Milestones on roads: రోడ్ల పక్కన మైల్ స్టోన్స్ చూస్తుంటారుగా.. అవి వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం (Image: Shutterstock)

మనం నిత్య జీవితంలో అనేక సార్లు ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అయితే మనం ప్రయాణిస్తున్న సమయంలో దూరాన్ని తెలిపే మైల్ స్టోన్స్ ను చూస్తుంటాం. జాగ్రత్తగా వీటిని గమనిస్తే అవి వివిధ కలర్లలో ఉంటాయి. ఎందుకంటే..

  • Share this:


సాధారణంగా మన నిత్య జీవితంలో చాలా సార్లు ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. బస్సులు, కార్లు, బైకుల పై హైవేల గుండా వెళ్తున్నప్పుడు వివిధ రకాల మైల్ స్టోన్స్ గమనిస్తూ ఉంటాం. బోర్డులపై ఫలానా ప్రదేశం ఇంత దూరంలో ఉంది అని చెప్పే బోర్డులు కాకుండా రాళ్లపై వాటిని ముద్రించి వేసిన మైల్ స్టోన్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో కొన్ని పెద్దగా పసుపు పచ్చ రంగులో ఉంటే మరికొన్ని ఆకుపచ్చ రంగులో మరికొన్ని మాత్రం పూర్తిగా నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. అసలు ఈ మైల్ స్టోన్స్ కి ఇన్ని రకాల రంగులు ఎందుకు ఉంటాయి. అన్నీ ఒకే రంగులో ఎందుకు ఉండవు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి సందేహం మీకెప్పుడైనా వస్తే దానికి సమాధానాన్ని తెలుసుకోండి. అసలు మైల్ స్టోన్స్ అంటే తెలీని వారు ఉండరేమో.. ఇవి రోడ్డు పక్కన ఫలానా ప్రదేశం ఇంత దూరంలో ఉంది అని చెబుతూ.. ఆ ప్రదేశానికి వెళ్లేందుకు ఇంకా మనకు ఎంత సమయం పడుతుంది అన్న సూచనను మనకు అందిస్తుంటాయి. మన దేశంలో రోడ్డు వ్యవస్థ చాలా పెద్దది. గ్రామ స్థాయి రోడ్లు, రాష్ట్ర స్థాయి హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు, నేషనల్ హైవేలు ఇలా చాలా రకాల రోడ్లే ఉంటాయి. ప్రతి రోడ్డుకి తన ప్రత్యేకత దానికి ఉంటుంది. మరి, ఈ మైల్ స్టోన్లలో తేడా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి.

నారింజ రంగు స్ట్రిప్ ఉన్న మైల్ స్టోన్
నారింజ రంగు మైల్ స్టోన్ మీకు కనిపిస్తే అది గ్రామ స్థాయి రోడ్డు అని భావించాలి. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY), జవహర్ రోజ్ గార్ యోజన (JRY) వంటి పథకాల ద్వారా ఈ రోడ్లను నిర్మిస్తారు. మన దేశంలో ఈ రోడ్లు 3.93 లక్షల కిలో మీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి.

పసుపు రంగు మైల్ స్టోన్స్
ఇవి చాలా ఎక్కువగా కనిపించే మైల్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది కనిపించిందంటే మీరు నేషనల్ హైవే పై ప్రయాణిస్తున్నారని అర్థం. వివిధ నగరాలు, పట్టణాలను కలుపుతూ రాష్ట్రాల మధ్య వారధిగా నిలుస్తుంటాయి ఈ హైవేలు. మన దేశంలో లక్షన్నర కిలోమీటర్లకు పైగా ఈ హైవేలు ఉండడం విశేషం.

ఆకుపచ్చ మైల్ స్టోన్స్
నేషనల్ హైవేల తర్వాత ఎక్కువగా కనిపించే మైల్ స్టోన్స్ ఇవే. ఇవి రాష్ట్రీయ రహదారులను సూచిస్తాయి. ఒక రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలను కలిపేందుకు వీటిని వేస్తుంటారు. మన దేశంలో స్టేట్ హైవేలు మొత్తం కలిపితే లక్షా డెభ్భై వేల కిలోమీటర్లకు పైగా పొడవు ఉన్నాయి.

నీలం లేదా నలుపు స్ట్రిప్ తో ఉన్నవి
నీలం లేదా నలుపు రంగు స్ట్రిప్ తో తెలుపు రంగులో ఉన్న మైల్ స్టోన్స్ ని సిటీ లేదా జిల్లా రహదారులపై ఏర్పాటు చేస్తారు. మన దేశంలో ఈ రోడ్లు ఇప్పటి వరకు ఐదు లక్షల కిలోమీటర్లకు పైగా పొడవు ఉండడం విశేషం.

జీరో మైల్ స్టోన్ సెంటర్
నాగ్ పూర్ సిటీ ని బ్రిటిష్ కాలం నుంచి జీరో మైల్ స్టోన్ సెంటర్ గా పిలవడం జరుగుతుంది. దేశంలోని వివిధ నగరాల మధ్య దూరాన్ని కొలిచేందుకు ఈ సిటీని ఆధారంగా చేసుకోవడం జరిగింది. అది దేశం నడిబొడ్డులో ఉండడం దీని ప్రత్యేకత.

Published by:Nikhil Kumar S
First published: