Home /News /explained /

EXPLAINED HOW ARE REPUBLIC DAY TABLEAUX DESIGNED AND SELECTED HERE DETAILS NS GH

Explained: రిపబ్లిక్‌ డే శకటాలను ఎలా డిజైన్‌ చేస్తారు? పరేడ్‌లో పాల్గొనే శకటాలను ఎంపిక చేసే ప్రక్రియ ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిపబ్లిక్‌ డే పరేడ్‌, వేడుకలకు బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వ శాఖ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో శకటాల ద్వారా పాల్గొనాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని రాజ్యాంగ సంస్థలను ఆహ్వానిస్తుంది.

ఇంకా చదవండి ...
ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున రాజ్‌పథ్‌లో శకటాల ప్రదర్శన ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఎన్ని శకటాలు పాల్గొంటాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా 21 శకటాలు ఉండే సూచనలున్నాయి. ఇందులో 12 వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, మిగిలిన 9 శకటాలు, కేంద్ర ప్రభుత్వ కింద పనిచేసే విభాగాలు లేదా స్వతంత్ర సంస్థలకు చెందినవి. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన శకటాన్ని ఈ సంవత్సరం రిపబ్లిక్‌ డే పరేడ్‌ నుంచి రక్షణ శాఖ తిరస్కరించింది. ఇది తనను ఎంతో షాక్‌కు గురిచేసిందని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన సేవలు, ఆయన స్థాపించిన INAను కీర్తిస్తూ తాము శకటాన్ని రూపొందించామని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు.

తిరస్కరణకు గురైన శకటాల్లో కేవలం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందినవి మాత్రమే లేదు. శ్రీ నారాయణ గురు స్మరిస్తూ కేరళ ప్రభుత్వం రూపొందించిన శకటం కూడా పరేడ్‌లో పాల్గొనేందుకు నోచుకోలేదు. పరేడ్‌కు బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వశాఖే శకటకాలను సమన్వయం చేస్తుంది. శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చూస్తుందని, అందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని రక్షణ శాఖ స్పష్టం చేస్తోంది.

శకటాల డిజైన్‌, ఎంపిక ఎలా ఉంటుంది?
రిపబ్లిక్‌ డే పరేడ్‌, వేడుకలకు బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వ శాఖ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో శకటాల ద్వారా పాల్గొనాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని రాజ్యాంగ సంస్థలను ఆహ్వానిస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 16న 80 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్నికల సంఘం, నీతి ఆయోగ్‌కు లేఖలు రాసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాల్గొనేందుకు శకటాల ప్రతిపాదన పంపించాలనే సూచన ఇందులో ఉంది. ఈ ప్రతిపాదనలను సెప్టెంబర్‌ 27లోపు సమర్పించాలి. వాటిని ఎంపిక చేసే ప్రక్రియ అక్టోబర్‌ రెండో వారంలో మొదలవుతుంది.

శకటాల ద్వారా రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలు దేనినైనా చూపింవచ్చా?
ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు/విభాగాలు వాటికి సంబంధించి విషయాలను చూపించవచ్చు. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్‌ 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యం. ఈ శకటాల్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదో తెలియజేస్తూ మార్గదర్శకాలను కూడా రక్షణ మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. పాల్గొనే సంస్థలు ప్రముఖ సంస్థలకు చెందిన అర్హులైన యువ డిజైనర్లను తీసుకోవాలి. అలాగే చిత్రాలు లేదా కంటెంట్‌ చక్కగా కనిపించేలా ఉండేందుకు ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే వాల్‌, కదిలి వాటి కోసం రోబొటిక్స్‌ లేదా మెకాట్రానిక్స్‌, కొన్నింటి కోసం 3D ప్రింటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, శకటాన్ని చక్కగా చూపేందుకు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ వంటివి ఉండాలి. అలాగే దేశ వైవిధ్యాన్ని చూపేలా శకటాలు ఉండాలి కాబట్టి ఏ రెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు ఒకే తరహాలో ఉండకూడదు.

శకటాలపై ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు/విభాగాల పేర్లు తప్ప ఎటువంటి రాతలు, లోగోలు ఉండకూడదు. అంతే కాదు వాటి పేర్లు ముందు భాగంలో హిందీలో, వెనుక భాగంలో ఇంగ్లిష్‌లో మిగిలిన వైపు ప్రాంతీయ భాషలో ఉండాలి. శకటాల రూపకల్పనలో పర్యావరణ అనుకూల వస్తువులు ఉపయోగించాలని, ప్లాస్టిక్‌, ప్లాస్టిక్‌ ఆధారిత వస్తువులను దూరం పెట్టాలనే సూచన కూడా అందులో ఉంది.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటమే కాదు చాలా సమయం కూడా తీసుకుంటుంది. కళలు, సంస్కృతి, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, ఆర్కిటెక్చర్‌, నాట్యం వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఒక కమిటీని రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. వచ్చిన ప్రతిపాదనల నుంచి శకటాలను ఎంపిక చేయడంలో వీరు సాయపడతారు. ముందు, ప్రతిపాదనలకు సంబంధించిన స్కెచ్చులు లేదా డిజైన్లను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వాటిల్లో ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే అందుకు సంబంధించి సూచనలు చేస్తుంది. మామూలుగా, రంగులతో కూడా, చదవడానికి వీలుగా, అనవసరమైన వివరాలు లేకుండా స్కెచ్‌ ఉండాలి. అది చూడగానే అర్థమైపోవాలి తప్ప దానికి ఎటువంటి రాతపూర్వక వివరణ ఉండకూడదు.

శకటంలో సంప్రదాయ నృత్యం ఉంటే అది సాధారణంగా జానపద నృత్యం అయి ఉండాలి. ఉపయోగించే దుస్తులు, సంగీత వాయిద్య పరికరాలన్నీ కూడా సంప్రదాయకంగా, ప్రామాణికంగా ఉండాలి. ఆ నాట్యానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ కూడా ప్రతిపాదనకు జత చేయాలి. అవి ఆమోదం పొందాక, పాల్గొనేవారు తమ ప్రతిపాదనలకు సంబంధించి 3D మోడల్స్‌ అందజేయాలి. తుది ఎంపిక సందర్భంగా వాటిని కూడా నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. తుది ఎంపిక సమయంలో అందులో మిళితమైన ఉన్న అంశాలు, కంటికి ఇంపుగా ఉండే తీరు, జనాలపై చూపే ప్రభావం, శకటం ఆలోచన/ఆకృతి, అందులో ఇమిడి ఉండే అంశం, సంగీతం వంటి అనేక అంశాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.

ప్రతిపాదనల పరిశీలన, తొలగింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కమిటీ కనీసం ఆరుసార్లు సమావేశమవుతుంది. ఏవైతే షార్ట్‌ లిస్ట్‌ అవుతాయే వాటికి మాత్రమే తదుపరి రౌండుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. తుది ఎంపిక జరిగినప్పటికీ ఆమోదించిన తుది ప్రకటనలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా శకటం లేనట్టు అయితే రాజ్‌పథ్‌లో నిర్వహించే పరేడ్‌లో దానికి స్థానం ఉంటుందని గ్యారెంటీ ఉండదని పాల్గొనాలని పంపించే ఆహ్వానంలో రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. రెండు కంటే ఎక్కువ శకటాలు తయారు చేసే సంస్థ లేదా ఫ్యాబ్రికేటర్‌ను ఉపయోగించరాదని పాల్గొనేవారికి రక్షణ మంత్రిత్వ శాఖ సూచిస్తుంది.

ఈ శకటాలకు ఏమైనా నిర్దేశిత పరిమాణం ఉంటుందా?
పాల్గొనే వారికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ట్రాక్టర్‌, ఒక ట్రైలర్‌ అందిస్తుంది. వాటిపైనే శకటం అమర్చాలి. అదనంగా ఎటువంటి ట్రాక్టర్‌ లేదా ట్రాయిలర్‌ లేదా ఇతర ఏ వాహన వినియోగాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిషేధిస్తుంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ అందించే ట్రాక్టర్‌ లేదా ట్రైలర్‌ను పాల్గొనేవారు మార్చుకోవచ్చు. కానీ వాహనాల సంఖ్య రెండుకు మించరాదు. శకటం థీమ్‌కు అనుగుణంగా ట్రాక్టర్‌ను కప్పాల్సి ఉంటుంది. అలాగే నడపడానికి, తిప్పడానికి వీలుగా ట్రాక్టరుకు, ట్రైలర్‌కు మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి.

పాల్గొనేవారు తమ థీమ్‌కు తగినట్టుగా శకటానికి మెరుగులు దిద్దవచ్చు. శకటాన్ని నిలిపి ఉంటే ట్రైలర్‌ 24 అడుగుల 8 ఇంచుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 4.2 ఇంచుల ఎత్తుతో 10 టన్నుల బరువు మోయగలిగే సామర్థ్యంతో ఉండాలి. అలాగే శకటం పొడవు 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, నేల నుంచి 16 అడుగుల ఎత్తు మించరాదు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Republic Day 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు