ఇండియా గేట్ (India Gate) దగ్గర ఉండే అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక కేంద్రంలోని జ్యోతిలో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈ నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు (Political Parties) విమర్శిస్తున్నాయి. అమర్ జవాన్ జ్యోతి (Amar Jyothi) అనేది శాశ్వతమైన వెలిగే జ్యోతి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలు, ఘర్షణల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు దేశం అర్పించే నివాళికి గుర్తు అది. ఆ జ్యోతిని ప్రభుత్వం ఆర్పేసి దాన్ని ఆ ప్రాంతానికి కొన్ని వందల మీటర్ల దూరంలో 2019లో నెలకొల్పిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రంలో విలీనం చేసింది. ఈ చర్య రాజకీయ దుమారం రేపుతోంది. ఇది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికులను అగౌరవపరిచే చర్య అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
PM Narendra Modi: అత్యధిక ఆమోదం.. వ్యతిరేకత ఆయకే.. జీఎల్ఏఆర్ సర్వేలో ఆసక్తికర విషయాలు!
అమర్ జవాన్ జ్యోతిని ఎందుకు ఏర్పాటు చేశారు?
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 1972లో అమర్ జవాన్ జ్యోతిని నెలకొల్పారు. ఆ యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. 1972 రిపబ్లిక్ డే నాడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) దీన్ని ప్రారంభించారు. అమర్ జవాన్ జ్యోతిలో నల్లరాతితో చేసిన ఒక వేదిక, ఒక స్మృతి చిహ్నం ఉన్నాయి. గుర్తు తెలియని సైనికుల సమాధిగా దీన్ని గుర్తిస్తారు. ఆ వేదికపై బాయ్‌నెట్‌తో కూడిన, తిప్పి ఉంచిన L1A1 సెల్ప్ లోడింగ్ రైఫిల్, దానిపై సైనికులు యుద్ధంలో ధరించే హెల్మెట్ ఉంటుంది. నాలుగు బర్నర్లతో కూడిన నాలుగు కలశాలు దీనిపై ఉంటాయి. సాధారణ రోజుల్లో ఈ నాలుగు బర్నర్లలో ఒకటి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. రిపబ్లిక్ డే వంటి ముఖ్యమైన రోజుల్లో నాలుగు బర్నర్లు వెలిగిస్తారు. ఈ బర్నర్లనే శాశ్వత జ్యోతిగా పరిగణిస్తారు. వీటిని ఎప్పుడూ ఆర్పరు.
ఇవి ఎప్పుడూ ఎలా మండుతూ ఉంటాయి?
గత 50 ఏళ్లుగా ఎప్పుడూ ఆరిపోకుండా ఈ జ్యోతి మండుతూనే ఉంది. కానీ శుక్రవారం ఈ జ్యోతిని పూర్తిగా ఆర్పేసి దాన్ని జాతీయ యుద్ధ స్మారకంలోని మరో శాశ్వత జ్యోతిలో కలిపేశారు. అమర్ జవాన్ జ్యోతిని వెలిగించిన నాటి నుంచి ఇప్పటి వరకు అది ఎల్పీజీ సిలిండర్ల సాయంతో వెలుగుతూనే ఉంది. ఒక సిలిండర్ LPG గ్యాస్ ఈ జ్యోతిని ఒకటిన్నర రోజుల పాటు వెలిగిస్తూ ఉంటుంది. 2006లో LPGని మార్చి ఆ స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ లేదా PNG ఇంధనాన్ని సమకూర్చారు.
దీన్ని ఇండియా గేట్ వద్ద ఎందుకు అమర్చారు?
ఇండియా గేట్‌కు ముందు ఆ ప్రాంతాన్ని ఆల్ ఇండియా వార్ మెమోరియల్ (All India War Memorial) అని పిలిచేవారు. 1931లో బ్రిటీష్ వారు దాన్ని నిర్మించారు. బ్రిటీష్ సైన్యంలో భాగంగా ఉండి అనేక యుద్ధాల్లో మరణించిన 90 వేలకు పైగా భారతీయ సైనికుల స్మృత్యార్థం దాన్ని నిర్మించారు. ఆ స్మారక స్థూపంపై 13,000 మంది వీర సైనికుల పేర్లు ఉన్నాయి. యుద్ధాల్లో చనిపోయిన భారత సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక చిహ్నం కాబట్టి దాని దిగువన 1972లో అమర్ జవాన్ జ్యోతిని నెలకొల్పారు.
Assembly Election 2022: ఆ స్థానాల్లో బీజేపీకి గట్టిపోటీ.. ఎస్పీ అవకాశాన్ని వినియోగించుకొంటుందా?
ఇప్పుడు ఈ జ్యోతిని ఎందుకు ఆర్పారు?
దీనికి అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. దీనిపై రాజకీయ వివాదం తలెత్తడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జ్యోతిని ఆర్పేయలేదని, సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ (National War Memorial) కు మార్చి అక్కడ విలీనం చేశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ శాశ్వత జ్యోతి 1971 యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళి ఘటిస్తుంది తప్ప వారి పేర్లు అక్కడ లేవని, అలాగే ఇండియా గేట్ గతంలోని వలస పాలనకు చిహ్నాంగా నిలుస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నేషనల్ వార్ మెమోరియల్‌లో 1971 యుద్ధం, అంతకు ముందు ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో మరణించిన భారతీయ వీరసైనికుల పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆ జ్యోతి ఉండటం ఆ అమరులకు నిజమైన శ్రద్ధాంజలి అని ప్రభుత్వం వాదిస్తోంది.
2019లో నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు చేసిన తర్వాత భారత రాజకీయ, సైనిక అధిపతులు, విదేశీ ప్రముఖులు ఇక్కడే శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ (Defence minister of India) అధికారులు పేర్కొంటున్నారు. ఈ మార్పు కారణంగా రెండు జ్యోతుల అవసరం లేదని అంటున్నారు. వాస్తవానికి వార్ మెమోరియల్ ఏర్పాటు సమయంలో రెండు చోట్ల జ్యోతులు వెలుగుతూనే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
అయితే అమర్ జవాన్ జ్యోతి స్థాయిలో కొత్త యుద్ధ స్మారక కేంద్రం ప్రభుత్వం ఆశించిన రీతిలో ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకోలేకపోయింది. దీన్ని బాగా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టాలో ఇండియా గేట్, అమర్ జవాన్ జ్యోతి, నేషనల్ వార్ మెమొరియల్ కూడా భాగమే.
మరోవైపు జ్యోతిని కదలిస్తూ, ఇండియా గేట్ పక్కన ఉన్న మండపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 28 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసే విగ్రహం పూర్తయ్యేంత వరకు ఆ స్థానంలో బోస్ హోలోగ్రామ్ విగ్రహం ఉంటుందని తెలిపారు. ఆ మండపంలో అంతకు ముందు కింగ్ జార్జ్ V విగ్రహం ఉండేది. దాన్ని 1968లో తొలగించారు.
నేషనల్ వార్ మెమొరియల్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు కట్టారు?
ఇండియా గేట్‌కు సుమారు 400 మీటర్ల దూరంలో 40 ఎకరాల్లో నిర్మించారు నేషనల్ వార్ మెమోరియల్. స్వాతంత్ర భారతదేశంలో వివిధ యుద్ధాలు, పోరాటాలు, ఆపరేషన్లు, ఘర్షణల్లో మరణించిన సైనికుల స్మృత్యార్థం దీన్ని నిర్మించారు. సైనికుల కోసం చాలా స్మారకాలు ఉన్నాయి కానీ, జాతీయ స్థాయిలో మాత్రం లేవు. ఈ తరహా స్మారక కేంద్రం నిర్మించాలనే చర్చలు 1961 నుంచి జరుగుతున్నాయి. కానీ దీనిపై ఎప్పుడూ అడుగులు ముందుకు పడలేదు. 2015లో మోదీ (Modi) నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నిర్మాణ ప్రదేశంగా ఇండియా గేట్ తూర్పున C హెక్సాగాన్ను ఫైనల్ చేసింది. పోటీ ద్వారా ఈ స్మారక కేంద్ర తుది డిజైన్ ఖరారు చేశారు.
ఈ స్మారక మందిరం నిర్మాణం నాలుగు వృత్తాలను ఆధారంగా చేసుకొని ఉంటుంది. ఇందులో పెద్దది రక్షా చక్రం. ఇందులో దేశాన్ని రక్షించే సైనికులను ప్రతిబింబిస్తూ చెట్ల వరుస ఉంటుంది. రెండోది త్యాగ చక్రం. ఇది చక్రవ్యూహం తరహాలో గుండ్రని గోడలతో ఉంటుంది. మరణించిన సైనికుల కోసం వేర్వేరు గ్రానైట్ పలకాలు ఉంటాయి. బంగారు రంగుతో 26,466 మంది సైనికుల పేర్లు వీటిపై చెక్కారు. విధి నిర్వహణలో సైనికుడు మరణించినప్పుడు వారి పేర్లు వీటిపై చేర్చుతారు.
మూడోది వీర చక్రం. మన సైనిక దళాలు పాల్గొన్న యుద్ధాలు, చర్యలు ప్రతిబింబిస్తూ ఇందులో ఆరు కాంస్య ప్రతిమలు ఉన్నాయి. చివరిది అమర చక్రం. ఇందులో స్థూపం, శాశ్వత జ్యోతి ఉన్నాయి. 2019 నుంచి వెలుగుతున్న ఈ జ్యోతిలోనే అమర్ జవాన్ జ్యోతిని కలిపేశారు. జ్యోతి అనేది వీరమరణం పొందిన సైనికుల అమరత్వ స్ఫూర్తికి చిహ్నం మాత్రమే కాదు వారి త్యాగాన్ని దేశం ఎప్పుడూ మరిచిపోదని చెప్పేందుకు గుర్తు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defence Ministry, India, Indira Gandhi, Narendra modi