Pakistan-Taliban relationship: తాలిబన్ల విజయం వెనుక పాక్ హస్తం.. ఉగ్రసంస్థతో ఏళ్లుగా కొనసాగుతోన్న పాక్ సత్సంబంధాలు

ప్రతీకాత్మక చిత్రం

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారం లాక్కోవడంతో పాకిస్థాన్‌ తిరిగి పెట్రేగిపోతుందని కొత్తగా చెప్పక్కర్లేదు. జిహాదీ గ్రూప్‌లు మరింత రెచ్చిపోనున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్‌లో తెహ్రీక్‌ ఎ తాలిబిన్‌, అఫ్గానిస్థాన్‌ తాలిబన్లు ఒకే నాణేనికి చెందిన ముఖాలని చెబుతున్నారు.

  • Share this:
‘వారాలు, నెలలు పడుతుంది అనుకున్నాం... కానీ కొన్ని రోజుల్లోనే పని పూర్తయిపోయింది’
- అఫ్గానిస్థాన్‌ అధికారాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న తీరును చూసి అమెరికా పెద్దలు అన్నమాట ఇది. వాళ్లే కాదు ప్రపంచం మొత్తం ఇదే అంటోంది. అయితే అలా అనడానికి, తాలిబన్లు అలా చేయడానికి వెనుక ఏదో దేశం హస్తం ఉందని అందరూ అనుకుంటున్నారు. అయితే అది పాకిస్థానే అని చెప్పడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అని ఇంటెలిజెన్స్‌ నిపుణులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అంత ఉద్ధృతంగా ముందుకొచ్చి, దేశ రాజధానిపై దండయాత్ర చేసి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో పాకిస్థాన్‌ చక్కటి సహకారం అదించిందట.

పాకిస్థాన్‌కు, తాలిబన్ల మధ్య చాలా ఏళ్లుగా చక్కటి అనుబంధం సాగుతోంది. 1994లో వెలుగులోకి వచ్చిన ఈ బంధం దినదినం ప్రవర్థమానం అన్నట్లుగా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో 1996లో తొలిసారి అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత తాలిబన్ల నేతలకు పాకిస్థాన్‌ ఆశ్రయం కూడా ఇచ్చింది. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరుకు మేం సహకరిస్తాం అని పాకిస్థాన్‌... అమెరికాతో అనడం కొసమెరుపు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల విజయాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌లోని రక్షణ, రాజకీయ వర్గాలు హర్షిస్తున్నాయి. తాలిబన్లకు చెందిన కీలక నాయకులు అహ్మద్‌ షా మసూద్‌ సోదరులు పాకిస్థాన్‌ చేరారు. అక్కడ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీతో సమావేశమయ్యారు. దీని బట్టి అఫ్గానిస్థాన్‌లో జరిగిన దానికి పాకిస్థాన్‌కి ఎంత సంబంధం ఉందో చెప్పవచ్చు. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘ఎట్టకేలకు అఫ్గానిస్థాన్‌ బానిస సంకెళ్లు తెంచుకుంది’ అని చెప్పారు. దీంతో కాబూల్‌లో పాక్‌ స్నేహితులు అధికారంలోకి వచ్చారు అంటూ అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అంటున్నారు.

పాక్‌ ఎలా సాయం చేసిందీ... ఈ ప్రశ్న ఇప్పటికే మీద మదిలో మెదిలో ఉంటుంది. దానికి నిపుణులు చెబుతున్న సమాధానం... అఫ్గానిస్థాన్‌ సైన్యం కంటే ఎక్కువ బలం సంపాదించడం. అందులోనే పాకిస్థాన్‌ సాయం చేసిందంటున్నారు. అఫ్గానిస్థాన్‌ రక్షణ బలగాలపై దాడుల కోసం తాలిబన్లు పాకిస్థాన్‌కు చెందిన స్థావరాలను వినియోగించుకున్నాయట. తాలిబన్ల విజయం తర్వాత బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో ఘనంగా బైక్‌ ర్యాలీలు జరిగాయట. మొన్నామధ్య పాక్‌ మంత్రి ఒకాయన మాట్లాడుతూ... ‘గాయపడ్డ తాలిబన్లకు పాకిస్థాన్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్నాం’ అని చెప్పారు.

అఫ్గానిస్థాన్‌ ప్రధానులు కూడా గతంలో ఇదే తరహాగా మాట్లాడారు. తాలిబన్లకు పాక్‌ ఆశ్రయం ఇస్తోందని చెప్పారు. వీటన్నింటి ప్రకారం చూసుకుంటే తాలిబన్లు, పాకిస్థాన్‌ మధ్య ఉన్న బంధం తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారం లాక్కోవడంతో పాకిస్థాన్‌ తిరిగి పెట్రేగిపోతుందని కొత్తగా చెప్పక్కర్లేదు. జిహాదీ గ్రూప్‌లు మరింత రెచ్చిపోనున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్‌లో తెహ్రీక్‌ ఎ తాలిబిన్‌, అఫ్గానిస్థాన్‌ తాలిబన్లు ఒకే నాణేనికి చెందిన ముఖాలని చెబుతున్నారు. ఇక మన దేశం సంగతి చూస్తే... అఫ్గానిస్థాన్‌లో మన పరపతి తగ్గిపోతుంది. కాందహార్‌ విమానం హైజాక్‌ ఘటనను ఇంకా మన దేశం మరచిపోలేదు.
Published by:Krishna Adithya
First published: