Edible oil prices: భారత్‌లో వంట నూనెల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వం ధరలను తగ్గించే అవకాశం లేదా? పూర్తి విశ్లేష?

Edible Oils: మంటెక్కిస్తున్న వంట నూనె.. కరోనా టైంలో సామాన్యుడి జేబుకు చిల్లు..

వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెడగడం మరింత భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరల పెరుగుదలకు కారణాలు, ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ముందు ఉన్న మార్గాలను పరిశీలిద్దాం.

  • Share this:
భారత్‌లో వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువగా పడుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెడగడం మరింత భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరల పెరుగుదలకు కారణాలు, ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ముందు ఉన్న మార్గాలను పరిశీలిద్దాం.

వంట నూనెల ధరలు ఎంత వరకు పెరిగాయి?
మన దేశంలో వేరుశనగ నూనె, ఆవ నూనె, వనస్పతి లేదా డాల్డా, సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ వంటి ఆరు రకాల వంట నూనెలు లేదా తినదగిన నూనెలు (Edible oils) వినియోగంలో ఉన్నాయి. గత ఏడాది నుంచి చూస్తే, ఈ నూనెల ధరలు 20-56 శాతం పెరిగాయి. ప్రస్తుతం ప్యాక్ చేసిన కిలో ఆవ నూనె రిటైల్ ధర రూ.171కు చేరుకుంది. ఒక సంవత్సరంలోనే ఇది 44 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి దీని ధర కిలోకు రూ.118 రూపాయలు మాత్రమే. సోయా, పొద్దుతిరుగుడు నూనె ధరలు కూడా ఒక సంవత్సరంలో 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ నెలలో మొత్తం ఆరు రకాల వంట నూనెల నెలవారీ సగటు రిటైల్ ధరలు.. 11 సంవత్సరాల గరిష్టానికి పెరిగాయి.

భారతదేశంలో వంట నూనెల వినియోగం ఎంత?
పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. మన దేశంలో వంట నూనెల వినియోగం కూడా పెరుగుతోంది. ఆవ నూనెను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తుండగా, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి శుద్ధి చేసిన నూనెలను పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. 1993-94 నుంచి 2004-05 మధ్య వంట నూనెల నెలవారీ తలసరి వినియోగాన్ని గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 0.37 కిలోల నుంచి 0.48 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 0.56 కిలోల నుంచి 0.66 కిలోలకు పెరిగింది. 2011-12 నాటికి ఇది గ్రామీణ ప్రాంతాల్లో 0.67 కిలోలు, పట్టణ ప్రాంతాల్లో 0.85 కిలోలకు పెరిగింది. దేశీయ వనరులతో పాటు దిగుమతులను పరిశీలిస్తే, నూనెలకు డిమాండ్ పెరుగుతూనే ఉందని తెలుస్తోంది.

దేశీయంగా ఎంత మొత్తంలో నూనెలు ఉత్పత్తి అవుతున్నాయి? దిగుమతి ఎంత?
కూరగాయల నూనెల డిమాండ్ 2015-16 నుంచి 2019-20 మధ్య 23.48–25.92 మిలియన్ టన్నుల పరిధిలో ఉందని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో దేశీయ వనరుల నుంచి సరఫరా చాలా తక్కువగా ఉంది. ఇది 8.63–10.65 మిలియన్ టన్నుల వరకు మాత్రమే పరిమితమైంది. 2019-20లో.. ప్రాధమిక వనరులు (ఆవాలు, వేరుశనగ వంటి నూనె గింజలు), ద్వితీయ వనరుల (కొబ్బరి, ఆయిల్ పామ్, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజలు) నుంచి తీసిన తినదగిన నూనెల దేశీయ లభ్యత 10.65 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. ఈ సమయంలో మొత్తం డిమాండ్ మాత్రం 24 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే రెండింటి మధ్య తేడా 13 మిలియన్ టన్నులకు పైగా ఉండటం గమనార్హం.

అందువల్ల వంట నూనెల అవసరాలకు బారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2019-20లో భారత్‌ రూ.61,559 కోట్ల విలువైన 13.35 మిలియన్ టన్నుల తినదగిన నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం డిమాండ్‌లో ఇది 56 శాతం. ఇందులో ప్రధానంగా ఆయిల్ పామ్ (7 మిలియన్ టన్నులు), సోయాబీన్ (3.5 మిలియన్ టన్నులు), పొద్దుతిరుగుడు (2.5 మిలియన్ టన్నులు) ఉన్నాయి. సోయాబీన్‌ను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి; పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియా నుంచి; పొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
భారతదేశంలోని వంట నూనెల డిమాండ్‌లో 56 శాతం దిగుమతులే ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా పెరిగే ధరలు, మన దేశంలోని వంట నూనెలపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తినదగిన నూనెల (ఎడిబుల్ ఆయిల్స్) ధరలు ఇటీవల బాగా పెరిగాయి. వివిధ దేశాల డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్‌లలో వంట నూనెల ధరలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
వెజిటబుల్ ఆయిల్స్ నుంచి జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయెల్) తయారుచేసే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. దీంతో తినదగిన నూనెలను ఆహార అవసరాల కోసం కాకుండా ఇంధన అవసరాలకు వాడుతున్నారు. అమెరికా, బ్రెజిల్, ఇతర దేశాలలో సోయాబీన్ నూనె నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేయడంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎడిబుల్ నూనెలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.

ఇదే సమయంలో చైనా కొనుగోళ్లు పెరగడం, మలేషియాలో కార్మిక సమస్యలు, ఆయిల్ పామ్, సోయా పంటలు పండించే ప్రాంతాల్లో ‘లా నినా’ ఏర్పడటం.. ఇండోనేషియా, మలేషియాలో ముడి పామాయిల్‌పై ఎగుమతి సుంకాలు వంటి అంశాలన్నీ భారత్‌లో వంట నూనెల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అమెరికాలో సోయా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలలో సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వచ్చే ఏడాది ఈ ముడి నూనె సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా అర్జెంటీనాలో కూడా వాతావరణ పరిస్థితుల వల్ల నూనె గింజల దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఇవన్నీ భారత్‌లో వంట నూనెల ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ధరల నియంత్రణకు ప్రభుత్వం ముందు ఎలాంటి మార్గాలు ఉన్నాయి?
దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల ప్రస్తుతానికి వంట నూనెల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్, డెవలప్‌మెంట్ సెస్‌, సోషల్ వెల్‌ఫేర్ సెస్‌తో కలిపి.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దిగుమతి సుంకాల రేటు 35.75 శాతానికి చేరుకుంది. రిఫైన్డ్‌, బ్లీచింగ్ అండ్ డీడోరైజ్డ్ (RBD) పామాయిల్‌పై దిగుమతి సుంకాలు 59.40 శాతంగా, క్రూడ్ అండ్ రిఫైన్డ్ సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెపై దిగుమతి సుంకాల రేటు 38.50-49.50 శాతంగా ఉంది.

ఇలాంటి దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గిస్తే, ధరలు వెంటనే తగ్గుతాయని ఒక అధికారి తెలిపారు. అయితే ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ మాత్రం సుంకాలను తగ్గించడానికి అనుకూలంగా లేదు. సుంకాలను తగ్గిస్తే.. ఆ మేరకు కంపెనీలు ధరలు పెంచడం, అంతర్జాతీయ ధరలు పెరగడం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రభుత్వం తినదగిన నూనెలకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు, వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదలకు అందుబాటులో ఉంచడం వల్ల పేదలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: