Explained: ఐటీ రంగంలో ఫ్రెషర్లకు పెరుగుతున్న డిమాండ్.. ఈ స్థాయిలో అవకాశాలు పెరగడానికి కారణం ఇదేనా..!

ప్రతీకాత్మక చిత్రం

Explained: కరోనా కారణంగా లాక్‌డౌన్లు విధించడంతో టెక్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. అయితే పరిస్థితులు చక్కబడటంతో ఈ రంగం భారత ఆర్థిక పునరుజ్జీవనానికి బాటలు వేస్తోంది. కరోనా సమయంలో చాలామందిని సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగించాయి.

  • Share this:
భారత ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని టాప్-4 ఐటీ కంపెనీలు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ సంస్థలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత మంది కొత్త గ్రాడ్యుయేట్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలు సుమారు 1.6 లక్షల మందిని చేర్చుకోవాలని చూస్తున్నాయి. పరిశ్రమలో డిమాండ్ కారణంగా నాలుగు కంపెనీల అట్రిషన్ (ఉద్యోగ వలసల రేటు) పెరిగింది. దీంతో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గత ఆరు నెలల్లో కంపెనీలు దాదాపు లక్ష మందిని కొత్తగా చేర్చుకుంటున్నాయి. ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగం సెప్టెంబర్ 2021లో నాలుగు శాతం నెలవారీ వృద్ధిని, సంవత్సరం ప్రాతిపదికన 138 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక వెల్లడించింది.

కరోనా కారణంగా లాక్‌డౌన్లు విధించడంతో టెక్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. అయితే పరిస్థితులు చక్కబడటంతో ఈ రంగం భారత ఆర్థిక పునరుజ్జీవనానికి బాటలు వేస్తోంది. కరోనా సమయంలో చాలామందిని సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. కొంతమందికి ‘లే ఆఫ్స్’ ప్రకటించాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త ఉద్యోగాల సృష్టికి కారణమైంది.

దీంతో గత కొన్ని నెలలుగా అద్భుతమైన వృద్ధిని ఈ రంగం నమోదు చేసింది. కంపెనీలు సంప్రదాయ సర్వర్ బేస్డ్ మోడల్స్ నుంచి క్లౌడ్ బేస్డ్ విధానంలోకి మారాయి. దీనివల్ల డేటా అనలిటిక్స్, DevOps, AI వంటి క్లౌడ్ ఆధారిత నైపుణ్యాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ విభాగాల్లో నైపుణ్యాలు ఉన్నవారికి ఇప్పుడు మంచి అవకాశాలు దక్కుతున్నాయి.

* డిజిటలైజేషన్ కీలకం
కరోనా తరువాత డిజిటల్ టెక్నాలజీకి అన్ని రంగాల్లోని కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత ఏడాది డిసెంబరులో నాస్కామ్, మెకిన్సే దీనికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేశాయి. కరోనా తరువాత డిజిటలైజేషన్‌ అనేది తమ కార్యకలాపాల్లో భాగమైందని, వివిధ సంస్థలు డిజిటల్ టెక్నాలజీ స్వీకరణను వేగవంతం చేయాల్సి వచ్చిందని రిపోర్ట్ పేర్కొంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ రేటు 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది. క్లౌడ్ వ్యయంలో సైతం 80 శాతం పెరుగుదల ఉన్నట్లు నివేదిక తెలిపింది.

మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు పెద్ద ఎత్తున IT ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అలవాటు పడాల్సి వచ్చిందన్నారు YES సెక్యూరిటీస్‌లోని ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ లీడ్ అనలిస్ట్ పీయూష్ పాండే. ఈ క్రమంలో క్లౌడ్ టెక్నాలజీలతో పాటు డేటా అనలిటిక్స్‌ అవసరం పెరిగిందని, ఫలితంగా ఈ రంగాల్లోని నిపుణులకు డిమాండ్ పెరిగిందని ‘ద న్యూస్ మినిట్’ వార్తా సంస్థకు వివరించారు.

ఈ విభాగాల్లో అనుభవజ్ఞులైన ఉద్యోగుల సంఖ్య పరిమితంగా ఉన్నందున కంపెనీలు ఫ్రెషర్స్‌ను నియమించుకుని వారికి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుత డిమాండ్‌కు ఈ ప్రక్రియే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. డిమాండ్, సప్లై సూత్రాన్ని సమతుల్యం చేయడానికి రెండు త్రైమాసికాలు పడుతుందని పీయూష్ అంచనా వేస్తున్నారు. మహమ్మారి లేకుంటే ఈ ఐటీటి కంపెనీలు సంప్రదాయ సర్వర్ బేస్డ్ మోడల్స్‌నే కలిగి ఉండేవని, ఈ వృద్ధి వేగం భవిష్యత్తులో విస్తరించి ఉండేదని చెప్పారు.

ఐటీ కంపెనీల ఈ వృద్ధి పథం వచ్చే మూడేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పీయూష్ చెప్పారు. 2025 నాటికి క్లౌడ్ ప్రొఫెషనల్స్ డిమాండ్ 2 మిలియన్లకు చేరుకుంటుందని నాస్కామ్ నివేదిక పేర్కొంది. భారతదేశ క్లౌడ్ మార్కెట్ 2022 నాటికి 26 శాతం వార్షిక వృద్ధితో $ 5.6 బిలియన్లకు చేరుకుంటుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. గత సంవత్సరం IT కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేశాయి. ప్రధాన సంస్థలు రికార్డు స్థాయిలో డీల్స్ కుదుర్చుకున్నాయి. ఈ డీల్ ఇన్‌ఫ్లోల కారణంగా నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది.

ఇది కూడా చదవండి : మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5.70 లక్షలు సంపాదించే ఛాన్స్..!

* ఫ్రెషర్స్‌పై పెట్టుబడి ఎందుకు?
ప్రస్తుతం ఐటీ సెక్టార్‌లో నెలకొన్న డిమాండ్, భారీ ఒప్పందాల కారణంగా క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయని చెప్పారు TCS CEO రాజేష్ గోపీనాథన్. కొత్తగా ప్రతిభావంతులను చేర్చుకోవడంతో పాటు సంస్థకు చెందిన నిపుణులపై కూడా తాము పెట్టుబడి పెడతామన్నారు.

* డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంది?
భారత ఐటీ పరిశ్రమ దాదాపు 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. సెకండ్ వేవ్ నాటికి సంస్థలు బిజినెస్ విషయంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి.

అయితే ఇదే సమయంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సూపర్ సైకిల్స్ కారణంగా మార్కెట్‌లో ఈ రకమైన హైరింగ్ ట్రెండ్ ఏర్పడిందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీ ఎవరూ ఊహించని వేగంతో అభివృద్ధి చెందడం, డిజిటలైజేషన్ సూపర్‌సైకిల్ కారణంగా డిజిటలైజేషన్‌లో పెట్టుబడులు అనివార్యంగా మారాయి. దీని కారణంగా ఫ్రెషర్స్ నియామకాలతో పాటు లేటరల్ హైరింగ్స్ కూడా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Published by:Sridhar Reddy
First published: