Home /News /explained /

EC DECLARES DATES FOR ASSEMBLY ELECTIONS IN UP PUNJAB GOA UTTARAKHAND MANIPUR KEY HIGHLIGHTS MKS

Assembly Election 2022: యూపీలో మళ్లీ యోగి? -పంజాబ్‌లో బీజేపీకి సున్నా? -5రాష్ట్రాల్లో సీన్ ఇదే..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు

యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా, మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో మాత్రం సింగిల్ ఫేజ్ లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు, ప్రస్తుతం అక్కడ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే..

ఇంకా చదవండి ...
కేంద్రంలో అధికార సాధనకు కీలకకంగా భావించే, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం శనివారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తంగా ఏడు దశల్లో ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల సంఖ్య 18.34 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా, మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో మాత్రం సింగిల్ ఫేజ్ లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు, ప్రస్తుతం అక్కడ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే..

ఉత్తరప్రదేశ్..
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈసారి అత్యల్పంగా ఏడు దశల్లోనే యూపీ ఎన్నికలు ముగుస్తాయి. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10న పోలింగ్ జరుగనుంది. రెండో దశలో (9జిల్లాల్లోని 55 స్థానాలకు) ఫిబ్రవరి 14న పోలింగ్. మూడో దశలో (16 జిల్లాల్లోని 59 స్థానాలకు) ఫిబ్రవరి 20న పోలింగ్. నాలుగో దశలో (9 జిల్లాల్లోని 60 స్థానాలకు) ఫిబ్రవరి 23న పోలింగ్. ఐదో దశలో (11 జిల్లాల్లోని 60 స్థానాలకు) ఫిబ్రవరి 27న పోలింగ్. ఆరో దశలో (10 జిల్లాల్లోని 57 స్థానాలకు) మార్చి 3న పోలింగ్. ఇక చివరిదైన ఏడో దశలో (9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో) మార్చి 7న పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు: ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్- మార్చి 10న ఫలితాలు
యూపీ పోల్ షెడ్యూల్


యోగికి అఖిలేశ్ కూటమి పోటీ ఇస్తుందా?
ఉత్తరప్రదేశ్ లో చివరిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాడు బీజేపీ భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకుంది. బీజేపీకి 303 సీట్లు దక్కగా, మిత్రపక్షం అప్పాదళ్(ఎస్)కు 9 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ(49), సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(4), ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీకి 1 స్థానం లభించగా, కాంగ్రెస్ 7, బీఎస్పీ 15, జేఎస్డీ(ఎల్) 1, ఇండిపెండెంట్లు ముగ్గురు, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం యూపీలో బీజేపీ వరుసగా రెండో సారి విజయంపై ధీమాగా ఉంది. ప్రధాని మోదీ, సీఎం యోగి ఇటీవల భారీ ప్రాజెక్టులను ప్రారంభించి అభివృద్ది మంత్రమే గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ భారీ ఎత్తులు, వ్యూహాలతో బీజేపీకి సవాలు విసురుతోంది. ఎస్పీ ఈసారి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భాగీదారి సంకల్ప్ మోర్ఛా(9పార్టీల కూటమి)తో పొత్తులుపెట్టుకుంది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగనున్నాయి. యూపీ కాంగ్రెస్ కు ఈసారి ప్రియాంక గాంధీ ఇంచార్జి కావడంతో సీట్ల సంఖ్య పెరగొచ్చనే అంచనాలున్నాయి.

ఉత్తరాఖండ్ పోల్ షెడ్యూల్


ఉత్తరాఖండ్..
ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడి అన్ని స్థానాలకు ఒకే దశలో (రెండో ఫేజ్ లో) పోలింగ్ జరుగనుంది. మొత్తం 13 జిల్లాల్లోని 70 అసెంబ్లీ సీట్లకు జనవరి 21న నోటిఫికేషన్ వెలువడనుండగా, ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుంది. మార్చి 10న ఫలితాలు వస్తాయి. దేవభూమిగా పేరుపొందిన ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో 70కిగానూ 55 సీట్లలో గెలుపొందిన బీజేపీకి ఇద్దరు ఇండిపెండెంట్లూ మద్దతిచ్చారు. కాగా, గడిచిన ఏడాదిన్నరలోనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం గమనార్హం. కాంగ్రెస్ కు 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఫిరాయింపులు తదితర కారణాలతో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీఎంల మార్పు, బీజేపీ వ్యతిరేక గాలిలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ భావిస్తుండగా, ఈసారి కూడా గెలుపు తమదేనని కమలనాథులు విశ్వసిస్తున్నారు. అయితే, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది కీలకాంశంగా మారనుంది.

పంజాబ్ పోల్ షెడ్యూల్

Elections Dates 2022: రోడ్ షోలు రద్దు.. ప్రచారానికి covid రూల్స్ అడ్డు : EC సంచలన గైడ్‌లైన్స్పంజాబ్‌ సీన్..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరిపిన ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న పంజాబ్ లో ఈసారి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీతో పొత్తు ఉన్నా అది ఏమేరకు ఫలితాన్నిస్తుందో తెలీని పరిస్థితి. సుదీర్ఘకాలం ఎన్డీఏలో కొనసాగిన అకాలీదళ్ సైతం ఈసారి ఒటరిగానే పోటీ చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండో సారి గెలుపుపై ధీమాగా ఉంది. కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో పాగా వేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తం 23 జిల్లాల్లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో (రెండో ఫేజ్ లో) ఎన్నికలు జరుగుతాయి. జనవరి 21న నోటిఫికేషన్, ఫిబ్రవరి 14న పోలింగ్ ఉంటుంది. గత ఎన్నికల్లో పంజాబ్ (117) లో కాంగ్రెస్ 77, ఆప్ 17, శిరోమణి అకాలీదళ్ 14, బీజేపీ 4, ఎల్ఐపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.

మణిపూర్ పోల్ షెడ్యూల్


మణిపూర్‌లో పరిస్థితి ఏంటి?
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం నేపథ్యంలో ఈసారి అక్కడ రెండు దశల్లో (ఐదో, ఆరో ఫేజ్ లో) ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ(ఐదో ఫేజ్)లో ఆరు జిల్లాల్లోని 38 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్, రెండో దశ(ఆరో ఫేజ్)లో 10 జిల్లాల్లోని 22 స్థానాలకు మార్చి 3న పోలింగ్ జరుగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లు సాధించి, ఎన్పీఎఫ్4, ఎన్పీపీ 4, ఇండిపెండెట్1 సహకారంతో అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ 15, తృణమూల్ 1 సీటు సాధించాయి. ఫిరాయింపులు, వివిధ కారణాలతో 7సీట్లు వేకెంట్ అయ్యాయి. అనిశ్చితికి మారుపేరైన మణిపూర్ లో ఎవరు గెలుస్తారనేదానిపై భిన్న అంచనాలున్నాయి.గోవా పోల్ షెడ్యూల్


గోవాలో గెలుపు ఎవరిది?
అరేబియా తీరంలోని గోవా రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇన్నాళ్లూ కాంగ్రెస్, బీజేపీ, స్థానిక పార్టీలు పోరాడుతుండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఇక్కడ పాగావేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గోవాలో మొత్తం 2 జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో(రెండో ఫేజ్ లో) ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 21న నోటిఫికేషన్ విడుదలకానుండగా, ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుంది. గత ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు, ఇండిపెండెంట్(1) మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 2, గోవా ఫార్వర్డ్ పార్టీ 2, ఇండిపెండెంట్ 1, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 1, టీఎంసీ 1 స్థానంలో గెలిచాయి. ఫిరాయింపులు తదితర కారణాలతో 7సీట్లు ఖాళీ అయ్యాయి.
Published by:Madhu Kota
First published:

Tags: 5 State Elections, Assembly Election 2022, Election Commission of India, Uttar Pradesh Assembly Elections

తదుపరి వార్తలు