Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠంలో అసలు వివాదమేంటి? చివరకు ఎలా సద్దుమణిగింది?

బ్రహ్మంగారి మఠం

Brahmamgari Matam: వెంకటేశ్వర స్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామియే బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఉత్తరాధికారిగా ఆయన సోదరుడు వీరభద్రస్వామి వ్యవహరిస్తారు. వెంకటాద్రి స్వామి అనంతరం మఠాధిపతిగా మహలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇస్తారు.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  ప్రపంచానికే జ్ఞానబోధ చేసారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 16వ శతాబ్దంలోనే భవిష్యత్ గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఒక్కో మాటా... జరుగుతూ వస్తోందని చాలా మంది విశ్వసిస్తారు. కొందరు స్వయంగా చూసిన వారూ ఉన్నారు. ఎంతో గొప్ప కాలజ్ఞాన తత్వవేత్తగా పేరుగాంచిన వీరబ్రహ్మంగారి కుటుంబం ఒక పీఠం కారణంగా తమ పరువును రోడ్డుపైకి లాగినట్లు అయిందంటున్నారు విశ్లేషకులు. వీర బ్రహ్మంగారు జీవ సమాధి అయిన ప్రాంతాన్ని... పెద్ద దేవాలయంగా తీర్చి దిద్ది, దానికి ఓ మఠాన్ని ఏర్పాటు చేసారు. కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె గ్రామంలో ఉన్న ఈ మఠానికి ఆది నుంచి ఇప్పటి వరకు వీరబ్రహ్మం వంశీకులే పీఠాధిపతులుగా వ్యవరిస్తూ వస్తున్నారు. పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి అయన దేహాన్ని వదలి పరమపదించారు. ఆ తర్వాత కుటుంబీకుల్లో కుమ్ములాట అనివార్యంగా మారింది. ఆధిపత్య పోరుకు కారణాలెన్నో.... నెల రోజుల ఉత్కంఠకు ప్రభుత్వ చర్చలతో వివాదం కొలిక్కి వచ్చింది. అసలు ఇంత రగడకు కారణాలేంటి? పరమపదించిన వెంకటేశ్వర స్వామి వీలునామా ఏం చెబుతోంది?

  వీరబ్రహ్మం వంశీకులు ఏడు తరాలుగా పీఠాన్ని అధిరోహించి కార్యకలాపాలు చూసుకుంటూ వస్తున్నారు. ఈ తరాల్లో ఎన్నడూ ఎలాంటి వివాదం తలెత్తలేదు. కానీ ఆ కుటుంబంలో తరతరాల సంప్రదాయాలు పక్కనబెట్టి పీఠం కోసం నువ్వా నేనా అనే సైయ్యట ప్రారంభం కావడంతో వివాదం చెలరేగింది. ఇటీవల శివక్యం పొందిన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతికి ఎనిమిదిమంది సంతానం. ఇందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. మొదటి భార్య అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో రెండవ వివాహం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి. రెండవ భార్య మారుతీ మహాలక్షమ్మమకు ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో తదుపరి పీఠాధిపతి స్థానం ఎవరికీ ఇవ్వాలనే అంశంపై ఆయన రాసిన వీలునామా పెద్ద రచ్చకు దారి తీసింది. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి లిఖిత పూర్వకంగా రాసిన వీలునామా పరిశీలించి, పీఠాధిపతి ఎంపికపై నివేదిక సమర్పించడానికి మూడు వరాల క్రితం దేవదాయధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ బ్రహ్మం గారి మఠానికి వెళ్లారు. పీఠాధిపతి అంశం చర్చకు రాగానే వెంకటేశ్వర స్వామి కుమారులు న్యాయబద్దంగా నాకంటే నాకు ఇవ్వాలని రాణాప్రతాప్ ముందు గొడవపడేంత పని చేసారు. దీంతో ఆఅయన మధ్యలోనే ఆ పనిని వాయిదా వేసి వెనుతిరిగారు. మొదటి భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామికే పీఠాధిపతి పట్టం కట్టాలని చుట్టూ ప్రక్కల గ్రామస్థుల నుంచి డిమాండ్ బలంగా వినిపించింది. ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో ఈ వాదనకు బలంగా వినపడటంతో దేవాదాయశాఖ వెంకటాద్రి స్వామికే పట్టంకట్టాలని నిర్ధారణకు వచ్చారు.

