Explainer: ముగ్గురు సంతానమా... వద్దు బాబోయ్... చైనీయులు లబోదిబో... ఎందుకంటే...

ముగ్గురు సంతానమా... వద్దు బాబోయ్... చైనీయులు లబోదిబో (image credit - reuters)

Explainer: చైనా ప్రభుత్వం ఒకప్పుడు ఒకరే సంతానం ఉండాలి అనేది. కొన్నాళ్లకు ఇద్దరు ఓకే అంది. ఇప్పుడు ముగ్గురిని కనాలంటోంది. ప్రజలేమో... కుదరదంటే కుదరదు అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

 • Share this:
  Explainer: చైనాలో ఎంత మంది పిల్లల్ని కనాలో నిర్ణయించేది అక్కడి ప్రభుత్వమే. మన ఇండియాలో లాగా ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ లేదు. తాజాగా అక్కడి ప్రభుత్వం... ఒక్కో ఫ్యామిలీ ముగ్గురు పిల్లల్ని కనవచ్చు అని చెప్పింది. సోమవారం ఈ ప్రకటన చేసింది. ఎందుకిలా అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఈ దేశంలో... యువత సంఖ్య బాగా తగ్గిపోతోంది. చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు కానీ పిల్లల్ని కనేందుకు ఇష్టపడట్లేదు. కొంతమంది కందామన్నా... వాళ్లకు పిల్లలు పుట్టట్లేదు. అందుకే చైనా ప్రభుత్వం... పిల్లల్ని కనండహో అని అంటోంది. కానీ... ప్రజలు సిద్ధంగా లేరు. వద్దు మహాప్రభో అంటున్నారు. ఒక్కరు లేదా ఇద్దరు చాలు అంటున్నారు. వాళ్లది మరో సమస్య.

  మన దేశంలో లాగే చైనాలో కూడా ధరలు బాగా పెరిగాయి. అర్బన్ చైనాలో ఓ సంతానాన్ని పెంచి పెద్ద చెయ్యాలంటే నానా యాతన తప్పట్లేదు. పిల్లల్ని పెంచేందుకు డబ్బు లేకపోవడంతో చాలా మంది పిల్లల్ని కనట్లేదు. ప్రస్తుతం చైనాలో ఒక మహిళకు 1.3 పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అంటే కోటి మంది తల్లులు ఉంటే... వారికి కోటి 30 లక్షల మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అంటే ఒక ఫ్యామిలీకి ఇద్దరు కూడా లేనట్లే. ఇద్దర్ని కనేందుకే ఇష్టం లేని ప్రజలు... ఇక ముగ్గుర్ని కనమంటే... మావల్ల కాదు అంటున్నారు.

  లోతైన విశ్లేషణ:
  ఇండియాలో చాలా మందికి ప్రభుత్వ ఆస్పత్రులు నచ్చవు. చైనాలోనూ అంతే. అక్కడ గర్భం దాల్చిన మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ ఫ్రీయే. అన్నింటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ... చాలా మంది తల్లులు... సరైన సదుపాయాలు లేవు అని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ బిల్లు మోత మోగుతోంది. ఒక్క బిడ్డను కనాలంటే... లక్ష యువాన్లు అవుతోంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.11,49,043 అన్నమాట. జీవితకాలం సంపాదించినది ఒక్క డెలివరీతో ఖర్చైపోతుంది. అందుకే సంతానం వద్దు బాబోయ్ అంటున్నారు.

  సంపన్నుల తీరు ఇదీ:
  చైనాలో సంపన్నులు ఎక్కువే. వారలో చాలా మంది డెలివరీ తర్వాత, తల్లీ బిడ్డను చూసుకోవడానికి ఓ పనిమనిషిని పెట్టుకుంటున్నారు. ఆమెకు నెలకు రూ.1,72,000 అవుతోంది. ఇది చాలనట్లు... చాలా మంది... పిల్లల కేర్, ప్రొఫెషనల్ కేర్ అంటూ... ప్రత్యేక పోస్ట్‌పార్టం (postpartum) కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ నెలకు రూ.17 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఖర్చవుతోంది.

  హౌసింగ్, ఎడ్యుకేషన్:
  చైనాలో పిల్లలకు పాలు పట్టాలంటే... మిల్క్ ఫార్ములా ఉంటుంది. దాన్ని ఆస్ట్రేలియా, లేదా న్యూజిలాండ్ నుంచి తెప్పిస్తారు. అందుకు బోలెడు ఖర్చవుతుంది. ఆ తర్వాత స్కూళ్లకు పంపుతారు. అక్కడ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అక్కడ స్కూల్లో తమ బిడ్డను హాస్టల్‌లో లాగా ఉంచేందుకు చదరపు మీటర్ స్థలానికి వారు సంవత్సరానికి రూ.10 లక్షలు తీసుకుంటారు. పిల్లలందరికీ ప్రభుత్వ స్కూలుకు వెళ్లే ఛాన్స్ ఉండదు. స్థానిక రెసిడెన్సీ పర్మిషన్ ఉంటేనే ప్రభుత్వ స్కూళ్లలో చేర్చుకుంటారు. లేదంటే ప్రైవేట్ స్కూళ్లలో ఖర్చుల మోతే. సంవత్సరానికి రూ.4.58 లక్షల నుంచి రూ.28 లక్షల దాకా ఫీజులు ఉంటాయి.

  ఈ ఖర్చులే భారీ అనుకుంటే... చాలా మంది పేరెంట్స్... తమ ఏకైక చిన్నారిని పియానో, టెన్నిస్, చెస్ క్లాసులకు కూడా పంపిస్తారు. ఇక వాటికీ జేబులు తడుముకోవాల్సిందే.

  2019లో షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఓ రిపోర్ట్ తెచ్చింది. దాని ప్రకారం... షాంఘైలో నివసించే ఒక్కో ఫ్యామిలీ... తమ చిన్నారి పుట్టినప్పటి నుంచి జూనియర్ హైస్కూలులో చదివించేంతవరకూ (అంటే 15 ఏళ్లు వచ్చేవరకూ)... మొత్తం రూ.96 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందులో ఒక్క ఎడ్యుకేషన్ కోసమే రూ.58 లక్షల దాకా ఖర్చవుతోంది. అక్కడి ప్రజలు సంవత్సరానికి రూ.6 లక్షల దాకా సంపాదిస్తున్నారు. అందులో 70 శాతాన్ని చిన్నారి కోసమే ఖర్చు చేస్తున్నారు.

  ఇది కూడా చదవండి: Viral Videos: సూపర్ ఛేజింగ్స్... అడవిలో, నీటిలో... రెండు వైరల్ వీడియోలు చూడండి

  ఇప్పుడు చెప్పండి... అక్కడి పేరెంట్స్ ఒక్క సంతానం చాలు అనడంలో తప్పేమీ లేదు కదా. పిల్లల్ని కనేయండి... మీ తిప్పలు మీరు పడండి అంటే సరిపోదు కదా... అందుకే ప్రభుత్వ ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
  Published by:Krishna Kumar N
  First published: