Air India - Tata Deal : ఎయిర్ ఇండియా- టాటా మధ్య ఉన్న సంబంధం ఏంటి? సంస్థను ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది?

ప్రతీకాత్మక చిత్రం

Air India-TATA Sons: ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకుంటే.. డొమెస్టిక్ విమానాశ్రయాలలో 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు.. విదేశాల్లో 900 స్లాట్‌లపై హక్కులు కొత్త సంస్థ చేతుల్లోకి వెళ్తాయి. ఇవన్నీ మిలియన్ డాలర్ల విలువైనవి కావడం గమనార్హం.

  • Share this:
సుదీర్ఘ ప్రక్రియ తరువాత ఎయిర్ ఇండియా (Air India) ప్రైవేటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ సంస్థను టాటా గ్రూప్ (TATA Group) కొనుగోలు చేసింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. టాటా సన్స్ (TATA sons) యాజమాన్యంలోకి వెళ్లిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాలో 100 శాతం ప్రభుత్వ వాటాను టాటా సన్స్ రూ.18 వేల కోట్లకు (2.40 బిలియన్ డాలర్లు) దక్కించుకున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు. దీంతో గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి.

* ఎయిర్ ఇండియాను ప్రభుత్వం ఎందుకు అమ్మాలనుకుంది?
ఎయిర్ ఇండియాను విక్రయించడానికి చేసిన మూడో ప్రయత్నంలో కేంద్రం విజయం సాధించింది. ఈసారి కేంద్రం మొత్తం వాటాను ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని నిర్ణయించింది. "ఎయిర్ ఇండియాలో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని (డిస్‌ఇన్వెస్ట్‌మెంట్) నిర్ణయించాం. డిస్‌ఇన్వెస్ట్‌మెంట్, నాన్-డిస్‌ఇన్వెస్ట్‌మెంట్లలో ఏది ఎంచుకోవాలనే ఆప్షన్‌ ఇప్పుడు లేదు. ఇది పూర్తి స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ లేదా మూసివేతకు సంబంధించిన విషయం. మేం మొదటిదాన్ని ఎంచుకుంటున్నాం. ప్రస్తుతం ఎయిర్ ఇండియా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ.. ప్రతిరోజూ రూ .20 కోట్లు నష్టపోతున్నాం. నిర్వహణ లోపం వల్ల రూ.60,000 కోట్ల అప్పులు మిగిలాయి" అని ఈ ఏడాది మార్చిలో చెప్పారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఫస్ట్‌ రేట్ అసెట్‌గా మిగిలిపోయిన ఈ సంస్థ రూ.60,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోతోందని కేంద్రమంత్రి అప్పట్లో వివరించారు.

Air India-Tata Group: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ లాభాల్లోకి  తీసుకొస్తుందా?


ఎయిర్ ఇండియా అమ్మకానికి 2000లోనే మొదటిసారి ప్రయత్నాలు జరిగాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం.. 2001లో ఎయిర్‌లైన్స్‌లో 40 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. దీనిపై కొన్ని ప్రధాన సంస్థలు ఆసక్తి కనబరిచినప్పటికీ, వాటా విక్రయం కార్యరూపం దాల్చలేదు. 2017లో కూడా ఈ సంస్థను విక్రయించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వం 24 శాతం వాటాను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించింది. దీంతో కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాలేదు.

పన్ను చెల్లిస్తున్నారా? అయితే సకాలంలో పన్ను చెల్లిస్తే కలిగే టాప్ 5 బెనిఫిట్స్


ప్రస్తుత ఒప్పందంలో కీలక అంశాలు ఏవి?
తాజా ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో 100 శాతం వాటాతో పాటు.. గ్రౌండ్-హ్యాండ్లింగ్ కంపెనీ AISATSలో ఉన్న 50 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించింది. కంపెనీ ఎంటర్‌ప్రైజ్ విలువ ఆధారంగా బిడ్‌లను ఆహ్వానించారు. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లోని నగదును కూడా కలిపి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా రూ.23,000 కోట్ల అప్పులతో కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్తుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. సంస్థ మిగిలిన రుణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AIAHL) భరిస్తుంది. ఇది ముంబైలోని ఎయిర్ ఇండియా బిల్డింగ్, ఢిల్లీలోని ఎయిర్‌లైన్స్ హౌస్ వంటి క్యారియర్ ఆస్తులను కలిగి ఉండే కొత్త సంస్థ.

