Explained: చైనా, రష్యాను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోన్న అమెరికా.. ఆ ఐదు కొత్త టెక్నాలజీలపై దృష్టి..

ప్రతీకాత్మక చిత్రం

Explained: ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రపంచస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించే పోటీలో ప్రథమ స్థానంలోనే కొనసాగేందుకు అమెరికా నడుం బిగించింది. యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) ఇటీవలి నివేదికలో అమెరికా తన సూపర్ పవర్ హోదాని చేజార్చుకునేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని స్పష్టం చేసింది.

  • Share this:
అమెరికా (America) అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది తన అగ్రగామి హోదాను చేజార్చుకునే రోజులు దగ్గరపడ్డాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాకి పోటీగా ఎదుగుతున్న చైనా (China) ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించినందుకు చైనా కంపెనీలను అమెరికా నిందించింది. సోషల్ మీడియా అవకతవకల ద్వారా రష్యా యాక్టర్స్ తమ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపించింది. అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రపంచస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించే పోటీలో ప్రథమ స్థానంలోనే కొనసాగేందుకు అమెరికా నడుం బిగించింది. యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) ఇటీవలి నివేదికలో అమెరికా తన సూపర్ పవర్ హోదాని చేజార్చుకునేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని స్పష్టం చేసింది.

అలాగే యూఎస్ సంస్థలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చైనీస్, రష్యా మద్దతుతో చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేసింది. క్రిటికల్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో యూఎస్ మేధో సంపత్తిని దొంగలించే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించింది. అగ్రగామి పోటీల్లో చైనా, రష్యా నుంచి 5 కీలకమైన టెక్నాలజీల సంరక్షణకు అమెరికా ప్రాధాన్యమిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎన్‌సీఎస్‌సీ(NCSC) నివేదిక ఏం చెబుతోంది?

విదేశీ ముప్పు నుంచి కీలకమైన, వర్ధమాన యూఎస్ టెక్నాలజీలను రక్షించడమే అమెరికా లక్ష్యమని నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో యూఎస్ ఆధిపత్యం వ్యూహాత్మక పోటీదారుల నుంచి సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ రంగాలలో నాయకత్వాన్ని సాధించడానికి పోటీదారులు సమగ్ర జాతీయ వ్యూహాలనుఅమలు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

యూఎస్ టెక్ ఆధిపత్యానికి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు కీలకమైన కొన్ని యూఎస్ సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యతనిస్తోందని ఎన్‌సీఎస్‌సీ నివేదించింది. అమెరికా ప్రపంచంలోని అగ్రగామిగా మిగిలిపోతుందా లేదా రాబోయే కొన్నేళ్లలో మరుగున పడుతుందా అనేది కీలక టెక్నాలజీ రంగాల పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.

చైనా, రష్యాల గురించి ఏం చెబుతోంది?

చైనా యూఎస్‌కి ప్రాథమిక వ్యూహాత్మక పోటీదారుగా ఉందని నివేదిక అంచనా వేసింది. అమెరికా, ఇతర దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడానికి, తెలుసుకోవడానికి చైనా అనేక రకాల చట్టపరమైన, పాక్షిక-చట్టపరమైన, చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగిస్తుందని పేర్కొంది. యూఎస్ తమ దేశ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లను రక్షించే లక్ష్యంతో 2019 చట్టాన్ని పట్టాలెక్కించింది. అప్పట్లో హువావే, జెడ్‌టీఈతో సహా ఐదు చైనా కంపెనీలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నట్లు యూఎస్ అధికారులు గుర్తించారు.

దాంతో యూఎస్ ఫెడరల్ ఏజెన్సీలు ఐదు కంపెనీల్లో దేని నుంచి వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయకుండా ఆగస్ట్ 2020న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీఎస్‌సీ నివేదిక ప్రకారం, చైనా అన్ని చైనీస్ సంస్థల నుంచి సాంకేతికత, సమాచారాన్ని దేశ అధికార ప్రభుత్వంతో పంచుకోవడాన్ని తప్పనిసరి చేసే జాతీయ నిఘా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక రష్యా తన మిలిటరీ, ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లతో సహా జాతీయ స్థాయి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి వివిధ రకాల చట్టపరమైన, అక్రమ సాంకేతిక బదిలీ యంత్రాంగాలు ప్రయోగిస్తుంది. యూఎస్ పురోగతిని సాధించడమే లక్ష్యంగా చేసుకుంటోంది.

కాగా, యూఎస్ టెక్నాలజీలను అపహరించేందుకు ఈ దేశాలు ఉపయోగించే సాధనాలు, వ్యూహాలలో ఇంటెలిజెన్స్ సేవలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుబడులు, విద్యా సహకారం, జాయింట్ వెంచర్లు విలీనాలు, అక్రమ అంతర్గత వ్యక్తుల బృందం ఉన్నాయని ఎన్‌సీఎస్‌సీ తెలిపింది. దీనికి తోడు ఈ దేశాలు తమ లక్ష్యాలను సాధించడానికి టాలెంట్ రిక్రూట్‌మెంట్, రీసెర్చ్ పార్టనర్‌షిప్‌లు, ఫ్రంట్ కంపెనీలను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది.

ఏ టెక్నాలజీలు ముప్పులో ఉన్నాయి?

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బయో ఎకానమీ, సెమీకండక్టర్స్, అటానమస్ సిస్టమ్స్ అనే ఐదు టెక్నాలజీలు ముప్పులో ఉన్నట్లు ఎన్‌సీఎస్‌సీ నివేదించింది. పౌర, సైనిక రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కృత్రిమ మేధ పలు వినియోగాలకు ఉపయోగపడే సాంకేతికత అని ఎన్‌సీఎస్‌సీ వివరించింది. చైనా ప్రస్తుత పోకడలను బట్టి వచ్చే దశాబ్దంలో ఏఐలో ప్రపంచ అగ్రగామిగా యూఎస్ ను అధిగమించగల శక్తి, ప్రతిభ, ఆశయాన్ని కలిగి ఉందని ఎన్‌సీఎస్‌సీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

యూఎస్ డేటాను దొంగిలించడానికి, ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడానికి రష్యా, చైనా దేశాలు చేసే సైబర్‌టాక్‌లు, తప్పుడు సమాచార ప్రచారాలను కూడా ఏఐ మరింత పెంచడంలో సహాయపడుతుందని పేర్కొంది. క్వాంటం కంప్యూటింగ్ కోడ్ తెలుసుకోగల సాంకేతికతను అభివృద్ధి చేసిన దేశాలు అమెరికా సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాల గూఢభావమును అర్థం చేసుకోగలదు. క్వాంటం కంప్యూటింగ్ ఆధిపత్యం రేసులో ఎవరు గెలిచినా వారు ఇతరుల కమ్యూనికేషన్లను ఇట్టే పసిగట్టగలరని నివేదిక వివరించింది.

బయోఎకానమీ అమెరికన్ల ఆహారం నుంచి వారు వినియోగించే ఇంధనాలు, పదార్థాలు, ఉత్పత్తుల వరకు ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకొచ్చారు. కానీ ఇదే టెక్నాలజీని జాతీయ భద్రత, ఆర్థిక సంక్షోభానికి కూడా దారి తీయవచ్చు. బయోటెక్నాలజీని దుర్వినియోగం చేసుకుని యూఎస్ ఆహార సరఫరా లేదా మానవ జనాభాను లక్ష్యంగా చేసుకోగల హానికరమైన వ్యాధికారకాలను సృష్టించే ప్రమాదం ఉందని ఎన్‌సీఎస్‌సీ తెలిపింది.

ఇది కూడా చదవండి : యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఎలా వస్తాయి.. దాని కోసం ఏం చేయాలి.. పూర్తి వివరాలివే..

మరోవైపు, సెమీకండక్టర్-ఆధారిత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది టెక్నాలజీలో డీఎన్ఏ లాంటిదని నివేదిక పేర్కొంది. విదేశీ శత్రువులు విశ్వసనీయ సెమీకండక్టర్లకు యూఎస్ యాక్సెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే ప్రమాదముందని ఎన్‌సీఎస్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ సమాచారం కలిగి ఉండే అటానమస్ సిస్టమ్స్ విదేశీ ఇంటెలిజెన్స్ సేకరణకు సంపూర్ణ లక్ష్యాలు కావచ్చని ఎన్‌సీఎస్‌సీ వ్యాఖ్యానించింది.
Published by:Sridhar Reddy
First published: