Explained: దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లలు.. కరోనా థర్డ్ వేవ్‌ ప్రారంభమైందా?

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు లాంటి కోవిడ్ తరహా లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. గత కొద్ది వారాలుగా ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో మూడో వేవ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా కరోనా మరోసారి విజృంభిస్తుందని ప్రజలు భయపడుతున్నారు.

  • Share this:
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు లాంటి కోవిడ్ తరహా లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. గత కొద్ది వారాలుగా ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో మూడో వేవ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా కరోనా మరోసారి విజృంభిస్తుందని ప్రజలు భయపడుతున్నారు. అయితే తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే సామర్థ్యం మనకుందని కర్ణాటకలోని ఇందిరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ డాక్టర్ జీవీ బసవరాజు చెబుతున్నారు. పిల్లల్లో జ్వరాలు అధికమవడంపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల్లో మెదులుతున్న కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

* పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వడం.. సాధారణమేనా?
ఈ ప్రశ్నకు కచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. పిల్లలు గత 20 నెలలుగా పూర్తిగా ఇంట్లోనే (Indoor) ఉంటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ముందుగా అర్థం చేసుకోవాలి. మే నెల మధ్య నుంచి కోవిడ్ సంక్షోభం తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా ఇదే సమయంలో టీకా కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు బయటకు వస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున జన సమూహంలో రావడం వల్ల సహజంగానే అంటువ్యాధులు వస్తాయి. అందుకే పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.

* చిన్నారులే లక్ష్యమని చెబుతున్న మూడో వేవ్ ఇదేనా?
కరోనా మూడో వేవ్ లో పిల్లలే లక్ష్యంగా ఉంటారని చెప్పడమనేది ఓ అంచనా మాత్రమే. ఈ విషయం పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుతం పిల్లల్లో జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు పెరగడం థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతం కాదు.

* పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు ఏం చేయాలి?
మొదట మీరు భయపడవద్దు. ఆసుపత్రులు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నాయి. అయితే శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగినా లేదా ఏదైనా ఇతర అనారోగ్య సమస్య గమనిస్తే నిర్లక్ష్యం చేయకండి. తక్షణం తగ్గడానికి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వినియోగించవద్దు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దగ్గర్లోని శిశు వైద్యుడిని సంప్రదించాలి. ఆసుపత్రిలో చేర్చడం వల్ల చాలా వరకు సమస్యను నివారించవచ్చు.

* ఎక్కువ మంది పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉండటానికి కారణం?
ముందు కోవిడ్-19 కూడా ఓ ఫ్లూ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి చిన్నారుల్లో మనం చూస్తున్న లక్షణాలు కూడా కరోనా మాదిరిగానే ఉంటాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం లాంటివి వైరల్ ఇన్ఫెక్షన్లు చాలా సాధారణ లక్షణాలు. అందువల్ల మనం వీటిని కోవిడ్ లక్షణాలని చెప్పలేం.

* పిల్లలను ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి?
రెండు రోజుల పాటు మందులు వాడినప్పటికీ జ్వరం తగ్గకపోయినా లేదా చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారినా.. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లండి. వైద్యుడు పరీక్షించి ఆసుపత్రిలో చేర్చడం అవసరమా కాదా అని నిర్ధారిస్తారు. లేకుంటే ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేస్తారు.

ఇది కూడా చదవండి: D2-Dengue: ప్రమాదకరంగా మారుతున్న డీ2 డెంగ్యూ స్ట్రెయిన్‌.. విజృంభిస్తోన్న జ్వరాలు.. లక్షణాలివే..

* పిల్లలకు కోవిడ్ పరీక్ష తప్పనిసరా? పరీక్ష తప్పనిసరి అయితే దాన్ని ఎలా పొందాలి?
ఇప్పటి వరకైతే చిన్నారులకు కరోనా పరీక్ష తప్పనిసరి కాదు. 2 రోజుల చికిత్స తర్వాత కూడా లక్షణాలు మెరుగుపడకపోతే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని బీబీఎంపీ ఆదేశించింది. అవసరాన్ని బట్టి చికిత్స చేసే వైద్యుడు ఆర్టీపీసీఆర్ సూచిస్తాడు. ఇది వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంది.

* ప్రస్తుతం మన చుట్టూ గుర్తించని అనేక జ్వరాలేంటి?
ఇన్ ఫ్లూయెంజా, డెంగ్యూ నుంచి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల వరకు పాఠశాలలకు వెళ్లే పిల్లలను ప్రభావితం చేస్తాయి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ లాంటి కోవిడ్ నిబంధనలను ప్రజలు చాలా కాలంగా పాటిస్తున్నారు కాబట్టి అంటువ్యాధులు కొంచెం తగ్గాయి. అంతేకాకుండా వ్యాక్సిన్ కార్యక్రమంతో సాధారణ జీవనానికి తిరిగి వచ్చారు. ఈ ఇన్ఫెక్షన్లన్నీ పూర్తిగా చికిత్స చేయగలిగినవని గుర్తుంచుకోవాలి. చాలా మంది పిల్లలకు ఎలాగైనా నయమవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ప్రారంభంలోనే వైద్యులను సంప్రదిస్తే ఆసుపత్రిలో చేర్చకుండా ఉండవచ్చు.
Published by:Sambasiva Reddy
First published: