Panjshir Valley: తాలిబన్ల వెన్నులో వణుకు పుట్టించే పంజ్‌షీర్ లోయ గురించి పూర్తి వివరాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

తాలిబన్లు ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ మొత్తాన్ని దాదాపు ఆక్రమించుకున్నారు. కానీ పంజ్‌షీర్ ప్రాంతాన్ని మాత్రం వారు స్వాధీనం చేసుకోలేకపోయారు. అఫ్గానిస్థాన్‌ యుద్ధచరిత్రలో పంజ్‌షీర్ ప్రాంతం ముందు నుంచి కీలకంగానే ఉంది. అంతర్యుద్ధం సమయంలో కూడా తాలిబన్లు పంజ్‌షీర్‌ను చేజిక్కించుకోలేకపోయారు.

  • Share this:
తాలిబన్లు ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ మొత్తాన్ని దాదాపు ఆక్రమించుకున్నారు. కానీ పంజ్‌షీర్ ప్రాంతాన్ని మాత్రం వారు స్వాధీనం చేసుకోలేకపోయారు. అఫ్గానిస్థాన్‌ యుద్ధచరిత్రలో పంజ్‌షీర్ ప్రాంతం ముందు నుంచి కీలకంగానే ఉంది. అంతర్యుద్ధం సమయంలో కూడా తాలిబన్లు పంజ్‌షీర్‌ను చేజిక్కించుకోలేకపోయారు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు ఉత్తర ప్రాంతంలో ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో పంజ్‌షీర్ లోయ ఉంటుంది. ఇది కాబూల్‌కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పంజ్‌షీర్ లోయను తాలిబన్ల ప్రత్యర్థులకు కంచుకోటగా చెబుతారు. తాలిబన్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరికి పంజ్‌షీర్ లోయ కేంద్రబిందువుగా ఉంటుంది.

ఆగస్టు నెల ద్వితీయార్థం నుంచి తాలిబన్ల పాలనను వ్యతిరేకించే అఫ్గానిస్థాన్‌ ప్రజలందరూ పంజ్‌షీర్ లోయకు తరలిపోయారు. వారందరూ అహ్మద్ మసూద్ నాయకత్వంలో చర్చలు జరుపుతున్నారు. ప్రముఖ అఫ్గాన్ పోరాట యోధుడు అహ్మద్ షా మసూద్ కుమారుడే ఈ అహ్మద్ మసూద్. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోకముందు అఫ్గానిస్థాన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్ కూడా మసూద్ దళాలలో చేరాడు. ఆపద్ధర్మ అధ్యక్షుడిగా తనని తాను ప్రకటించుకున్న అమ్రుల్లా పంజ్‌షీర్ నుంచే తిరుగుబాటు చేస్తానని చెబుతున్నారు.

పంజ్‌షీర్ అనేది ఒక పొడవైన, ఇరుకైన లోయ. ఇది ఇరువైపులా నిటారుగా ఉన్న పర్వతాలతో ప్రత్యర్థులను సంహరించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ లోయ నుంచి బయటికి వెళ్లడానికి ఒకటే ప్రధాని దారి ఉంటుంది. కాబూల్ నుంచి లోపలికి ప్రవేశించాలి అంటే చాలా ఇరుకైన ప్రవేశం ద్వారా ప్రయాణించాలి. అందుకే ఈ ప్రాంతంలో యుద్ధం చేయడానికి బయట వ్యక్తులు చాలా కష్టసాధ్యంగా భావిస్తుంటారు. పంజ్ షీర్‌ అంటే "ఐదు సింహాలు" అని అర్థం. దీనికి మరో అర్థం ఉందని కూడా చెబుతుంటారు. లోయలో ఉన్న ఐదు పర్వత శిఖరాలను పంజ్‌షీర్ గా కొందరు అభివర్ణిస్తుంటారు.

1980-1985 మధ్యకాలంలో సోవియట్ పంజ్‌షీర్ లోయను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని దళాలు సోవియట్ సైనికుల దాడులను తిప్పికొట్టాయి. సోవియట్ దళాలను లోయలోకి అనుమతించి.. ఎత్తైన పర్వతాల ప్రాంతంపై నుంచి ఈ వీరులు దాడిచేసి చంపేశారు. సోవియట్ దళాలు వెనుదిరిగిన అనంతరం మసూద్ దళాలు నార్తర్న్ అలయెన్స్ బ్యానర్ కింద తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడాయి. 1996 నుంచి అపజయం లేని పోరాట గడ్డగా పంజ్‌షీర్ పేరు తెచ్చుకుంది. అమెరికాపై 9/11 దాడులకు రెండు రోజుల ముందుగా తఖర్ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్ హత్యకు గురయ్యారు. అయితే 2001 వరకూ తాలిబన్ దళాలు పంజ్‌షీర్ దళాలను ఏమీ చేయలేకపోయాయి.

20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచం మొత్తం పంజ్‌షీర్ వైపే చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అడుగుజాడలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానని, ముజాహిదీన్ పోరాట యోధులు మరోసారి తాలిబన్‌లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారని అహ్మద్ మసూద్ తెలిపారు. తన తండ్రి కాలం నుంచి సేకరించిన మందుగుండు సామగ్రి, ఆయుధాలు ఇప్పటికీ తమ వద్ద ఉన్నాయని.. ఇలాంటి రోజు ఏదో ఒక సందర్భంలో వస్తుందని తమకు తెలుసు అని అన్నారు.
Published by:Krishna Adithya
First published: