Student Loan Apps and Interest rates | బాగా చదువుకునే వారు డబ్బుల్లేక వారి స్టడీస్ ఆగిపోతే ఎంత బాధగో ఉంటుందో అందరికీ తెలుసు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అసలు ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది. దీన్ని ఎలా అప్లై చేయాలి. ఎవరికి ఇస్తారు?
ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులను భరించలేని విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లను (Education Loan ) బ్యాంకులు అందిస్తాయి. అయితే అందరు విద్యార్థులకు ఈ లోన్లు మంజూరు కావు. దీనికి ప్రత్యేకమైన అర్హత (Loan Eligibility) ప్రమాణాలు ఉన్నాయి. అకడమిక్ ఎక్సలెన్స్, విజయాలను విద్యా రుణాలకు ప్రాథమిక అర్హతలుగా (education loan percentage criteria) చెప్పుకోవచ్చు. విద్యార్థులు గత పరీక్షల్లో సాధించిన మార్కులు, వారి ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డు ఆధారంగా బ్యాంకులు విద్యా రుణాలపై ఒక అంచనాకు వస్తాయి. ఈ లోన్లు ఆమోదం పొందడానికి దరఖాస్తుదారులు సంబంధిత అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. కొన్ని సంస్థలు స్కాలర్షిప్ కూడా అందిస్తాయి.
లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి. వారు తప్పనిసరిగా భారతదేశంలో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందినట్లు రుజువులు సమర్పించాలి. లోన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వారు గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కోర్సులు చదువుతూ ఉండాలి. UGC/AICTE/Govt గుర్తింపు పొందిన కళాశాల లేదా యూనివర్సిటీలోనే కోర్సులు చదువుతూ ఉండాలి. ఫుల్ టైమ్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు తల్లిదండ్రులు/సంరక్షకులు లేదా జీవిత భాగస్వామి/తల్లిదండ్రులు (వివాహితులైన అభ్యర్థుల విషయంలో) సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి.
అకడమిక్ క్వాలిఫికేషన్- గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అభ్యసిస్తుండాలి
ఆదాయ వనరు- తల్లిదండ్రులు/సంరక్షకులు సంపాదించేవారై ఉండాలి
ఆదాయం- స్థిరంగా ఉండాలి
యూనివర్సిటీలు, విద్యాసంస్థలు- భారతదేశంలో/విదేశాలలో గుర్తింపుపొందినవి మాత్రమే
అడ్మిషన్- లోన్ దరఖాస్తు నాటికి తప్పనిసరిగా నిర్ధారణ కావాలి
పూచీకత్తు- లోన్ మొత్తం, ఆదాయ మూలాన్ని బట్టి ఉంటుంది
ఎడ్యుకేషన్ లోన్ అర్హత ప్రమాణాలు- విశ్లేషణ
జాతీయత (Nationality)
భారతీయ పౌరులు, నాన్-ఇండియన్ రెసిడెంట్స్ (NRIలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI), భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIOలు), విదేశాల్లోని భారతీయ తల్లిదండ్రులకు జన్మించి భారతదేశంలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు మన దేశంలో ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, డాక్టోరల్ కోర్సులు లేదా PhDలు, 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కలిగిన సర్టిఫికేట్ కోర్సులు, ఉద్యోగ ఆధారిత కోర్సులు, టెక్నికల్/డిప్లొమా/ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారు విద్యా రుణాలకు అప్లై చేసుకోవచ్చు.
సంస్థలు
గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ సహాయంతో కొనసాగుతున్న ప్రైవేట్ సంస్థలు, వృత్తిపరమైన సంస్థలు (Professional institutions), అంతర్జాతీయ కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారు ఎడ్యుకేషన్ లోన్‌కు అర్హులు.
సెక్యూరిటీ
ప్రముఖ రుణదాతలు రూ.7.5 లక్షల వరకు అందించే ఎడ్యుకేషన్ లోన్లకు ఎలాంటి తాకట్టు అవసరం లేదు. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన కోర్సులు/సంస్థల కోసం రూ.40 లక్షల వరకు తాకట్టు రహిత రుణాలు అందిస్తున్నాయి. సాధారణంగా నివాస లేదా వాణిజ్య ఆస్తులు లేదా ప్లాట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్.. వంటి వాటిని ఎడ్యుకేషన్ లోన్ కోసం తాకట్టు పెట్టవచ్చు.
రుణ మొత్తం ఎంత?
అర్హతను బట్టి కొంతమంది విద్యార్థులు రూ.1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. అయితే ఈ రుణ మొత్తం సంస్థల నియమ, నిబంధనలను బట్టి మారుతూ ఉంటుంది.
విద్యా రుణం అర్హతను మెరుగుపరిచే అంశాలు..
ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం విలువైన విద్యార్థులకు మాత్రమే లోన్ ప్రయోజనం అందుతుందని నిర్ధారించుకోవడానికి బ్యాంకులు కఠినమైన అర్హత ప్రమాణాలు పాటిస్తాయి. అభ్యర్థుల లోన్ అర్హతను (లోన్ ఎలిజిబిలిటీ) అంచనా వేయడంలో బ్యాంకులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. విద్యార్థుల మొత్తం అకడమిక్ ఎక్సలెన్స్, వారు చదవాలనుకుంటున్న కోర్సు, ప్రస్తుత అడ్మిషన్ స్టేటస్.. వంటి ప్రాథమిక అంశాలను లోన్ అప్రూవల్‌కు ముందే బ్యాంకులు విశ్లేషిస్తాయి.
ఎడ్యుకేషన్ లోన్ అర్హతకు దోహదం చేసే ప్రధాన అంశాలను చూద్దాం.
క్వాలిఫైయింగ్ పరీక్షల్లో మెరుగైన గ్రేడ్లు/ర్యాంకింగ్ సాధిస్తే లోన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
అభ్యర్థుల మొత్తం ఎడ్యుకేషన్ రికార్డును హైలెట్ చేయాలి
ప్రఖ్యాత/అత్యున్నత స్థాయి సంస్థ లేదా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాలి. వాటి ప్రాధాన్యాన్ని బ్యాంకులు గుర్తించేలా చేయాలి.
తల్లిదండ్రులు/సంరక్షకులు/సహ రుణగ్రహీతలకు బలమైన ఆర్థిక నేపథ్యం ఉండాలి
భవిష్యత్తు ఉపాధి/ఆదాయ వనరుగా మంచి అవకాశాలు ఉన్నాయని బ్యాంకులకు తెలియజేయాలి
ఎడ్యుకేషన్ లోన్ అర్హతను ఎలా తెలుసుకోవాలి?
ఏదైనా అగ్రశ్రేణి బ్యాంకుల నుంచి విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు, దీనికి సంబంధించిన అర్హతను ముందుగానే తనిఖీ చేసుకోవచ్చు. అన్ని ప్రధాన బ్యాంకులు వెబ్సైట్లలోని లోన్ సెక్షన్లో ఎడ్యుకేష్ లోన్ ట్యాబ్‌ను చేర్చాయి. వీటి ద్వారా ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు చాలా థర్డ్ పార్టీ ఫిన్ టెక్ సంస్థలు సైతం లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ల సాయంతో ఆన్లైన్ ద్వారా ఎడ్యుకేషన్ లోన్ అర్హత, లోన్ మొత్తం, వడ్డీ రేట్ల వివరాలను చెక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానంలో కొన్ని ప్రాథమిక, కీలక వివరాలను అందించి సులభంగా లోన్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. ఈ డేటా ఆధారంగా వివిధ ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్లను పోల్చుకోవచ్చు. వినియోగదారులు ఈ ఫలితాల నుంచి తమ అవసరాలకు తగిన, అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌ను ఎంచుకొని.. ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సులభమైన లోన్ ప్రక్రియ
ఎడ్యుకేషన్ లోన్ ప్రక్రియ చాలా సులభం. నిబంధనలు సైతం తెలిసినవే కాబట్టి అర్హులైన విద్యార్థులు ఈ లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే వారి కోరికలను నెరవేర్చుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ మంచి తోడ్పాటును అందిస్తుంది. మీరు విద్యార్థి అయినా, లేదా వృత్తిరీత్యా పని చేస్తున్నవారైనా సరే.. బ్యాంకులు నిర్దేశించిన ప్రమాణాలను నెరవేరిస్తే చాలు... భవిష్యత్తు కోర్సు ఖర్చులను భరించే విద్యా రుణాలను పొందడానికి అర్హులవుతారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.