EXPLAINED AS OMICRON SURGES WHY INDIA US HAVE TWEAKED HOME ISOLATION PROTOCOLS GH VB
Explained: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. నిబంధనలు సవరించడానికి గల కారణాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
కొవిడ్ లక్షణాలు కనిపించకుండా వ్యాధి బారిన పడిన వారి ఐసోలేషన్ వ్యవధిని అమెరికా 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించింది. ఆ వెంటనే భారత్ కూడా దేశంలో కొవిడ్-19 స్వల్ప లేదా లక్షణాలు కనిపించని వారికి సంబంధించి హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలు సవరించింది.
ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’(Omicron) భయపెడుతోంది. అమెరికా, ఫ్రాన్స్(France) వంటి దేశాలతో పాటు భారత్‌లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇంతలా ఒమిక్రాన్ వ్యాపిస్తున్నా.. ఐసోలేషన్ నియమాలను కొన్ని దేశాలు సడలించాయి. కొవిడ్ లక్షణాలు కనిపించకుండా వ్యాధి బారిన పడిన వారి ఐసోలేషన్ వ్యవధిని అమెరికా(America) 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించింది. ఆ వెంటనే భారత్(Bharath) కూడా దేశంలో కొవిడ్-19 స్వల్ప లేదా లక్షణాలు కనిపించని వారికి సంబంధించి హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలు సవరించింది. ఇంతకీ ఆ కొత్త మార్గదర్శకాలు ఏంటి? ఆ మార్పుల గురించి నిపుణులేమంటున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం.
సవరించిన మార్గదర్శకాలు
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తరహాలోనే భారత్ కూడా ఐసోలేషన్ ముగిసిన తర్వాత రోగి తిరిగి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి ఏడు రోజుల ఐసోలేషన్ ముగియడం లేదా వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకుండా ఉంటే, వారు ఐసోలేషన్ నుంచి డిశ్చార్జ్ అయినట్టే. గతంలో ఈ వ్యవధి 10 రోజులు ఉండేది. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సదరు వ్యక్తులు మాస్క్ ధరించడం మర్చిపోకూడదు. అంతే కాదు, హోమ్ ఐసోలేషన్ ముగిసిన తర్వాత తిరిగి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాధి బారిన పడిన వ్యక్తులను కలిసిన వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే వారు కొవిడ్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. హోమ్ క్వారెంటైన్ సరిపోతుంది.
60 ఏళ్లకు పైబడిన రోగులు, అలాగే హైపర్‌టెన్షన్, డయాబెటీస్ లేదా గుండె జబ్బులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండే వ్యక్తులకు (HIV-పాజిటివ్, ఇతరుల అవయవాలు అందుకున్నవారు, క్యాన్సర్ థెరపీ) చికిత్స అందిస్తున్న డాక్టరు సూచిస్తేనే హోమ్ ఐసోలేషన్‌కు అనుమతిస్తారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి హోమ్ ఐసోలేష్ సిఫార్సు చేయకూడదు.
ఒమిక్రాన్ స్వభావం
కరోనా వైరస్‌లోని కొత్త రకం ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా ఇది వ్యాప్తి చెందుతున్నా డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ బారినపడిన వారు వేగంగా కోలుకుంటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం బుధవారం నాటికి భారతదేశంలో 2.14 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో ఇది ఆరు రెట్లు పెరిగింది. అయితే ఆస్పత్రుల్లో చేరే కొవిడ్ రోగుల సంఖ్యలో ఎటువంటి పెరుగుదల కనిపించలేదు. ఆక్సిజన్, ICU బెడ్స్ వినియోగం తక్కువగానే ఉంది.
అయితే ఇన్ఫెక్షన్ల బారిన పడి ఒత్తిడికి గురవుతున్న వ్యవస్థలపై భారం తగ్గించేందుకు అమెరికా, భారత్‌కు సవరించిన మార్గదర్శకాలు సాయపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వ్యవస్ధకు భంగం కలగకుండా చూస్తూనే ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన జాగ్రత్త చర్యలు అనుసరించాలని భారత్‌లో అనేక మంది నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను 14 రోజులపాటు ఇంట్లో నిలువరించలేమని అంటున్నారు. అదే సమయంలో క్వారెంటైన్, ఐసోలేషన్ వ్యవధిని తగ్గించేందుకు చేపట్టిన చర్యలకు ఆధారాలు ఉండాలని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తిలో ఎన్ని రోజుల పాటు ఇన్ఫెక్షన్ ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాదు కొవిడ్‌కు తగినట్టుగా మసలుకోవడం అవసరమని, ఇంట్లో పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు చూస్తున్న ఒమిక్రాన్ తీరును బట్టి అది స్వల్పంగా, స్వీయ పరిమితితో ఉంటుందని తేలింది. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో 80 నుంచి 90 శాతం మంది ఏడు రోజుల పాటు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటే.. వారిని ఐసోలేషన్ నుంచి బయటకు తీసుకురావడం మంచిదేనని సూచిస్తున్నారు మహారాష్ట్ర కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌కు చెందిన డాక్టర్ శశాంక్ జోషి. ఇప్పటికీ ఈ విధానం సరిగ్గానే ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ఎటువంటి టెస్ట్ లేకుండా ఐసోలేషన్ వ్యవధిని CDC సగానికి తగ్గించిందని, డబుల్ మాస్కింగ్ సిఫార్సు చేసిందని ఆయన గుర్తు చేశారు. భారత్ కూడా అదే తరహా విధానాన్ని అనుసరిస్తోందని ఆయన వెల్లడించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.