Explained: కేరళలో సంచలనం సృష్టిస్తున్న చైల్డ్​ మిస్సింగ్ కేసు.. అధికార పార్టీ మెడకు చుట్టుకోనుందా?.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మకచిత్రం

కేరళలో ఒక కిడ్నాప్ కేసు వీడని మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత క్లిష్టతరంగా మారుతోంది. రాజకీయ జోక్యంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే..

  • Share this:
కేరళలో ఒక కిడ్నాప్ కేసు వీడని మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత క్లిష్టతరంగా మారుతోంది. తిరువనంతపురంలోని అనుపమ ఎస్.చంద్రన్(21), ఆమె 35 ఏళ్ల భాగస్వామి అజిత్ ఏప్రిల్ 19, 2021న తమ బిడ్డ కిడ్నాప్ అయినట్టు ఫిర్యాదు చేశారు. అనుపమ తల్లిదండ్రులతో సహా సన్నిహిత కుటుంబ సభ్యులు తమ బిడ్డని కిడ్నాప్ చేశారని ఈ జంట పెరూర్‌కాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల రాజకీయ సంబంధాలు కేరళ ప్రజలనే కాదు భారతదేశ వ్యాప్తంగా అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.

ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు?

అనుపమ, అజిత్ ఫిర్యాదు ప్రకారం.. అక్టోబర్ 19, 2020న వారికి ఓ బిడ్డ జన్మించింది. మూడు రోజుల తర్వాత బిడ్డ జాడ లేకుండా అదృశ్యమైంది. బిడ్డను అనుపమ తండ్రి, ఇతర బంధువులు తీసుకెళ్లారని ఫిర్యాదులో ఈ జంట పేర్కొన్నారు. బిడ్డ పెళ్లి కాకముందే జన్మించినందున.. అనుపమ కుటుంబం దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. అనుపమ అక్క పెళ్లి కాగానే బిడ్డను తీసుకువస్తానని ఆమె బంధువులు ఆమెకు హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పెళ్లయిన తర్వాత కూడా బిడ్డను తీసుకురాలేదు.

ఈ కేసుతో ఉన్న రాజకీయ సంబంధం ఏంటి?

అనుపమ సీపీఐ(ఎం) నాయకుడు, స్థానిక కమిటీ సభ్యుడు పీఎస్ జయచంద్రన్ కుమార్తె. ఆమె తల్లి స్మిత జేమ్స్ సీపీఐ(ఎం) పార్టీ సభ్యురాలు. అనుపమ తండ్రి జయచంద్రన్ సీపీఐ(ఎం) నాయకులు పేరూర్‌కాడ సదాశివన్‌, లలిత సదాశివన్‌ల కుమారుడు. అనుపమ ఎస్ఎఫ్ఐ నాయకురాలు, డీవైఎఫ్ఐ సభ్యురాలుగా కూడా కొంత కాలం పనిచేసింది.సీపీఐ(ఎం) ఫీడర్ సంస్థల్లో కూడా ఆమె క్రియా శీలకంగా ఉండేది. ఆమె ప్రియుడు అజిత్ సీపీఐ(ఎం) స్థానిక నాయకుడు, డీవైఎఫ్ఐ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. ఈ కమిటీలో అనుపమ సభ్యురాలుగా ఉండేది. ప్రముఖ కమ్యూనిస్ట్ కుటుంబ సభ్యురాలు, యువ నాయకురాలిగా కనుక తిరువనంతపురం కార్పొరేషన్ కౌన్సిల్‌లో స్థానిక వార్డు అభ్యర్థిగా ఆమె పేరు పరిశీలనలో ఉంది.

కుటుంబంపై అనుపమ చేస్తున్న ఆరోపణలు ఏంటి?

అజిత్ దళిత క్రిస్టియన్ కావడంతో అతనితో తన సంబంధాన్ని తన కుటుంబం వ్యతిరేకిస్తోందని అనుపమ ఆరోపణలు చేస్తోంది.

అజిత్​కు గతంలోనే పెళ్లయిందా?

2011లో అజిత్ నజియా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఏడాది నుంచి ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో అనుపమ, అజిత్ మధ్య ప్రేమ చిగురించింది. దాంతో అజిత్ తన మొదటి భార్య నజియాకి విడాకులు ఇచ్చేశాడని సమాచారం. ఆ తరువాత అనుపమ ఏప్రిల్‌లో తన ఇంట్లో నుంచి పారిపోయి అజిత్‌తో కలిసి సహజీవనం ప్రారంభించింది.

అనుపమ తండ్రి జయచంద్రన్ వెర్షన్ ఏమిటి?

జయచంద్రన్‌ కథనం ప్రకారం.. అజిత్‌కు అప్పటికే వివాహమైంది. జయచంద్రన్‌ తన పెద్ద కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది. కానీ చిన్న కూతురు ఆల్రెడీ పెళ్లైన అజిత్‌తో కలిసి బిడ్డను కనడంతో తన పెద్ద కూతురికి ఎక్కడ పెళ్లి జరగదోనని భయపడ్డాడు. అందుకే చిన్న కూతురి బిడ్డను థైకాడ్‌లోని ప్రభుత్వ శిశు సంక్షేమ కేంద్రం ముందు ఓ ఎలక్ట్రానిక్ ఊయల ‘అమ్మతొట్టిల్‌’లో ఉంచాలని కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయించాడు. బిడ్డ పుట్టిన సమయానికి అజిత్ విడాకుల ప్రక్రియను ప్రారంభించలేదు. ఆ సమయంలో బిడ్డను చూసుకునే శక్తి అనుపమకు లేకపోవడంతో ఆమె అంగీకారంతోనే బిడ్డను సీడబ్ల్యూసీకి అప్పగించినట్లు జయచంద్రన్ తెలిపారు. బిడ్డను తీసుకెళ్లే ముందు అనుపమ నుంచి నోటరీ ద్వారా ధృవీకరించిన సమ్మతి లేఖను పొందినట్లు జయచంద్రన్‌ తెలిపారు. విడాకుల పత్రాలతో అజిత్ వచ్చినప్పుడు బిడ్డను తిరిగి ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా అనుపమ ఒక నిబంధన పెట్టినట్లు తండ్రి చెప్పాడు. కానీ అజిత్ ఇంకా విడాకులు తీసుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో కిడ్నాపింగ్ కేసు పెట్టినట్లు తండ్రి వెల్లడించాడు. అజిత్ తన స్నేహితుల్లో ఒకరి భార్య అయిన నజియాను ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నాడని జయచంద్రన్ చెబుతున్నాడు.నజియాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే అజిత్ అనుపమకు కడుపు చేశాడని జయచంద్రన్ మీడియాకు తెలిపారు. కులం గురించి తాము ఎన్నడూ ప్రస్తావించలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఒకవేళ అనుపమకు తన బిడ్డ కావాలనుకుంటే చట్టపరంగా ముందుకు సాగుచ్చని ఆయన అన్నారు.

నజియా పెట్టిన కేసు ఏంటి?

అజిత్ మొదటి భార్య నజియా ప్రకారం, అనుపమ తన వివాహ బంధంలోకి ప్రవేశించిన తర్వాత ఆమెను అజిత్ దూరం పెట్టాడు. ఒకసారి పబ్లిక్ లో అనుపమతో సంబంధం ఏంటని అజిత్‌ని నజియా ప్రశ్నించింది. తనకు, అనుపమకి అన్నాచెల్లెళ్ల సంబంధం ఉందని అప్పట్లో అజిత్‌ నజియాకి నచ్చజెప్పాడు.

పోలీసులు కేసు ఎప్పుడు నమోదు చేశారు?

తన బిడ్డను కుటుంబ సభ్యులు ఎత్తుకెళ్లారని అనుపమ సీఎం పినరయి విజయన్‌తో పాటు సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. అప్పట్లో కుటుంబ సభ్యులు లేఖను సాక్ష్యంగా చూపించడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. టీవీ ఛానల్లో అనుపమ బిడ్డ గురించి ప్రసారం చేయడంతో వివాదాలు తలెత్తాయి. దాంతో ఫిర్యాదు దాఖలైన ఆరు నెలల తర్వాత అక్టోబర్ 18, 2021న పోలీసులు కేసు నమోదు చేయవలసి వచ్చింది. అనుపమ తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 461 కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం బిడ్డ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అనుపమ కుటుంబ సభ్యులు ఏం చేశారు ?

బిడ్డను కిడ్నాప్ చేసి దత్తత ఇచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుపమ తల్లిదండ్రులు.. మరో నలుగురు ముందస్తు బెయిల్ కోసం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అనుపమ తండ్రి జయచంద్రన్‌, తల్లి స్మిత, సోదరి అంజు, బావ అరుణ్‌, జయచంద్రన్‌తో అనుబంధం ఉన్న ఇద్దరు సిపిఐ(ఎం) కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 28, 2021 గురువారం నాడు కోర్టు ఈ కేసును విచారించనుంది.
Published by:Krishna Adithya
First published: