రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ఇండియాలో పర్యటించారు. భారత ప్రధాని మోదీతో పుతిన్ సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలు చర్చకు వచ్చాయి. అధినేతల భేటీ కంటే ముందు రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు 2ప్లస్2 చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి సెర్జిషోయ్ లు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రష్యాతో కలిసి భారత్ జాయింట్ వెంచర్‌గా ఉత్తరప్రదేశ్ అమేథీ సమీపంలోని కోర్వాలో AK-203 రైఫిల్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. ఏకే రకానికి చెందిన ఈ శక్తిమంతమైన రైఫిళ్ల తయారీ యూనిట్‌ను ఏడాది క్రితమే నెలకొల్పింది. ఈ యూనిట్లోనే రష్యా అవ్టోమాట్ కలష్నికోవ్ రైఫిళ్లను తయారు చేయనుంది. ఏకే 47 సహా ఆ సిరీస్‌కు చెందిన అన్ని రకాల రైఫిళ్లను ఇక్కడే ఉత్పత్తి చేయనుంది. మేక్-ఇన్ ఇండియా చొరవతో తయారు కానున్న ఏకే-203 రైఫిల్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
* 6 లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్ల ఉత్పత్తి
అధునాతన ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి 2018లోనే కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆయుధాల ధర, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం వంటి విషయాలతో వీటి తయారీకి ముందడుగు పడలేదు. తాజాగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో భాగంగా రాయల్టీ చెల్లింపును మాఫీ చేయడానికి రష్యా అంగీకరించడంతో ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని కోర్వాలో రైఫిల్ తయారీ ఫ్యాక్టరీలో ఏకే203 రైఫిళ్ల తయారీ ప్రారంభంకానుంది. ఈ యూనిట్లో మొత్తం 6 లక్షలకు పైగా ఎకె-203 రైఫిళ్ల ఉత్పత్తి జరగనుంది.
ఈ ఒప్పందం విలువ రూ. 5,000 కోట్లకు పైగా ఉంటుందని నివేదికలు తెలిపాయి. కాగా, రైఫిల్స్‌ను దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చు కంటే దేశీయంగా ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత్‌లో ఉత్పత్తి చేసే ప్రతి రైఫిల్‌పై రాయల్టీ రుసుమును తగ్గించేందుకు రష్యా అంగీకరించడంతో ధరల సమస్య పరిష్కారమైందని నివేదికలు సూచించాయి.
* భారత్ కొత్త రైఫిల్స్‌పై ఎందుకు దృష్టి పెట్టింది?
భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధునాతన రైఫిళ్లు, యుద్ద సామాగ్రిపై భారత్ దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి ఏకే203ఎస్ రైఫిల్స్ కొనుగోలు చేయనుంది. ఈ రైఫిళ్లు ప్రస్తుత INSAS రైఫిళ్ల కంటే మెరుగ్గా పనిచేస్తాయి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన ఇన్సాస్ రైఫిల్‌లో అనేక సంవత్సరాలుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రత గల ప్రదేశాల్లో వీటిని ఉపయోగించడం ఇబ్బందిగా మారింది. వీటికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో, భారత సైనికులు లేదా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు లేదా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు INSAS రైఫిళ్లకు బదులు AK-47 లేదా ఇతర దిగుమతి చేసుకున్న రైఫిల్స్‌ను ఉపయోగిస్తున్నారు.
* ఏకే 203, ఇన్సాస్ రైఫిల్స్ మధ్య తేడా ఏంటి?
ప్రస్తుతం భారత సైన్యం ఇన్సాస్ రైఫిళ్లను వినియోగిస్తోంది. మూడు దశాబ్దాల నుంచి అవే అందుబాటులో ఉన్నాయి. వాటి స్థానంలో ఏకే 203ని అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఇవి 300 మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని సులభంగా చేధించగలవు. ఏకే-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిళ్ల కంటే చాలా తేలికైనవి. ఇన్సాస్ రైఫిల్ బరువు 4.15 కిలోలు కాగా.. AK-203 బరువు 3.8 కిలోలు మాత్రమే ఉంటుంది. ఏకే 203 రైఫిల్ ఇన్సాస్ కంటే వేగంగా శత్రువుపై దాడి చేయగలదు. 20 రైండ్ల సామర్థ్యం గల ఏకే 203 ఒకేసారి 30 బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. మరోవైపు, ఇన్సాస్ 400m పరిధిని కలిగి ఉండగా ఏకే-403 800m వీక్షణ పరిధిని కలిగి ఉంటుంది. ఇన్సాస్‌తో సింగిల్ షాట్లు, మూడు రౌండ్ల పేలుళ్లలో కాల్చగలిగినప్పటికీ, ఏకే-203 రైఫిల్‌ను ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ మోడ్‌లో ఉపయోగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అలాగే, ఏకే 203 నిమిషానికి 650 బుల్లెట్లను వదులుతుంది.
* ఐఆర్ఆర్పీఎల్ ద్వారా ఏకే 203 రైఫిళ్ల తయారీ..
ఏకే-203 ఉత్పత్తిని భారతదేశంలో ఇండో -రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) చేపట్టనుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్ (OFB), రష్యన్ సంస్థలు రోసోబోరోనెక్స్పోర్ట్ , కన్సర్న్ కలాష్నికోవ్‌లు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్ 50.5 శాతం వాటా కలిగి ఉండగా.. మిగిలిన 49.5 శాతం వాటాను రష్యన్ సంస్థలు కలిగి ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో భారత్, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగా ఈ జాయింట్ వెంచర్ ఏర్పడింది. 2019లో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ఏకే-203ల ఉత్పత్తిని 100 శాతం భారత్‌లోనే తయారవుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నొక్కిచెప్పారు. కోర్వా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత IRRPL రష్యాతో సహా ఇతర దేశాలకు ఆయుధాన్ని ఎగుమతి చేయనుందని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defence Ministry, India, Pm modi, Russia, Vladimir Putin