Explained: పంజాబ్ సీఎంగా చరణ్‌జీత్ సింగ్‌ను కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది? 5 కారణాలివే ..

చరంజీత్ ​సింగ్​ చన్నీ

జాట్ సిక్కుల (jat sikh) అధిపత్యం అధికంగా ఉండే పంజాబ్ రాష్ట్రానికి తొలి దళిత సీఎం (First Dalit Chief minister)గా చరణ్‌జీత్ నిలిచారు. కొందరు సీనియర్ల పేర్లు వినపడినా అమరీందర్ వారసుడిగా చరణ్‌జీత్ సింగ్‌ను కాంగ్రెస్ (Congress) ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఉన్నాయి.

  • Share this:
పంజాబ్ రాజకీయాలు (Punjab politics) అత్యంత వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతరం అనేక తర్జనభర్జనలు, చర్చలు, సమీకరణాలను పరిశీలించి సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ (Charanjit singh channi)ని పంజాబ్ తదుపరి సీఎం (Punjab New CM)గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఎంపిక చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా.. చరణ్‌జీత్ ఎంపికకు చాలా కారణాలు ఉన్నాయి. జాట్ సిక్కుల (jat sikh) అధిపత్యం అధికంగా ఉండే పంజాబ్ రాష్ట్రానికి తొలి దళిత సీఎం (First Dalit Chief minister)గా చరణ్‌జీత్ నిలిచారు. కొందరు సీనియర్ల పేర్లు వినపడినా అమరీందర్ వారసుడిగా చరణ్‌జీత్ సింగ్‌ను కాంగ్రెస్ (Congress) ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఉన్నాయి.

దళిత వర్గానికి చెందిన నేత
దేశంలో దళితులు (Dalits) అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. పంజాబ్‌లో 32 శాతం మంది దళితులు ఉన్నారు. తాజా జనాభా లెక్కలు వెలువడితే ఈ సంఖ్య 38 శాతానికి చేరుతుందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇక పంజాబ్‌లో జాట్ సిక్కుల జనాభా 25 శాతం ఉండగా.. వారు సంప్రదాయ రాజకీయ శక్తిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున 20 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా వారిలో ముగ్గురు కేబినెట్‌ మంత్రులు (cabinet ministers)గా ఉన్నారు.

ప్రస్తుతం జాట్ సిఖ్ వర్గానికి చెందిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్ (PCC chief) గా ఉన్నారు. ఈ తరుణంలో దళిత వర్గానికి చెందిన చరణ్‌జీత్ సింగ్‌ను కాంగ్రెస్ సీఎం (CM)గా చేసింది. దీంతో రెండు వర్గాలు తమ పార్టీకి మద్దతుగా ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో ఇది లాభిస్తుందని కాంగ్రెస్ ఆలోచించింది. దీంతో చన్నీని సీఎంను చేసింది.

ప్రతిపక్షాలను దెబ్బకొట్టేలా..
శిరోమణి అకాళీదల్, ఆమ్ఆద్మీ (Aam Adhmi) పార్టీల వ్యూహాలను దెబ్బతీసేందుకు కూడా సీఎంగా చన్నీని ఎంపిక చేసింది కాంగ్రెస్. శిరోమణి అకాళీదల్ ఇటీవల బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (BSP)తో చేతులు కలిపింది. అలాగే తాము అధికారంలోకి వస్తే దళిత వ్యక్తిని డిప్యూటీ సీఎం (Deputy CM) చేస్తామని ఆమ్ఆద్మీ ప్రకటించింది. దీంతో చన్నీని ముఖ్యమంత్రిని చేసి ఈ రెండు పార్టీలకు హస్తం పార్టీ దీటైన జవాబు చెప్పింది.

సిక్కు కావడం కూడా..
చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ దళిత వర్గానికి చెందిన నేత అయినా ఆయన సిఖ్ కూడా. ఈ అంశం కూడా ఆయనకు సానుకూలంగా మారింది. పీసీసీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌ (Sunil kumar)ను సీఎం చేయాలని తొలుత ప్రతిపాదన రాగా.. పంజాబ్ కు హిందూ సీఎం వద్దని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోనీ (Ambika soni) చెప్పారు. అలాగే సుఖ్వీందర్ సింగ్ రాంధ్వా కూడా సిక్కును సీఎం చేయకపోతే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. దీంతో చన్నీనే కాంగ్రెస్ ఎంపిక చేసింది.

అసమ్మతిలోనూ అంగీకారం
పార్టీలో అసమ్మతి చెలరేగడంతో తీవ్ర అనిశ్చితి ఏర్పడగా.. చరణ్‌జీత్ సింగ్‌ ఎంపికను మాత్రం చాలా మంది అంగీకరించారు. ఆయనకు పార్టీలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయ చతురత సైతం ఆయన సొంతం. కెప్టెన్ అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పిన ఎమ్మెల్యేలతోనూ చన్నీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా ఆయనకు కలిసి వచ్చింది. అలాగే దళితుడైన చరణ్‌జీత్ సింగ్‌ను సీఎం చేయడాన్ని అమరీందర్ (Amarinder) కూడా వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రజాదరణ కలిగిన నేతగా..
ఖరర్‌లోని ఓ కుగ్రామానికి చెందిన చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నేత. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆయన మంచి ప్రజాదరణ పొందారు. ఉన్నత విద్య కూడా ఆయన అదనపు సానుకూలత. రాజకీయంగానూ చన్నీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. సాంకేతిక విద్య మంత్రిగా కొత్త కళాశాలలు, స్కిల్ సెంటర్లను చన్నీ ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో యువతకు మంచి విద్య, ఉద్యోగాలు దక్కుతాయని కాంగ్రెస్ (congress) భావిస్తోంది. దీంతో యువతలో కాంగ్రెస్ పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని అనుకుంటోంది. ఇది కూడా పంజాబ్ సీఎం (Punjab CM)గా చరణ్‌జీత్ సింగ్‌ చన్నీని ఎంపిక చేసేందుకు మరో ప్రధాన కారణంగా ఉంది.
Published by:Prabhakar Vaddi
First published: