గతేడాది డిసెంబర్‌లో(December) అమల్లోకి వచ్చిన సరోగసీ(Surrogacy) చట్టానికి సంబంధించిన కేసులో ఓ జంట బాంబే హైకోర్టును(High Court) ఆశ్రయించింది. 2021 డిసెంబరులో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్(ART) చట్టం, సరోగసీ చట్టానికి పార్లమెంటులో(Parliament) ఆమోదం లభించింది. అయితే చట్టం కాకముందే ప్రారంభమైన సరోగసీ ప్రక్రియను పూర్తి చేసేలా ఆదేశించాలని కోరుతూ ఒక జంట కోర్టును(Court) ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన అనంతరం మే 18న బాంబే హైకోర్టు ముంబైకి(Mumbai) చెందిన హిందూజా హాస్పిటల్ వివరణ కోరింది. భార్య తన ఇద్దరు పిల్లలను కోల్పోయింది. వైద్యపరమైన సమస్యల కారణంగా సహజంగా ప్రసవించలేక పోవడంతో సరోగసీ చేయించుకోవడానికి ఆ దంపతులు 2021 అక్టోబర్‌లో ఆసుపత్రిని సంప్రదించారు.
ఫలదీకరణం(ఫెర్టిలైజేషన్) పూర్తయిన తర్వాత, పిండాలను థానేలో క్రియోప్రెజర్డ్ చేశారు. తరువాత అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్(ART) చట్టం, సరోగసీ చట్టం 2022 జనవరిలో అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టం సరోగేట్ క్యారియర్‌కు చికిత్స చేయకుండా నిషేధించాయని, పిండాలను సర్రోగేట్ క్యారియర్‌కు బదిలీ చేయలేమని ఆస్పత్రి దంపతులకు తెలిపింది. పిండాలను ఏదైనా ఇతర ART క్లినిక్‌కి బదిలీ చేయాలని కోరుతూ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
కొత్త చట్టం ప్రకారం ART చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లోపు జాతీయ లేదా రాష్ట్ర బోర్డు ద్వారా ఇటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆసుపత్రి వాదించింది. మరోవైపు అలాంటి బోర్డు ఇంకా ఏర్పాటు చేయలేదని దంపతులు పేర్కొన్నారు. అందువల్ల పిండాల జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, చివరి ప్రయత్నంగా బాంబే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని దంపతులు తెలిపారు.
ART చట్టం, సరోగసీ చట్టం నిబంధనలు ఏంటి?
సరోగసీ (నియంత్రణ) చట్టం: 2019 జూలై 15న తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన సరోగసీ(నియంత్రణ) బిల్లును ఎంపిక కమిటీకి పంపారు. 2020 ఫిబ్రవరి 5న స్టాండింగ్ కమిటీ ముందు నివేదికను సమర్పించారు. 2021 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. దీనిపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత 2022 జనవరిలో అమల్లోకి వచ్చింది.
* సరోగసీ అంటే ఏంటి?
సరోగసీ(అద్దె గర్భం) ద్వారా ఎవరైనా మహిళ ఇద్దరు దంపతుల కోసం బిడ్డను కనడానికి అనుమతి ఉంటుంది. బిడ్డ జన్మించిన తర్వాత సంబంధిత దంపతులకు అప్పగించాలి. వైద్యపరమైన కారణాలు, ఇతర లోపాలతో బిడ్డకు జన్మనివ్వలేని దంపతులకు సరోగసీని ఉపయోగించుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. అమ్మకం, వ్యభిచారం, ఇతర చెడు మార్గాల్లో సరోగసీని ఉపయోగించకుండా చట్టం నిషేధించింది. బిడ్డ జన్మించిన తర్వాత అన్ని హక్కులు సంబంధిత జంటకే ఉంటాయని స్పష్టం చేసింది. ఒకవేళ అబార్షన్ చేయించాలంటే అద్దె తల్లి, అధికారుల అనుమతితోనే జరుగుతుంది, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
* సరోగసీని ఎవరు పొందవచ్చు?
చట్టం ప్రకారం, అద్దె గర్భం ద్వారా సంతానం పొందేందుకు దంపతులు అర్హత, ఆవశ్యకత సర్టిఫికేట్‌లను పొందాలి. పెళ్లయి ఐదేళ్లు పూర్తయి, భార్య వయసు 25-50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26- 55 ఏళ్ల మధ్య ఉంటే ఆ జంటకు అర్హత ఉంటుంది. దంపతులకు ఏ పరంగానైనా సంతానం(బయోలాజికల్, దత్తత లేదా సర్రోగేట్) ఉండకూడదు. మానసిక లేదా శారీరక వైకల్యాలు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉంటే మినహాయింపు ఉంటుంది. జంటలో ఎవరికైనా వంద్యత్వం(ఇన్‌ఫెర్టిలిటీ)ని ధ్రువీకరిస్తూ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అందించిన సర్టిఫికేట్ అవసరం. సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను పెంపకం, సంరక్షణ హక్కులకు సంబంధించి మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలి. అద్దె తల్లికి ప్రసవం అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు 16 నెలల పాటు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి.
* ఎవరు అద్దె తల్లి(సర్రోగేట్) కావచ్చు?
అద్దె తల్లి దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలి. వివాహిత అయి ఉండి, పిల్లలు ఉండి, 25-35 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీకి అర్హత ఉంటుంది. ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగేట్‌గా ఉండాలి. సరోగసీ కోసం ఆమె తప్పనిసరిగా మెడికల్, సైకలాజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను పొందాలి.
* సరోగసీని ఎవరు నియంత్రిస్తారు?
చట్టం ఆమోదించిన 90 రోజుల్లోగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ సరోగసీ బోర్డ్ (NSB), స్టేట్ సరోగసీ బోర్డ్ (SSB)లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సంస్థకు సరోగసీ క్లినిక్‌ల ప్రమాణాలను అమలు చేయడం, ఉల్లంఘనలను పర్యవేక్షించడం, సవరణలను సిఫార్సు చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి. సరోగసీ క్లినిక్‌లు సంబంధిత అధికారి నియామకం తర్వాత 60 రోజులలోపు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వాణిజ్యపరమైన అద్దె గర్భం, పిండాలను విక్రయించడం, దోపిడీ చేయడం, అద్దె బిడ్డను విడిచిపెట్టడం తదితరాలను ఈ చట్టం కింద నేరాలుగా పరిగణిస్తారు. వీటికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
* సహాయ పునరుత్పత్తి సాంకేతికత(ART) చట్టం: ART చట్టాన్ని 2020 సెప్టెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సరోగసీ చట్టంతో పాటు 2021 డిసెంబర్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం కూడా 2022 జనవరిలో అమల్లోకి వచ్చింది.
* ART అంటే ఏంటి?
ART అనేది మానవ శరీరం వెలుపల స్పెర్మ్ లేదా గుడ్డు కణాన్ని నిర్వహించడం ద్వారా స్త్రీ పునరుత్పత్తి మార్గంలోకి పిండాన్ని బదిలీ చేయడం. వీటిలో స్పెర్మ్ డొనేషన్, ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (IVF) (ప్రయోగశాలలో వీర్యం ఫలదీకరణం), గర్భధారణ అద్దె గర్భం (బిడ్డకు బయోలాజికల్‌గా సర్రోగేట్‌తో సంబంధం లేదు).
* ART క్లినిక్‌లు, బ్యాంకుల కోసం నియమాలు
ప్రతి ART క్లినిక్, బ్యాంక్ తప్పనిసరిగా నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. మరో ఐదేళ్లపాటు రెన్యూవల్ చేసుకోవచ్చు. చట్టంలోని నిబంధనలను సంస్థ ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశం ఉంది. సస్పెండ్ కూడా చేయవచ్చు. ఏ బిడ్డ పుడుతాడనే విషయాన్ని ముందుగానే తెలుసుకొన్న వారికి క్లినిక్‌లు ప్రక్రియను ప్రారంభించకూడదు, స్త్రీ శరీరంలో పిండాన్ని అమర్చడానికి ముందు తప్పనిసరిగా జన్యుపరమైన వ్యాధులను తనిఖీ చేయాలి.
* స్పెర్మ్ డొనేషన్, ART సేవల కోసం షరతులు
రిజిస్టర్ చేసుకున్న ART బ్యాంక్ 21- 55 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషుల నుండి వీర్యాన్ని పరీక్షించవచ్చు, సేకరించవచ్చు, నిల్వ చేయవచ్చు. 23- 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల నుంచి గుడ్లను కూడా నిల్వ చేయవచ్చు. చట్టం ప్రకారం మహిళా దాతలకు వివాహమై ఉండాలి, కనీసం మూడు సంవత్సరాల వయసున్న సొంత బిడ్డ ఉండాలి. ఒక స్త్రీ తన జీవితంలో ఏడు గుడ్లను దానం చేయవచ్చు. ఒక బ్యాంకు ఒక దాత వీర్యాన్ని ఒకటి కంటే ఎక్కువ జంటలకు సరఫరా చేయదు. ఇటువంటి ART విధానాలకు జంట, దాత ఇద్దరి రాతపూర్వక సమాచార సమ్మతి అవసరం. ART ప్రక్రియను కోరుకునే జంట స్త్రీ దాతకి నష్టం, లేదా మరణించిన సందర్భంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలి. క్లినిక్‌లు, బ్యాంకులు సెక్స్-సెలెక్టివ్ ARTని ప్రకటనలు చేయడం లేదా అందించడం నిషేధం. అటువంటి నేరానికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా, రూ.10 నుండి రూ.25 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
Home Loan: హోమ్ లోన్ కావాలా? 7 శాతం లోపు వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే
* ART ప్రక్రియల నియంత్రణ
సరోగసీ చట్టం కింద ఏర్పడిన జాతీయ, రాష్ట్ర బోర్డు కూడా ART సేవలను నియంత్రించేలా చేయాలని భావిస్తున్నారు. ఈ బోర్డులు పాలసీపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, చట్టం సమీక్ష, అమలును పర్యవేక్షించడం, ART క్లినిక్‌లు, బ్యాంకుల ప్రవర్తనా నియమావళిని రూపొందించడం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bombay high court, Children, Explained