  అయితే వీలునామాతో పీఠాధిపతి నియామకం పెద్ద తలనొప్పిని మారింది. వెంకటేశ్వర స్వామి రాసిన వీలునామా ప్రకారం మొదటి భార్య రెండవ కుమారుడు పేరు ఉండటంతో కుటుంబంలో ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రభుత్వం పావులు కదిపింది. వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతికి ఆరోగ్యం క్షిణించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. వైద్యుల పరీక్షల్లో కిడ్నీలు పూర్తిగా పాడైపోయినట్లు వైధ్యులు నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో ఆమె ప్రాణం దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో బకిడ్నీలు దానం చేసిన వారికే పీఠాధి పతి హోదా వస్తుందని వెంకటేశ్వర స్వామి మాటిచ్చాడు. అప్పట్లో రెండవ కుమారుడు ముందుకు వచ్చి....కిడ్నీలను దానం చేసాడు. మాట ఇచ్చినట్లుగానే మొదటి భార్య రెండవ కొడుకు పేరును వీలునామాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరి కొందరు మద్దతు పలుకుతున్నారు. ఇక రెండవ భార్య మారుతీ మహాలక్షమ్మ తానే పీఠాధిపతిగా ఉంటానని బిష్మీంచుకు కూర్చుకున్నారు. తన కుమారుడికి కూడా పీఠాధిపతి ఇవ్వాలనే ప్రతిపాదన వీలునామాలో ఉందని....తన కుమారుడికి చిన్న వయస్సు ఉండటంతో.... ఆ పీఠాన్ని తానే అధిరోహిస్తాని చెప్పారు. అందరి వాదోపవాదాలు విన్న దేవాదాయ శాఖా డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ ఇప్పట్లో తేలే అంశం కాదని నిర్ధారణకు వచ్చి.... ప్రాధమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు.

  కాలజ్ఞాన బోధకులు....శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు మఠాధిపతి కావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మఠాధిపతి కావాలంటే తాను కచ్చితంగా హిందూమతం, వేదాంత శాస్త్రాల్లో పట్టు ఉండాలి. అవన్నీ అలవోకగా బోధించే విధంగా ఉండాలి. ధార్మిక గ్రంధాల్లో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానం మెండుగా ఉండాలి. మఠంలో శిస్యులుగా ఉన్నవారికి జ్ఞానబోధ, హిందూ సంప్రదాయాలను నేర్పించే సామర్ధ్యం సమర్ధత ఉండాలి. నమ్మకంతో మత ప్రవృత్తి కలిగి ఉండాలి. అయితే శివస్వామి నేతృత్వంలోని శైవ పీఠాధిపతులు పలు పర్యాయాలు వెంకటేశ్వర స్వామి కుటుంబీకులతో చర్చలు జరిపారు. సంప్రదాయం ప్రకారం పీఠాధిపతిని ఎన్నుకోవాలని బ్రహ్మంగారి వంశానికి తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి... వెంకటాద్రి స్వామీ పీఠాధిపతి అంటూ నిర్ధారణకు వచ్చారు. అదే విషయాన్నీ మీడియాకు వెల్లడించారు. మఠం నియమనిబంధనల ప్రకారం వెంకటాద్రి స్వామికే పీఠాధిపతి పట్టంకట్టాలని శివస్వామి బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆయనకే పీఠం ఖాయమని అనుకునే సందర్భంలో సమస్యకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. మొదటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్య స్వామి, రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి వెంకటాద్రి స్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పిర్యాదు చేసారు. ఈ వ్యవహారం జటిలం కావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మూడు కుటుంబాలతో చర్చలు జరిపారు. ఎంతో ప్రతిష్ట కలిగిన పీఠం పరువు తీయ్యరాదని, అందరూ కలసికట్టుగా మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చి...ఒక పేరు చెప్పాలని సూచనలు జారీ చేసారు. ఏకాభిప్రాయంతో ఇచ్చిన పేరుని పీఠాధిపతిగా ప్రకటిస్తామని చెప్పారు. అయినా కొలిక్కి రాకపోవడంతో కర్ణాటకకు చెందిన గాలి కుటుంబం సయోధ్యకు రంగం సిద్ధం చేసింది. గాలి కరుణాకర్ రెడ్డి వీరబ్రహ్మం కుటుంబీకులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఓ దూతను పంపి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసారు. కానీ మాకు వీలునామా ఉందని మూడు కుటుంబాలు పోటీ పడటంతో మరోమారు వివాదం రాజుకుంది. చివరికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, కందిమల్లయ్య పల్లి సంస్థానం ప్రజల ప్రయత్నాలతో ఈ వ్యవహారం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ముగిసింది. దీంతో పూర్వపు పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామియే బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా నియమితులయ్యారు. 12వ మఠాధిపతిగా వెంకట్రాదిస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తరాధికారిగా ఆయన సోదరుడు వీరభద్రస్వామి వ్యవహరిస్తారు. వెంకటాద్రి స్వామి అనంతరం మఠాధిపతిగా మహలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇస్తారు. దీనిపై అధికారికంగా అంగీకార పత్రం విడుదల చేశారు బ్రహ్మంగారి వారసులు. ఇంతటితో బ్రహ్మం గారి మఠంలో వారసుల వివాదం సద్దుమణిగింది.
  Published by:Shiva Kumar Addula
  First published: