కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా పోషకాహారంపై ప్రజలకు అవగాహన పెరిగింది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆహారంలో సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం సైతం పెరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 2024 నాటికి ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), మధ్యాహ్న భోజనంతో సహా వివిధ ప్రభుత్వ పథకాల కింద పోర్టిఫికేషన్ రైస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బియ్యానికి పోషకాల జోడింపు ద్వారా ఆరోగ్యం అందించాలనేది ఫోర్టిఫికేషన్ ప్రధాన ఉద్దేశం.
* రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి?
బియ్యంలో ఖనిజాలు, ఇతర సూక్ష్మ పోషకాలను కలపడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అని చెప్పవచ్చు. రైస్ ఫోర్టిఫికేషన్‌ను.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్వచించింది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఆహారంలో అవసరమైన సూక్ష్మపోషకాలను ఉద్దేశపూర్వకంగా కలుపుతూ, పోషకాల నాణ్యతను పెంచడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రైస్ ఫోర్టిఫికేషన్ అనేది సాధారణ బియ్యానికి సూక్ష్మపోషకాలను జోడించే ప్రక్రియ. ఇలా నిర్ణీత మొత్తంలో ఖనిజాలు ఉండే బియ్యాన్ని సాధారణ బియ్యంలో కలిపి పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
రైస్ ఫోర్టిఫికేషన్ కోసం కోటింగ్, డస్టింగ్ వంటి అనేక సాంకేతిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో రైస్ ఫోర్టిఫికేషన్ కోసం 'ఎక్స్‌ట్రాషన్' అనేది మంచి టెక్నాలజీ అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో ఎక్స్‌ట్రూడర్ యంత్రాన్ని ఉపయోగించి.. పోషకాల మిశ్రమం నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (FRKs) ఉత్పత్తి చేస్తారు. ఆ తరువాత ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను సాధారణ బియ్యంలో నిర్ణీత మొత్తంలో కలిపి బలవర్థకమైన బియ్యాన్ని పంపిణీ చేస్తారు.
* ఎక్స్‌ట్రాషన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ఎక్స్‌ట్రాషన్ టెక్నాలజీలో బియ్యం పిండిని సూక్ష్మపోషకాల ప్రీమిక్స్‌తో కలుపుతారు. ఈ మిశ్రమానికి నీరు జోడిస్తారు. అనంతరం ఈ మిశ్రమాన్ని వేడి చేస్తూ.. ట్విన్-స్క్రూ ఎక్స్‌ట్రూడర్‌లోకి పంపిస్తారు. దీంతో పోషకాలు, ఖనిజాలు ఉండే రైస్ కెర్నల్స్ బయటకు వస్తాయి. ఇలా బయటకు వచ్చే రైస్ కెర్నెల్స్ ఆకారం, పరిమాణం సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ గింజలను ఎండబెట్టి, ప్యాక్ చేస్తారు. ఈ FRK ప్యాక్‌లను 12 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన బలవర్థకమైన బియ్యం పలుకులు సాధారణ బియ్యంలో కలిసిపోయేలా ఉండాలని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ రైస్ పొడవు 5 మిమీ, వెడల్పు 2.2 మిమీ ఉండాలి.
* రైస్ ఫోర్టిఫికేషన్ అవసరం ఏంటి?
భారతదేశంలో చాలామంది మహిళలు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దేశంలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారని అంచనా. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) ర్యాంకింగ్స్‌లో భారత్.. 107 దేశాల్లో 94వ స్థానంలో ఉంది. ఇది ఆహార కొరతను ఎత్తిచూపుతుంది. అందువల్ల పోషకాహార లోపాన్ని ఎదుర్కోవటానికి అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలకు పోషకాలు కలిపి బలవర్థకంగా మార్చడం అనేది మంచి పద్ధతి.
భారతదేశంలోని ప్రధాన ఆహారాల్లో బియ్యం ఒకటి. భారత జనాభాలో మూడింట రెండు వంతుల మంది బియ్యాన్నే ఆహారం కోసం వినియోగిస్తారు. మన దేశంలో తలసరి బియ్యం వినియోగం నెలకు 6.8 కిలోలుగా ఉంది. అందువల్ల పేద ప్రజలు వినియోగిస్తున్న బియ్యానికి సూక్ష్మపోషకాలను కలిపి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.
* ఫోర్టిఫికేషన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు ఏవి?
ఫోర్టిఫికేషన్ పద్ధతిలో ఉత్పత్తి చేసిన బియ్యాన్ని నేరుగా వినియోగించకూడదు. వీటిని సాధారణ బియ్యంతో కలిపిన తరువాతే ఆహారం కోసం వినియోగించాలి. మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. 10 గ్రాముల FRK బియ్యాన్ని తప్పనిసరిగా ఒక కిలో సాధారణ బియ్యంతో కలపాలి. ఇలా కలిపిన తరువాత.. ప్రతి కిలో బియ్యంలో ఉండాల్సిన పోషక విలువలను FSSAI నిర్దేశించింది. ఈ బియ్యంలో ఐరన్ (28 mg- 42.5 mg), ఫోలిక్ యాసిడ్ (75-125 మైక్రోగ్రాములు), విటమిన్ B 12 (0.75-1.25 మైక్రోగ్రాములు) కచ్చితంగా ఉండాలని ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రతి కిలో బియ్యంలో జింక్ (10 mg-15 mg), విటమిన్ A (500-750 మైక్రోగ్రామ్ RE), విటమిన్ B 1 (1 mg-1.5 mg), విటమిన్ B 2 (1.25 mg-1.75 mg), విటమిన్ B 3 (12.5 mg-20 mg), విటమిన్ B 6 (1.5 mg-2.5 mg) ఉండాలి.
* ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఎలా వండాలి?
మన ఇళ్లలో సాధారణంగా అన్నం వండే పద్ధతిలోనే ఈ ఫోర్టిఫైడ్ రైస్‌తో అన్నం వండుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకమైన పద్ధతులు ఏవీ అవసరం లేదు. అన్నం సిద్ధమైన తరువాత అందులోని పోషకాలు తినేవారికి అందుతాయి.
* ఈ బియ్యం ఉత్పత్తి ఎంత మేరకు ఉంది?
మన దేశంలో దాదాపు 2,690 రైస్ మిల్లులు ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేయడానికి బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం 14 కీలక రాష్ట్రాల్లో బ్లెండింగ్ సామర్థ్యం 13.67 లక్షల టన్నులుగా ఉంది. FRK ఉత్పత్తి గత రెండు సంవత్సరాల్లో 7,250 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లులను ఫోర్టిఫైడ్ రైస్ సౌకర్యాలకు అప్‌గ్రేడ్ చేయాలి. ఇందుకు కాస్త పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉత్పత్తి చేసే బలవర్థకమైన బియ్యం పరిమాణాన్ని బట్టి అప్‌గ్రేడ్ ఖర్చు ఉంటుంది. సాధారణంగా గంటకు 4-5 టన్నుల నిర్వహణ సామర్థ్యం ఉన్న రైస్ మిల్లును అప్‌గ్రేడ్ చేయడానికి దాదాపు రూ.15-20 లక్షల పెట్టుబడి అవసరం.
* ఫోర్టిఫికేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఈ బియ్యాన్ని ఎలా గుర్తించాలి?
ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి మూడు సూక్ష్మపోషకాలు ఉండే FRK ఉత్పత్తికి ఖర్చు కిలోకు 60 పైసల వరకు మాత్రమే అవుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఈ వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు పంచుకుంటాయి. రైస్ మిల్లర్లకు ఈ ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ గోనె సంచులపై ('+F') లోగో, ప్యాక్ మీద "ఫోర్టిఫైడ్ విత్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12" అని ప్రింట్ వేసి ఉంటుంది. వీటి ఆధారంగా వినియోగదారులు వాడేది సాధారణ బియ్యమా, ఫోర్టిఫైడ్ బియ్యమా అనేది తెలుసుకోవచ్చు.
* ఫోర్టిఫైడ్ రైస్‌ను ఇంతకు ముందు పంపిణీ చేశారా?
బలవర్థకమైన బియాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు 2019-20లో పైలట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు మూడు సంవత్సరాల పాటు రూ.174.64 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్.. వంటి 15 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో పైలట్ పథకం ప్రారంభమైంది. మహారాష్ట్ర, గుజరాత్ సహా ఆరు రాష్ట్రాలు పైలట్ పథకంలో భాగంగా బలవర్థకమైన బియ్యాన్ని పంపిణీ చేయడం ప్రారంభించాయి. ఈ ఏడాది జూన్ వరకు మొత్తం 2.03 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు.
* ఇతర దేశాలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయా?
ఇప్పటి వరకు ఏడు ప్రపంచ దేశాలు ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని తప్పనిసరి చేశాయి. అమెరికా, పనామా, కోస్టా రికా, నికరాగ్వా, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, సోలొమన్ ఐలాండ్స్.. వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PM Narendra Modi, VIRAL NEWS