హోమ్ /వార్తలు /Explained /

Evergrande: ఎవర్‌గ్రాండే సంక్షోభం అంటే ఏంటి? చైనా చేతిలో ప్రపంచం మరోసారి బలికానుందా...

Evergrande: ఎవర్‌గ్రాండే సంక్షోభం అంటే ఏంటి? చైనా చేతిలో ప్రపంచం మరోసారి బలికానుందా...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

చైనా కారణంగా మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ షేక్ అవుతాయనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చైనాలో రెండవ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్‌గ్రాండే నెలరోజులుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. 300 బిలియన్ డాలర్లకు పైగా తీసుకున్న రుణాలను మళ్లీ చెల్లించడానికి తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేదని.. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు ఇప్పటికే సదరు సంస్థ ప్రకటించింది.

ఇంకా చదవండి ...

చైనాలో పుట్టిన కరోనా వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ ఒక్క వైరస్‌తో ప్రపంచ దేశాల్లోని అన్ని ఆర్థిక మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ మార్కెట్లు ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనా కారణంగా మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ షేక్ అవుతాయనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీనికి కారణం చైనాలో రెండో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థగా పేరు తెచ్చుకున్న ఎవర్‌గ్రాండే (Evergrande) పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సంస్థ 300 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పులను తీర్చాల్సి ఉంది. కానీ ఇది అప్పులు తీర్చే పరిస్థితులలో లేదు. దీంతో ఇప్పటికే చైనీస్, హాంకాంగ్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఈ ఆర్థిక సంక్షోభం మన భారతీయ స్టాక్‌ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతోంది. దివాలా తీసే అంచున కొట్టుమిట్టాడుతున్న ఈ కంపెనీ మరో యూఎస్ లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంకు కాబోతోందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో ప్రపంచ మార్కెట్లపై ఇది ఎంత ప్రతికూల ప్రభావం చూపుతుందోననే భయం సర్వత్రా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎవర్‌గ్రాండే ఆర్థిక సంక్షోభం గురించి.. దాని వల్ల గ్లోబల్ మార్కెట్లపై పడే ప్రభావం గురించి తెలుసుకుందాం.

ఎవర్‌గ్రాండేకి ఏమైంది ?

చైనాలో రెండవ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్‌గ్రాండే నెలరోజులుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. 300 బిలియన్ డాలర్లకు పైగా తీసుకున్న రుణాలను మళ్లీ చెల్లించడానికి తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేదని.. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు ఇప్పటికే సదరు సంస్థ ప్రకటించింది. అప్పుల్లో కూరుకుపోయిన ఈ భారీ కంపెనీకి ఇప్పటికే రేటింగ్ ఏజెన్సీల నుంచి ఎంతో నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో దీని షేర్ ప్రైస్ దాదాపు 80 శాతం పడిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న చైనా అధికారులు.. సదరు సంస్థ వడ్డీ బకాయిలు చెల్లిస్తుందనే ఆశలు వదులుకోవాల్సిందేనని బ్యాంకులకు తేల్చేశారు. చైనా జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం 30% వాటా కలిగి ఉంటుంది. కేవలం ఎవర్‌గ్రాండే ఆస్తులే చైనా జీడీపీలో దాదాపు 2 శాతానికి సమానం కాగా చైనాలో మొత్తం ఆస్తి విక్రయాలలో ఎవర్‌గ్రాండే సుమారు 4 శాతం వాటాను కలిగి ఉంది. అయితే ప్రస్తుత సమయంలో ఆస్తి విక్రయాల బాగా తగ్గిపోయాయి.

ఎవరు స్థాపించారు?

జు జియాన్ అనే వ్యక్తి ఈ సంస్థను 1996లో దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్‌జౌలో స్థాపించాడు. ఇది నివాస గృహాలను నిర్మించడంపై దృష్టి సారించి చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటిగా ఎదిగింది. ఇటీవల కాలంలో ఎవర్‌గ్రాండే చైనాలోని 280 నగరాల్లోని 1,300 ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 1.2 లక్షలకు పైగా ఉద్యోగులు, 38 లక్షల మంది కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 గ్రూప్ ఎంటర్‌ప్రైజ్ జాబితాలో కూడా చేరింది. హాంకాంగ్‌లో ఐపీఓగా లిస్ట్ అయిన ఇది గతేడాది 110 బిలియన్ డాలర్ల విక్రయాలు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సాకర్ స్కూల్ $185 మిలియన్ ఖర్చుతో నిర్మించింది. ఎవర్‌గ్రాండే $1.7 బిలియన్‌ల వ్యయంతో మరో సాకర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తోంది.

ఎవర్‌గ్రాండే దివాలా తీసే పరిస్థితికి ఎందుకు వచ్చింది?

సంస్థను మరింత విస్తరించేందుకు చేపట్టిన చర్యలే దాని పతనానికి కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవర్‌గ్రాండే ఎలక్ట్రిక్ వాహనాలు, క్రీడలు, థీమ్ పార్కులు, ఫుడ్, బేవరేజెస్‌, బాటిల్ వాటర్, కిరాణా వంటి వర్గాలలో వ్యాపారాలు చేస్తోంది. అయితే ఇది తమ ఇతర ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి చాలా తక్కువ ధరలకే అపార్ట్‌మెంట్లను విక్రయించింది. అలాగే భారీగా అప్పులు తీసుకుంది. ఆ విధంగా కంపెనీ చాలావరకు నష్టపోయింది. మరోపక్క చైనా నిబంధనలు సైతం ఈ సంస్థ పై ప్రభావం చూపాయి.

ప్రపంచ మార్కెట్ల పై ఎలాంటి ప్రభావం పడనుంది?

2008లో యూఎస్ బ్యాంకు దివాళా తీసిన సమయంలో మార్కెట్లు కుదేలయ్యాయి కానీ ఎవర్‌గ్రాండే కారణంగా ఎటువంటి సంక్షోభం తలెత్తదని నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తన వంతు కృషి చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని నిర్మాణ సామగ్రి అయిన ఉక్కు, ఇనుముల ధరల పతనం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Published by:Krishna Adithya
First published:

Tags: China

ఉత్తమ కథలు