EXPLAINED XCHECK WHAT MAKES 5 8M PEOPLE ON FACEBOOK MORE SPECIAL THAN BILLIONS OF ITS OTHER USERS MK GH
Facebook XCheck: వీఐపీలకు ఫేస్బుక్ ప్రాధాన్యం.. 58 లక్షల మందికి నిబంధనల నుంచి మినహాయింపు ఎందుకు ఇస్తోంది?
ప్రతీకాత్మక చిత్రం
సాధారణంగా ఈ నియమ నిబంధనలు అందరు వినియోగదారులకు ఒకేలా వర్తిస్తాయి. అయితే లక్షలాది మంది ప్రముఖులకు ఇలాంటి రూల్స్ నుంచి ఫేస్బుక్ మినహాయింపు ఇస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక పేర్కొంది. ఫేస్బుక్ ప్రారంభించిన 'XCheck' ప్రోగ్రామ్ అనే క్వాలిటీ కంట్రోల్ మెకానిజం.. వీఐపీలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వినియోగదారులు సంస్థ నియమ నిబంధనలు అనుసరిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కంపెనీలు ప్రత్యేకంగా రివ్యూ పాలసీలను అమలు చేస్తుంటాయి. వీటిని అతిక్రమించిన వారి పోస్టులను ప్లాట్‌ఫాం నుంచి తొలగిస్తాయి. సాధారణంగా ఈ నియమ నిబంధనలు అందరు వినియోగదారులకు ఒకేలా వర్తిస్తాయి. అయితే లక్షలాది మంది ప్రముఖులకు ఇలాంటి రూల్స్ నుంచి ఫేస్బుక్ మినహాయింపు ఇస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక పేర్కొంది. ఫేస్బుక్ ప్రారంభించిన 'XCheck' ప్రోగ్రామ్ అనే క్వాలిటీ కంట్రోల్ మెకానిజం.. వీఐపీలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో Xచెక్ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
XCHECK అంటే ఏంటి?
XCheck లేదా క్రాస్‌చెక్ అనేది ఫేస్బుక్ ప్రారంభించిన క్వాలిటీ కంట్రోల్ మెకానిజం. ఈ ప్రోగ్రాంలో భాగంగా కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర ఉన్నత స్థాయి వినియోగదారుల పోస్ట్‌లకు నియమ, నిబంధనల నుంచి ఫేస్బుక్ మినహాయింపు ఇస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నివేదించింది. దీనికి సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్లను ఉటంకిస్తూ.. "క్రాస్ చెక్" లేదా "XCheck" అనే ఈ ప్రోగ్రాం సోషల్ నెట్‌వర్క్‌లో అందరికీ సమానంగా వర్తిస్తుందని ఫేస్బుక్ పేర్కొన్నప్పటికీ, నిబంధనల నుంచి కొన్ని లక్షల మంది వీఐపీలకు పాలసీల నుంచి మినహాయింపు ఇస్తుందని పేర్కొంది.
Xcheck, లేదా 'క్రాస్ చెక్' ప్రోగ్రామ్.. 5.8 మిలియన్ల మంది ప్రముఖులు, రాజకీయ నాయకుల పోస్ట్‌లకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక చెబుతోంది. సాధారణ వినియోగదారులు ఇలాంటివి పోస్ట్ చేస్తే వాటిని ఫేస్బుక్ పేజీలలో తొలగిస్తుందని వెల్లడించింది. మీడియా గుర్తించే వ్యక్తులు చేసిన పోస్ట్‌లను సమీక్షించడంలో ఫేస్బుక్ మరీ కఠినంగా వ్యవహరించట్లేదట. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండే పేజీల నుంచి చేసే పోస్టులను ఫేస్బుక్ అంత సులభంగా తొలగించకూడదని నిర్ణయించింది. ఇలాంటి సందర్భాల్లో కంపెనీపై మీడియా దృష్టి పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. దీని కోసమే ప్రత్యేకంగా XCheck ప్రోగ్రాం పనిచేస్తుంది.
ఈ ప్రోగ్రాం ఎలా పని చేస్తుంది?
XCheck ప్రోగ్రాం ద్వారా నిబంధనలు అతిక్రమించి చేసే పోస్టులను ఫేస్బుక్ గుర్తించి తొలగిస్తుంది. అయితే ఈ ప్రోగ్రాం హై-ప్రొఫైల్ వినియోగదారులు పోస్ట్ చేసిన కంటెంట్‌ను మరీ కఠినంగా సమీక్షించట్లేదని నివేదికలు చెబుతున్నాయి. XCheck కింద ఫ్లాగ్ చేసిన పోస్టుల్లో కేవలం 10 శాతం పోస్టులను మాత్రమే ఫేస్బుక్ రివ్యూ చేస్తున్నట్లు WSJ తెలిపింది. AI, హ్యూమన్ లీడ్ ప్రక్రియల ద్వారా మోడరేషన్‌తో సమస్యలను పరిష్కరించడానికి ఈ వ్యవస్థను సృష్టించినప్పటికీ, దీని పనితీరు మాత్రం భిన్నంగా ఉందని వెల్లడించింది.
XCheck పనితీరు గురించి బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్మార్ చేసిన కొన్ని పోస్ట్‌లను WSJ ఉదాహరణగా వివరించింది. తనను నెయ్మార్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు చేసిన ఒక మహిళ వాట్సాప్ మెస్సేజ్, ఫోటోల స్క్రీన్షాట్లను ఈ ఆటగాడు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ స్క్రీన్షాట్లలో ఆరోపణలు చేసిన మహిళ నగ్న ఫోటోలు ఉన్నాయి. సంబంధిత నియమాలను ఉల్లంఘించినందుకు ఫేస్బుక్ వాటిని తొలగించింది. అయితే నెయ్మార్ అకౌంట్‌ను XCheck ప్రోగ్రాం ద్వారా కవర్ చేసినందువల్ల కంటెంట్ మోడరేటర్లు అతడి పోస్ట్‌లను వెంటనే బ్లాక్ చేయలేదు. దీంతో ఆ ఫోటోలను తొలగించడానికి ముందు వాటిని ఫేస్బుక్లో 56 మిలియన్ల సార్లు వీక్షించారని WSJ తెలిపింది.
దీని గురించి ఫేస్బుక్ ఏం చెబుతోంది ?
WSJ కథనంపై ఫేస్బుక్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ఆండీ స్టోన్ స్పందించారు. కంపెనీ తమ XCheck ప్రోగ్రామ్ని గోప్యంగా ఉంచట్లేదని, 2018లోనే దీనికి సంబంధించిన లింక్‌ను షేర్ చేశామని తెలిపారు. ఇందులో "క్రాస్ చెక్" అంటే.. కొన్ని పేజీలు లేదా ప్రొఫైల్‌ల నుంచి షేర్ చేసిన పోస్టులను సమీక్షించే ప్రక్రియ అని చెప్పారు. సంస్థ పాలసీలను సరిగ్గా వర్తింపజేసినట్లు నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ సెకండ్ లేయర్‌గా పనిచేస్తుందని వెల్లడించారు. క్రాస్ చెకింగ్ అనేది ప్రొఫైల్, పేజీ లేదా కంటెంట్‌ను తొలగించకుండా కాపాడదని చెప్పారు. సంస్థ నిర్ణయం సరైనదా కాదా అని నిర్ధారించడానికే ఈ ప్రోగ్రాం పనిచేస్తుందన్నారు.
‘XCheck సాధారణంగా హై ప్రొఫైల్ అకౌంట్స్‌కు, ఫేస్బుక్లో క్రమం తప్పకుండా సందర్శించే పేజీలు లేదా కంటెంట్‌కు వర్తిస్తుంది. తద్వారా ఇలాంటి అకౌంట్, పేజీ లేదా కంటెంట్‌ను పొరపాటున తొలగించే ప్రమాదం ఉండదు. అనేక మీడియా సంస్థల పేజీలను ఫేస్బుక్ క్రాస్ చెక్ చేస్తుంది. ఇది ప్రముఖులు, ప్రభుత్వాలు లేదా ఫేస్బుక్ గతంలో తప్పులు చేసిన పేజీల నుంచి పోస్ట్ చేసిన కంటెంట్‌పై రిపోర్ట్స్‌కు కూడా విస్తరించవచ్చు’ అని ఆండీ స్టోన్ వరుస ట్వీట్లలో తెలిపారు.
"WSJ నివేదిక పదేపదే ఫేస్‌బుక్‌కు చెందిన డాక్యుమెంట్లను ఉదహరిస్తూ, సంస్థలో జరగాల్సిన మార్పుల గురించి ప్రస్తావిస్తోంది. అయితే ఫేస్బుక్ ఇప్పటికే అంతర్గతంగా కొన్ని మార్పులు చేపట్టింది. సిస్టమ్‌ని సరిదిద్దేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రోగ్రాంను మెరుగుపరచాల్సిన అవసరం ఉందనేది ఫేస్బుక్ సొంత విశ్లేషణ" అని ఆండీ వివాదాన్ని చిన్నది చేస్తూ వెల్లడించారు.
2020లో కూడా WSJ ఫేస్బుక్ మోడరేషన్స్ గురించి ఒక కథనం ప్రచురించింది. భారత్‌లో బీజేపీకి చెందిన కొంతమంది సభ్యులు నియమాలను ఉల్లంఘించినప్పటికీ.. వారు షేర్ చేసే అభ్యంతరకరమైన పోస్ట్‌లపై ఫేస్బుక్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించింది. అయితే కొన్ని సందర్భాలలో సంస్థ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ.. వార్తాపరంగా, ప్రజా ప్రయోజనం ఉండే కంటెంట్‌ని అనుమతిస్తామని ఫేస్బుక్ తెలిపింది. హాని కలిగించే ప్రమాదంపై ప్రజా ప్రయోజన విలువను గుర్తించిన తర్వాత మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను చూస్తామని వెల్లడించింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.