Air India-Tata: ఎయిర్ ఇండియా సొంతం చేసుకున్న టాటా సన్స్‌కు ఎదురయ్యే తొలి సవాల్ ఇదే


అయితే సంస్థను కేవలం నష్టాల నుంచి లెక్కించడం కోసం ఈ ఒప్పందం జరగలేదు. కొత్త యాజమాన్యం.. ఒకేసారి ఎయిర్ ఇండియా యాజమాన్యంలోని అపారమైన మౌలిక సదుపాయాలను సొంతం చేసుకుంటుంది. భారతదేశంలో అత్యుత్తమ అంతర్జాతీయ క్యారియర్‌గా ఎయిర్ ఇండియా ఉన్నందువల్ల.. ఈ ఒప్పందంతో కొత్త యజమాన్యం విమానయాన రంగంలో మేటిగా నిలవచ్చు. ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకుంటే.. డొమెస్టిక్ విమానాశ్రయాలలో 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు.. విదేశాల్లో 900 స్లాట్‌లపై హక్కులు కొత్త సంస్థ చేతుల్లోకి వెళ్తాయి. ఇవన్నీ మిలియన్ డాలర్ల విలువైనవి కావడం గమనార్హం. 2020 మార్చి నాటికి ఎయిర్ ఇండియా స్థిరాస్తుల (fixed assets) మొత్తం విలువ రూ.45,000 కోట్లకు పైగా ఉందని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.

చరిత్రలో స్థానం
ఎయిర్ ఇండియా చరిత్ర స్వతంత్య్రానికి ముందు నుంచే ఉంది. 1932లో పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు JRD టాటా.. కరాచీ- బొంబాయి మధ్య ఎయిర్‌మెయిల్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తరువాత సేవలను విస్తరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, 1948లో ప్రయాణికులకు సేవలందించడం ప్రారంభించారు. 1953లో భారత ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌ను జాతీయం చేయాలని నిర్ణయించిన తర్వాత కూడా, JRD టాటా తన సంస్థపై అధికారాలను పూర్తిగా వదులుకోలేదు. అయితే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వంతో విభేదాల కారణంగా.. 1978లో టాటాను ఈ సంస్థ నుంచి బయటకు పంపించారు. అనంతరం ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆయన్ను తిరిగి సంస్థలోకి తీసుకువచ్చి, ఎయిర్ ఇండియా బోర్డులో చేర్చింది.

Air India-Tata: టాటా సన్స్​ చేతికి ఎయిరిండియా... భారత ఎయిర్​లైన్​ విభాగంలో ఈ సంస్థల మధ్యే పోటీ


నష్టాలకు కారణం?
ప్రస్తుత సమస్యలకు బీజం 2007లోనే పడిందని నిపుణులు చెబుతున్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం.. ఎయిర్ ఇండియా- ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలను విలీనం చేసింది. అనంతరం విమానాల కోసం భారీగా ఆర్డర్లు చేసింది. ఫలితంగా సంస్థ అప్పులు రూ.పదివేల కోట్లకు పెరిగాయి. అప్పటికే దేశీయ విమానయాన రంగం కొత్త మార్పులకు గురైంది. కానీ ఎయిర్ ఇండియా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఇదే సమయంలో జెట్, ఇండిగో, ఇతర కొత్త సంస్థల ప్రవేశంతో ఎయిర్ ఇండియా ప్రభ కోల్పోయింది.

ఎన్నో ప్రత్యేకతలు
కనెక్టివిటీ చాలా తక్కువగా ఉన్న సమయంలోనే ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసులు నడిపింది. భారతదేశం కీర్తిని పెంచడంతో పాటు దేశ సంస్కృతికి ఐకానిక్ అంబాసిడర్‌గా పేరొందింది. అన్ని ప్రధాన ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి ఒక స్పెషల్ బ్రాండ్‌ను నిర్మించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు సాధించింది. 1990లో ఇరాక్ యుద్ధ సమయంలో కువైట్ నుంచి ఒక లక్ష మంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానాల్లో తరలించారు. ఈ క్రమంలో 59 రోజుల్లో 450కి పైగా విమానాలను నడిపి చరిత్ర సృష్టించింది. ఒక పౌర విమానయాన సంస్థ నిర్వహించిన అతిపెద్ద తరలింపు ప్రక్రియగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకుంది. 2017లో మొత్తం మహిళా సిబ్బందితో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించిన మొదటి విమానయాన సంస్థగా అవతరించింది.

కొత్త ప్రయోగానికి సిద్ధమైన నాసా.. సౌర వ్యవస్థ పరిణామం గురించి బృహస్పతి ట్రోజన్‌ గ్రహశకలాలపై ప్రయోగాలు



ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఇలాంటి తరలింపులను ప్రభుత్వాలు ఎలా చేపడతాయనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వినియోగించే విమానాలు సైతం ఎయిర్ ఇండియాకు చెందినవే. ఈ సంస్థ కొత్త యాజమాన్యంలోకి మారిన తరువాత వీరి ప్రయాణాలు, విమానయాన బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published: