రాష్ట్రపతి(President) ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం ప్రకటించింది. జూలై 21న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం(Election Commission) తెలిపింది. ఈ ఎన్నికల ద్వారా భారత 16వ రాష్ట్రపతిని(16th president) ఎన్నుకోనున్నారు. ఇంతవరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే ముందు 60వ రోజు గానీ, ఆ తర్వాత గానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చు. ప్రస్తుత రాష్ట్రపతి(president) రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovind) పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.
నామినేషన్ విధానం..
నామినేషన్ పత్రాలు ఢిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్‌ను తప్పనిసరిగా ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది ప్రపోజ్ చేయాలి. మరో 50 మంది సపోర్ట్ చేయాలి. నామినేషన్‌ను ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో దాఖలు చేయవచ్చు. రూ.15,000 డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు?
రాష్ట్రపతి దేశాధినేత, సాయుధ దళాల సుప్రీం కమాండర్. ప్రధానిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడంలా కాకుండా రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండి, 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అతను లేదా ఆమెకు తప్పనిసరిగా లోక్‌సభ సభ్యునిగా అర్హత ఉండాలి. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 4,809 మంది ఉన్నారు. వారి ఓటు విలువ 10,86,431. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్ మార్క్ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.
ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు వారి శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మరెక్కడైనా ఓటు వేయాల్సి వస్తే కనీసం పది రోజులు ముందుగా కమిషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్ పాటించాలి. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్ అనంతరం వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓట్లు లెక్కిస్తారు.
ఓటు విలువ లెక్కింపు ఇలా..
ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యనే డివైడ్ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు. ఎంపీలకు సంబంధించి దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ(5,43,321)ను మొత్తం ఎంపీల సంఖ్య(776)తో డివైడ్ చేస్తారు. ఈ మేరకు ఈ సారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.
అభ్యర్థి ఎలా గెలుస్తారు?
పోల్ అయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం +1(కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.
పూర్తిగా సన్నద్ధం
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తిగా సిద్ధమైంది. ప్రివెంటేటివ్ డిటెన్షన్‌లో ఉన్నవారు ఓటు వేయవచ్చు. జైలులో ఉన్న వారికి పెరోల్ మంజూరు చేస్తే ఓటు హక్కు వినియోగించుకొనే సదుపాయం ఉంది. అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్, కౌంటింగ్ సమయంలో అన్ని కోవిడ్-సంబంధిత ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జూన్ 15న ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. దాఖలు చేసిన నామినేషన్లను జూన్ 30న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 2 గడువుగా నిర్ణయించాం. నామినేషన్ పత్రాలను ఢిల్లీలో అందజేయాలి.’ అని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.