ఏడాది పాటు సాగు చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన అన్నదాతలకు తలొగ్గి ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) సాగు చట్టాలను రద్దు చేశారు. దాంతో రైతులు భారీ విజయం సాధించినట్లయింది. అయినప్పటికీ రైతు సంఘాలు ఇప్పటికిప్పుడే తమ ఉద్యమానికి ముగింపు పలికే సూచనలు కనిపించడం లేదు. రైతు ఉద్యమం లేవనెత్తిన డిమాండ్లన్నీ నెరవేర్చితేనే తాము ఇళ్లకు వెళ్తామని, అప్పటి వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని రైతు సంఘాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. ముఖ్యంగా కనీస మద్దతు ధర (MSP) చట్టాన్ని తెచ్చేంత వరకు రైతాంగ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నాయి. దాంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసినప్పటికీ.. ఎంఎస్పీ (MSP) పథకం పలు చర్చలకు దారి తీస్తోంది. ఈ తరుణంలో ఎంఎస్పీ కోసం రైతులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఎంఎస్పీని ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? ఎంఎస్పీని ఎలా లెక్క కడతారు? లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎంఎస్పీ హామీని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే 1960ల మధ్యకాలం నుంచి ఎంపిక చేసిన పంటలకు ఎంఎస్పీలు ప్రకటించింది ప్రభుత్వం. ఆ సమయంలో దేశం 'హరిత విప్లవం' కింద ఆహార సమృద్ధిని సాధించడానికి నడుం కట్టింది.
చదవండి - Repeal of farm laws: రైతు చట్టాల్లో ఏముంది.. అసలు రైతులు ఎందుకు వ్యతిరేకించారు
అయితే ఎంఎస్పీలను చట్టపరమైన విధానంగా ప్రభుత్వం ఆచరణలోకి తేలేదు. ఎంఎస్పీని తేవడానికి లేదా దేశంలో ఉత్పత్తి చేసిన అన్ని విభిన్న పంటలను సేకరించడానికి బాధ్యతలను స్వీకరిస్తామని ప్రభుత్వం ఎవరికీ హామీ ఇవ్వలేదు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొదలు పెట్టిన నిరసనల్లో ఎంఎస్పీ కీలక అంశంగా ఉంది. మార్కెట్(Market) కమిటీల వెలుపల విక్రయించడానికి వీలుగా నియమాలు ఉన్నాయే తప్ప కనీస ధర చెల్లించాల్సిందిగా కొనుగోలుదారులకు ఎలాంటి నిబంధనలను ప్రస్తావించలేదు. కొనుగోలుదారులు కాంట్రాక్టు వ్యవసాయం (Contract Farming)లో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస ధర చెల్లించాల్సిందిగా ఎలాంటి నిబంధనలు లేనందున రైతులు ఎంఎస్పీ హామీ కోసం డిమాండ్ చేశారు.
కొత్త చట్టాలు (New Laws) వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్ట ధర వచ్చేలా చేస్తాయని కేంద్రం పేర్కొన్నప్పటికీ.. ఎంఎస్పీ లేకపోవడం వల్ల రైతులు తమ ఆదాయానికి ప్రత్యక్ష ముప్పు వాటిల్లుతుందని భావించారు. కొనుగోలుదారుల చేతుల్లోకి పంట ధరలు నిర్ణయించే అధికారం వెళ్తుందని రైతులు భయపడ్డారు. సమగ్ర ఉత్పత్తి వ్యయం (C2 + 50 శాతం) ఆధారంగా ఎంఎస్పీని తయారు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) PM మోడీకి బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎంఎస్పీ ఎందుకు ప్రకటించింది?
లోక్సభ (ఎల్ఎస్) సెక్రటేరియట్ రూపొందించిన రిఫరెన్స్ నోట్ (Reference Note) ప్రకారం, ఎంఎస్పీ అనేది విత్తులు నాటే కాలానికి ముందే రైతులకు హామీ ఇచ్చే ఓ సాధనం. అధిక పెట్టుబడి, వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రైతుల పండించే భవిష్యత్తు పంటకు సరైన ధరను నిర్ణయించడం కోసం ఎంఎస్పీని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఏ సంవత్సరంలోనైనా భారీగా పంట పండితే ఆ వస్తువు ధరలో భారీ పతనం అవుతుంది. అలాంటప్పుడు ఆ పంట భవిష్యత్తులో రైతులు పండించారు. కానీ ఎంఎస్పీ బీమా అందించడం వల్ల రైతులు మళ్లీ అదే పంటను భవిష్యత్తులో కూడా నష్ట భయం లేకుండా పంపించగలరు. తద్వారా ఎవరి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు.
ఎంఎస్పీ ఎలా లెక్కిస్తారు?
అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ కమిషన్ (Agriculture Cost and Price Commission) సిఫార్సుల ఆధారంగా కేంద్రం ద్వారా ఖరీఫ్ (వానాకాలం), రబీ(యాసంగి) సీజన్ల పంట కాలాల కోసం ఏటా ఎంఎస్పీని నిర్ణయిస్తారు.
పంట పండించడం నిమిత్తం అయిన మొత్తం ఖర్చుతో సహా పంట పండించడం కోసం పెట్టిన పెట్టుబడిలో 50% కలిపి ఎంఎస్పీని నిర్ణయిస్తారు. సమగ్ర ఉత్పత్తి వ్యయం ఆధారంగా ఎంఎస్పీ క్యాలిక్యులేట్ చేయాలని కొన్ని రైతుల సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.
ప్రభుత్వం ఎంఎస్పీని ఎందుకు నిలిపివేయాలనుకుంటోంది?
వ్యవసాయ చట్టాల మాదిరిగానే కనీస మద్దతు ధర అంశం కూడా మన దేశంలో ఒక రాజకీయ అంశంగా రూపుదిద్దుకుంటోంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయ పక్షాలు ప్రకటనలు చేస్తుంటాయి. ఈ క్రమంలో దాదాపు రెండు డజన్ల పంటలకు ఎంఎస్పీలు ప్రకటించినా, భారతదేశంలో కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే భారత ఆహార సంస్థ (FCI) నోడల్ సెంట్రల్ ఏజెన్సీగా ఉన్నందున హామీ రేట్లను పొందగలుగుతున్నారని తేటతెల్లం అవుతోంది. ఎంఎస్పీ విధానం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం సాధ్యం కాదని లోక్సభ సెక్రటేరియట్ నోట్ చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో ప్రతి వస్తువును ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని పేర్కొంటోంది. అందుకే ప్రభుత్వం ఎంఎస్పీని నిలిపివేయాలనుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central governmennt, Farm Laws, Farmers, MSP, New Agriculture Acts