Cinema Ticketing Portal: సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌.. అసలు కారణాలు..

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter

Cinema Ticketing Portal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
Cinema Ticketing Portal: సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) ప్రభుత్వం సిద్ధం చేయనున్నట్లు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏంటో చూద్దాం.. సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ జీవోను కూడా విడుదల చేసింది. ఏపీలో (Railway Online Ticketing System)  రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలోనే సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ (Andhra Pradesh govt is launching online cinema ticketing portal)  కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించనుందని ఆ జీవోలో తెలిపింది.

ఈ నిర్ణయంతో స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే కొత్త వ్యాపారంలోకి ఏపీ ప్రభుత్వం ప్రవేశిస్తోంది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ దీనికి సంబంధించిన ఆర్డర్ జారీ చేశారు.

* ప్రభుత్వం సొంతంగా ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ఎందుకు ప్రారంభిస్తోంది?
ఏపీలో మెజారిటీ సింగిల్ స్క్రీన్‌ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు కొంతమంది పెద్ద సినీ నిర్మాతల నియంత్రణలో ఉన్నాయి. సినిమా విడుదల తేదీలు, స్క్రీనింగ్‌లపై పూర్తి నియంత్రణ వీరిదే ఉంటుంది.

ఇలాంటి వారికి, వారి ఆధ్వర్యంలోని నియంత్రిత వ్యవస్థకు చెక్ పెట్టేందుకే కొత్త పోర్టల్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా టికెట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకే కొత్త పోర్టల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధర కనిష్టంగా రూ.5 (గ్రామంలో ఉండే నాన్- ఏసీ థియేటర్) నుంచి గరిష్టంగా రూ .250 (మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రీమియం మల్టీప్లెక్స్) వరకు ఉండాలని సీలింగ్ రేట్లను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఈ రేట్లు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆగస్టు 31న విడుదల చేసిన ఈ GO ఈ బుధవారం తాజాగా బయటకు వచ్చింది. టికెట్ ధరల పరిమితి, సినిమా టిక్కెట్ల అమ్మకాల ప్రక్రియను ఇందులో వివరించారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీంట్లో పేర్కొన్నారు.

* ఈ ప్రక్రియ ఎలా ముందుకు వెళ్లనుంది?
కొత్త పోర్టల్‌కు సంబంధించిన విధివిధానాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఇందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించి, ప్రక్రియను ఎలా కొనసాగించాలో చర్చించింది.

ఇప్పటికే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోంది. దీంతో అదనపు ఆదాయం కోసం కొత్తగా సినిమా టిక్కెట్ల అమ్మకం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని, ఆ తరువాత ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని నష్టాలను ఎదుర్కొంటున్న థియేటర్లకు అందజేస్తుందనే చర్చ కూడా నడుస్తోంది.

* దీనిపై థియేటర్ కమిటీ ఏం చెబుతోంది?
ప్రతిపాదిత వ్యవస్థ గురించి కమిటీ సభ్యులు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ టీవీకే రెడ్డి స్పందించారు. పన్ను ఎగవేతను నిరోధించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని తెలిపారు. అయితే ఇలా మొత్తం డబ్బును ప్రభుత్వం సేకరించడం సరికాదన్నారు.

ఈ ఆదాయం ఆయా థియేటర్లకు మాత్రమే వెళ్తుందని పీటీఐతో చెప్పారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థతో సినిమా టికెట్ల రేట్లలో ఏకరూపత వస్తుందని, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి సహాయపడుతుందని తెలిపారు. కొత్త వ్యవస్థకు సంబంధించిన విధివిధానాలను ఇంకా రూపొందించాల్సి ఉందని టీవీకే రెడ్డి వివరించారు. ఈ సిస్టమ్‌ని ప్రారంభించడానికి ముందు ఎగ్జిబిటర్‌లతో కూడా మాట్లాడతామని వెల్లడించారు.
Published by:Suresh Rachamalla
First published: