• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • EXPLAINED WHO IS MG GEORGE MUTHOOT THE RICHEST MAN IN KERALA MK GH

MG George Muthoot: కేరళలోనే అత్యధిక ధనవంతుడు జార్జ్ ముత్తూట్ గురించి మీకు తెలుసా?

MG George Muthoot: కేరళలోనే అత్యధిక ధనవంతుడు జార్జ్ ముత్తూట్ గురించి మీకు తెలుసా?

జార్జ్ ముత్తూట్

ఎంజీ జార్జ్ ముత్తూట్ ప్రమాదవశాత్తూ మరణించడం మా సంస్థకు, ఉద్యోగులకు, భాగస్వాములకు, కుటుంబం, స్నేహితులు అందరికీ తీరని లోటు. కంపెనీకి చెందిన డైరెక్టర్లు, ఉద్యోగులు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

  • Share this:
ఎంజీ జార్జ్ ముత్తూట్.. ఈయన మనలో ఎక్కువ మందికి తెలియకపోయినా పేరు చివర ఉన్న ఆ ఇంటిపేరుతోనే ఆయనను గుర్తు పట్టేస్తుంటారు చాలామంది. అవును. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ను దేశవ్యాప్తంగా విస్తరించిన వ్యక్తి ఆయన. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ ఫైనాన్స్ సంస్థగా ముత్తూట్ కి మంచి పేరుంది. ముత్తూట్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.51,000 కోట్లు.. ఆదాయం 8,722 కోట్లు.. ఈ సంస్థను ప్రారంభించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఎంజీ జార్జ్ ముత్తూట్ ఇటీవలే న్యూదిల్లీలో కన్నుమూశారు. పోలీసుల కథనం ప్రకారం ఈస్ట్ కైలాశ్ లోని తన అపార్ట్ మెంట్ నుంచి కిందపడి మరణించారు. నాలుగో ఫ్లోర్ లో ఉన్న ఆయన అపార్ట్ మెంట్ బాల్కనీలో ఉన్న ఆయన అక్కడి నుంచి జారిపడిపోయారని పోలీసుల కథనం. అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ కి గత శుక్రవారం రాత్రి 9.21 సమయానికి సమాచారం అందింది. వెంటనే ఆయనని ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు అని డీసీపీ ఆర్ పీ మీనా వెల్లడించారు.

ఆయన ప్రమాదవశాత్తూ కింద పడి మరణించారని సీసీటీవీ ఫుటేజ్ కూడా వెల్లడిస్తోంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారి వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో జార్జ్ ముత్తూట్ ఒంటరిగానే ఉన్నట్లు తెలిసింది. వారసత్వంగా వచ్చిన ముత్తూట్ సంస్థను ఈ స్థాయికి చేర్చేందుకు జార్జ్ ఎంతో శ్రమించారనే చెప్పుకోవాలి. అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైందంటే..

కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలోని కోజెన్ చెర్రీలో 1949లో జన్మించారు జార్జ్. ఆయన తాత ముత్తూట్ నినాన్ మథాయి ఈ సంస్థను ప్రారంభించారు. ఆయన తండ్రి ఫైనాన్స్ బిజినెస్ ని ప్రారంబించారు. మణిపాల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేసిన జార్జ్ ముత్తూట్ ఆ తర్వాత తన సంస్థలోనే ఆఫీస్ అసిస్టెంట్ గా చేరారు. ఆ తర్వాత 1979 నాటికి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత సంస్థ విడిపోయిన తర్వాత 1993లో సంస్థ ఛైర్మన్ గా మారారు. 1980ల్లో కుటుంబ విభేదాల కారణంగా ముత్తూట్ ఫైనాన్స్ గ్రూప్ జార్జ్ కుటుంబానికి దక్కితే మరో ప్రధాన పోటీదారు ముత్తూట్ పచ్చప్పన్ గ్రూప్ జార్జ్ కజిన్స్ కి దక్కింది. ఆ తర్వాత జార్జ్ సారథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ కొచ్చి నుంచి విస్తరించి దేశవ్యాప్తంగా 5,550 బ్రాంచిల వ్యాపారాన్ని ఏర్పర్చుకుంది. దేశంలోనే అతి పెద్ద గోల్డ్ లోన్ సంస్థగా మారింది. 2020 లో ఈ సంస్థ సంవత్సరాదాయం 1..3 బిలియన్ డాలర్లు. 2020 చివరి వరకూ సుమారు రూ.56,000 కోట్ల రుణాలను అందించి వ్యాపారం జరిపిందీ సంస్థ.2020లో జార్జ్ ముత్తూట్ అత్యంత ధనవంతుల లిస్టులో 26వ స్థానాన్ని చేరుకున్నారు. అత్యంత ధనికుడైన మలయాళీగా పేరు తెచ్చుకున్నారు. 2011లో మొదటిసారి ఈ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించుకున్న ఆయన అప్పటి 50వ ర్యాంక్ ని మెరుగుపర్చుకుంటూ 26వ స్థానానికి చేరడం విశేషం. ఫిక్కీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా, కేరళ స్టేట్ కౌన్సిల్ ఫిక్కీ ఛైర్మన్ గా కూడా సేవలు అందించారు. ఆయన ఉత్తమ సేవలకు గాను మహాత్మ గాంధీ నేషనల్ అవార్డ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గాను గోల్డెన్ పీకాక్ అవార్డు వంటి అవార్డులెన్నో సాధించారాయన. కేరళలోని మలంకర ఆర్థోడాక్స్ చర్చి ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు జార్జ్.

జార్జ్ భార్య సారా జార్జ్ ముత్తూట్ దిల్లీలోని సెయింట్ జార్జ్ హై స్కూల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ జంటకు ముగ్గురు కుమారులు. వారి పెద్ద కుమారుడు ఎం జార్జ్ ముత్తూట్ గ్రూప్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, చిన్న కొడుకు అలెక్సాండర్ జార్జ్ సంస్థ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వారి రెండో కుమారుడు పౌల్ ముత్తూట్ జార్జ్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 32 సంవత్సరాల వయసున్న పౌల్ తమ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించేవారు. కేరళలోని అలప్పుజ నుంచి చెంగనస్సరికి ప్రయాణిస్తుండగా ఆగస్ట్ 22, 2009 తేదీన ఆయన మరణించారు. ఇప్పుడు జార్జ్ ముత్తూట్ కూడా మరణించడం సంస్థకు తీరని లోటు అని చెప్పుకోవచ్చు.

ఎంజీ జార్జ్ ముత్తూట్ ప్రమాదవశాత్తూ మరణించడం మా సంస్థకు, ఉద్యోగులకు, భాగస్వాములకు, కుటుంబం, స్నేహితులు అందరికీ తీరని లోటు. కంపెనీకి చెందిన డైరెక్టర్లు, ఉద్యోగులు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అంటూ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ప్రకటనను విడుదల చేసింది.
First published: