుమార్ చెప్పారు. జోషిమఠ్‌లో మొత్తం 4,500 భవనాలు ఉన్నాయని, వీటిలో 610 భవనాలకు భారీ పగుళ్లు ఏర్పడి ఉండడానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు
జోషిమఠ్‌లో భూమి కుంగుబాటుకు గురైన సంఘటనలు 1970లలో కూడా వెలుగు చూశాయి. గర్వాల్ కమీషనర్ మహేశ్ చంద్ర మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ప్యానెల్ 1978లో సంఘటనలపై ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసింది. ఈ ప్రాంతాలు మొరైన్‌ల (Moraines) మీద ఉన్నందున సిటీ, లోయలలో భారీ నిర్మాణ పనులు చేపట్టకూడదని ఆ రిపోర్ట్ పేర్కొంది.
వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ లేటెస్ట్ రిపోర్ట్ రచయితలలో ఒకరైన అంజల్ ప్రకాష్ ఫస్ట్ పోస్ట్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘జోషిమఠ్‌లో భూమి కుంగుబాటు సమస్యకు రెండు కోణాలున్నాయి. మొదటిది ప్రబలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని హిమాలయాల వంటి చాలా పెళుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థలో చేపట్టడం. రెండవది వాతావరణ మార్పు’ అని పేర్కొన్నారు. ఇంధన ఉత్పత్తికి ఇతర మార్గాలను అన్వేషించాలని కూడా ఆయన సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జోషిమఠ్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోవడం, పర్యాటకుల తాకిడి తారాస్థాయికి చేరిపోవడం వల్ల అక్కడ భూమిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది చాలదన్నట్టు జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం సొరంగాల నిర్మాణం బ్లాస్టింగ్ ద్వారా జరుగుతుంది. దీనివల్ల భూకంప ప్రకంపనలు, రాళ్లపై శిధిలాలను కదిలించడం, భవనాలు పగుళ్లకు గురి కావడం జరుగుతోంది. అందుకే నిర్మాణ కార్యకలాపాలను పూర్తిగా ఆపి వేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు సరైన చర్యలు తీసుకోవడం ముఖ్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Explained, Uttarakhand