రుతుపవనాల కాలం ముగిసినా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు (Rains) మాత్రం తగ్గడం లేదు. కేరళ (Kerala Rain Updates), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఈ అక్టోబరు(October) మాసంలో ఢిల్లీ (Delhi) లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. రుతుపవనాలు ఆలస్యంగా విరమించడం, అనేక ప్రాంతాల్లో అల్పపీడనాలు ఏర్పడటం వల్లే అక్టోబరులో విపరీతమైన వర్షాలు కురిశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.సహజంగా అక్టోబర్‌లో నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడతూ ఉంటాయి. దీని వల్ల ఈ నెలలో వర్షాలు తక్కువగా నమోదవుతాయి. ఇదే నెలలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వీటి ద్వారా దేశంలోని తూర్పు ప్రాంతంలో, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. పశ్చిమ ప్రాంతం నుంచి వీచే గాలులు ఉత్తర భారతదేశంలోని స్థానిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటి వల్ల వర్షాలు, మంచు కురుస్తుంది.
అయితే గత వారంలో లడక్, కశ్మీర్, ఉత్తరాఖండ్ లో.. ఈ సీజన్ లో మొదటి సారిగా మంచు కురిసింది. గత వారంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి.
* అక్టోబరులో అతి వర్షాలు ఎందుకంటే?
నాలుగు నెలలపాటు ఉండే నైరుతి రుతుపవనాలు అక్టోబరు మొదట్లోనే విరమిస్తూ ఉంటాయి. నైరుతి రుతుపవనాల విరమణ సమయంలో పిడుగులతో కూడిన వర్షాలు పడుతూ ఉంటాయి. అక్టోబరు 6వ తేదీ నుంచి తిరుగుముఖం పట్టాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా సెప్టెంబరు 17 వరకు సమయం తీసుకున్నాయి.
దీంతో గత పది రోజుల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఒడిశాలో సోమవారం నాటికి కూడా నైరుతి రుతుపవనాలు వీడలేదు. దీని వల్ల ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో అధిక వర్షాలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.
* ఏ రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయంటే
గత వారం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. 24 గంటల్లో ఢిల్లీలో 87.9మి.మీ వర్షపాతం నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబరులో భారీ వర్షాలు నమోదు కావడంలో రికార్డు నమోదైంది. వందేళ్లలో ఇది నాలుగో అతిపెద్ద వర్షపాతమని వాతావరణ శాఖ వెల్లడింది. గత 24 గంటల్లో ఒడిశాలో 210 మి.మీ వర్షపాతం నమోదైంది.
* కేరళలో అత్యధిక వర్షపాతం
వాతావరణ మార్పుల వల్ల అల్ప పీడనాలు ఏర్పడి సంవత్సరం పొడవునా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని మహాపాత్ర వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో కేరళలో అక్టోబరు 15 నుంచి 17 వరకు అతి భారీ వర్షపాతం నమోదైంది. రెండు రోజుల్లో 200 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో కేరళలోని ఇడుక్కి, ఎర్నాకుళం, కొల్లం, కొట్టాయం జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి.
ఇది కూడా చదవండి : కేరళలో భారీ వరదలకు కారణం ఇదే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
* రాబోయే రోజుల్లో మరిన్నివర్షాలు
కేరళలో ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడింది. అయితే మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం చురుగ్గా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ వారం ఉత్తరభారతదేశంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
* మరో అల్పపీడనం
ఒడిశాలో ఉత్తర ప్రాంతం, పశ్చిమ బెంగాల్ లోని గంగా పరివాహక ప్రాంతాల్లో మరో అల్పపీడనం చురుగ్గా ఉంది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలులతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, సిక్కిం, బీహార్ రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Kerala rains, Madhya pradesh, Uttarakhand, WEATHER