హోమ్ /వార్తలు /Explained /

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడనున్నాయా? విశ్వ క్రీడల గురించి ఈ విషయాలు తెలుసా..

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడనున్నాయా? విశ్వ క్రీడల గురించి ఈ విషయాలు తెలుసా..

Olympics (ఫైల్ ఫోటో)

Olympics (ఫైల్ ఫోటో)

Tokyo Olympics: గతంలోనూ 1916, 1944 లో ఒలింపిక్స్ రద్దయ్యాయి. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఇది జరిగింది. అయితే ఇలా వాయిదా ఎప్పుడూ పడలేదనే చెప్పాలి.

క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తోన్న టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్లందరినీ ఒకే దగ్గర చూసే వీలు కల్పిస్తాయి ఈ గేమ్స్. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు కాబట్టి ఈ ఏడాది కూడా ఈ గేమ్స్ వాయిదా పడతాయేమో అని చాలామంది భావిస్తున్నారు. ఈ గేమ్స్ జరగబోయే జపాన్ దేశంలోనూ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం గేమ్స్ మళ్లీ వాయిదా పడితేనే బాగుంటుందని భావించేవారు జపాన్ లో 70 నుంచి 80 శాతం మంది ఉన్నారట. అందుకే ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడతాయనే టాక్ వినిపిస్తోంది. మరి, మళ్లీ ఈ సంవత్సరం కూడా గేమ్స్ వాయిదా పడతాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. సాధారణంగా నాలుగేళ్ల పాటు వేసవిలో జరిగే ఈ ఒలింపిక్స్ గేమ్స్ ని సమ్మర్ ఒలింపిక్స్ అంటారు. ఈ గేమ్స్ గతేడాది జులై నుంచి ఆగస్టు మధ్యలో జరగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ప్రపంచమంతా లాక్ డౌన్ విధించడంతో ఈ గేమ్స్ కూడా సంవత్సరం వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు కొనసాగనున్నాయి. జులై 21, 22 న కూడా కొన్ని ప్రిలిమినరీ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. గతేడాది జరగాల్సి ఉన్న పారాలంపిక్స్ కూడా ఈ సంవత్సరం ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు కొనసాగనున్నాయి.

ఈ సంవత్సరం ఈ గేమ్స్ ని నిర్వహించలేకపోతే వాటిని వాయిదా వేసే అవకాశం లేదు. వాటిని పూర్తిగా రద్దు చేయాల్సిందే.. ఎందుకంటే ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి జరిగే వింటర్ ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం జరగాల్సి ఉంది. ఈ గేమ్స్ ని రెండు సమ్మర్ ఒలింపిక్స్ మధ్యలో నిర్వహించడం పరిపాటి. అందుకే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ కలిసి చర్చించి ఈ గేమ్స్ కొనసాగించేందుకు నిర్ణయించుకున్నాయి. ఈ గేమ్స్ ప్రసారం ద్వారా కొన్ని బిలియన్ల మేర మొత్తాన్ని ఒలింపిక్ కమిటీ పొందుతుంది. గేమ్స్ రద్దైతే ఈ మొత్తాన్ని ఆ సంస్థ నష్టపోతుంది. అందుకే దీన్ని కొనసాగించేందుకే వారు మొగ్గు చూపుతున్నారు.

సంవత్సరం ఆలస్యంగా ఈ గేమ్స్ ని నిర్వహిస్తున్నా.. వీటి పేరు మాత్రం టోక్యో 2020 గానే వ్యవహరించనున్నారు. టీ షర్టులు, మగ్స్, ఇతర బ్రాండెడ్ వస్తువులన్నీ ఇదే లోగోతో తయారు కానున్నాయి. ప్రస్తుతానికి ఈ క్రీడలకు వచ్చేందుకు అంతర్జాతీయ అభిమానులకు అనుమతించలేదు జపాన్ ప్రభుత్వం. కేవలం క్రీడాకారులు, వారి సహాయ సిబ్బంది, ఆఫీసర్లు, న్యూస్ మీడియా సంస్థల ప్రతినిధులు మాత్రమే ఈ గేమ్స్ కి హాజరయ్యేందుకు అర్హులు. అయితే జపాన్ కి చెందిన వారికి మాత్రం ఈ క్రీడలను చూసేందుకు అనుమతిని అందించింది ఆ దేశం. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వారు తమ డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుందా? అని తలలు పట్టుకుంటున్నారు. అయితే దీనికి ఇంకా కాస్త సమయం పడుతుందని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలోనూ 1916, 1944 లో ఒలింపిక్స్ రద్దయ్యాయి. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఇది జరిగింది. అయితే ఇలా వాయిదా ఎప్పుడూ పడలేదనే చెప్పాలి.

సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మర్ లేదా వింటర్ ఏవో ఒక ఒలింపిక్స్ జరుగుతూనే ఉంటాయి. వింటర్ ఒలింపిక్స్ జరిగిన రెండేళ్లకు సమ్మర్ ఒలింపిక్స్ ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకు వింటర్ ఒలింపిక్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఒక్కో సమ్మర్ ఒలింపిక్స్ మధ్యన నాలుగేళ్ల సమయం ఉంటుంది. ఈ సంవత్సరం ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ ఒలింపిక్స్ జరిగిన ఆరు నెలల తర్వాత తిరిగి వింటర్ ఒలింపిక్స్ కూడా జరగనున్నాయి. ఆ తర్వాత మళ్లీ 2024లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి. గ్రీస్ లో జరిగిన ప్రాచీన ఒలింపిక్స్ క్రీ. పూ776 నుంచి క్రీ.శ 394 వరకు కొనసాగాయి. ఇవి కూడా నాలుగేళ్ల పాటు జరిగేవి. వీటిని పరిగణనలోకి తీసుకొనే ప్రస్తుతం జరిగే మోడ్రన్ ఒలింపిక్స్ కూడా నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. వీటిని 1896లో ప్రారంభించారు. మొదటి ఒలింపిక్స్ గ్రీస్ లోని ఏథెన్స్ లో జరిగింది. ఇప్పుడు జపాన్ లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్ తర్వాత 2022 లో బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. 2008లో బీజింగ్ లోనే సమ్మర్ ఒలింపిక్స్ కూడా జరిగాయి. ఇలా సమ్మర్, వింటర్ రెండు రకాల ఒలింపిక్స్ నిర్వహించిన ఘనత కేవలం బీజింగ్ నగరానికే చెందుతుంది. ఆ తర్వాత జరగబోయే సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్ లో 2024లో , ఆ తర్వాత 2028లో లాస్ ఏంజలిస్ లో జరుగుతాయి. 2026 వింటర్ గేమ్స్ ఇటలీలోని మిలన్ లో జరుగుతాయి. ప్రస్తుతం గేమ్స్ కి ఆతిథ్యం ఇస్తున్న జపాన్ 1964లో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ కి ఆతిథ్యం ఇచ్చింది. 1972 లో జపాన్ లోని సప్పోరో నగరం, 1998 లో నాగనో నగరం వింటర్ ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చాయి.

ఈ ఏడాది గేమ్స్ లో బేస్ బాల్, సాఫ్ట్ బాల్ 13 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంటే కరాటే, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్ వంటి గేమ్స్ కొత్తగా చేరాయి. కరోనా మహమ్మారి ఉండడం వల్ల ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఒలింపిక్ టార్చ్ రిలే ఫుకుషిమాలో కొనసాగుతోంది. మార్చి 25న ఓపెనింగ్ సెర్మనీ కూడా జరిగింది. అయితే దీనికి ఎవరినీ ఆహ్వానించలేదు సరికదా రూట్ ని కూడా కేవలం అరగంట ముందుగానే అనౌన్స్ చేశారు. కేవలం ఇళ్లలో ఉండి దాన్ని ప్రోత్సహించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. చాలా తక్కువమందితో ఈ కార్యక్రమం జరిగింది. ఈ గేమ్స్ కి మస్కట్ గా మిరాయ్ టోవా ని, పారాలంపిక్స్ కి సొమైటీని నిర్ధారించారు. మిరైటోవాని జపాన్ పదాలైన భవిష్యత్తు, శాశ్వతత్వం నుంచి తీసుకున్నారు. సొమైటీ అంటే ఒక రకం చెర్రీ చెట్టు అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Tokyo Olympics

ఉత్తమ కథలు