Explained: డెంగీ అంటే ఏంటి? ఎలా వస్తుంది? ఎలా తగ్గించుకోవాలి? టీకాలేంటి.. ఫుల్ డిటెయిల్స్..

ప్రతీకాత్మక చిత్రం

  • Share this:
భారత్‌లో కరోనా కేసులు (India Corona Cases) తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో వైరల్ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue Fever) పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వైరల్ జర్వాల వ్యాప్తికి (Viral Fevers in India) అనువైన వాతావరణం ఉండటంతో దేశవ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది తీవ్రమైన వ్యాధిగా మారుతూ ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. తీవ్రమైన డెంగ్యూ (Severe dengue) కారణంగా మరణాల ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డెంగ్యూ, తీవ్రమైన డెంగ్యూ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దోమల ద్వారా వ్యాప్తి
డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. అన్ని దేశాల్లోనూ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి (Aedes aegypti) జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏఈ అల్బోపిక్టస్ (Ae. albopictus) జాతి దోమలు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేయగలవు. ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. డెంగ్యూ ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది.

Dengue: మనీ ప్లాంట్​తో డెంగీ వచ్చే ప్రమాదం.. జాగ్రత్త పడకపోతే దోమలకు నిలయమేడెంగ్యూ ఇతర తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు సైతం కారణమవుతుంది. బాధితుల్లో కొంతమందికి ఇది సబ్‌క్లినికల్ డిసీజ్‌గా (వ్యాధి సోకినట్లు బాధితులకు తెలియకపోవచ్చు) కనిపించవచ్చు. తీవ్రత పెరిగే కొద్దీ తీవ్రమైన ఫ్లూ లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో రక్తస్రావం, అవయవవాల పనితీరు మందగించడం, ప్లాస్మా లీకేజీ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు. తీవ్రమైన డెంగ్యూకి తగిన చికిత్స అందించకపోతే బాధితులు మరణించే ప్రమాదం ఉంది. 1950 లలో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో డెంగ్యూ మహమ్మారిగా మారిన సమయంలో తీవ్రమైన డెంగ్యూను (Severe dengue) మొదటిసారిగా గుర్తించారు. ఇది ఆసియా, లాటిన్ అమెరికన్ దేశాలను ప్రభావితం చేస్తోంది.

మొత్తం నాలుగు రకాలు
డెంగ్యూ వ్యాధి ఫ్లావివిరిడే (Flaviviridae) కుటుంబానికి చెందిన వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్‌లో నాలుగు సెరోటైప్స్ ఉన్నాయి. వీటిని DENV-1, DENV-2, DENV-3, DENV-4 అని పిలుస్తారు. వీటిలో ఏదైనా వేరియంట్ బారిన పడి కోలుకుంటే.. బాధితులకు సదరు వేరియంట్ యాంటీబాడీలు జీవితాంతం రక్షణ అందిస్తాయి. అయితే బాధితులు మరో వేరియంట్ బారిన పడే ప్రమాదం సైతం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఇతర సెరోటైప్‌ల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్‌లు (సెకండరీ ఇన్‌ఫెక్షన్) తీవ్రమైన డెంగ్యూ ప్రమాదాన్ని పెంచుతుంది. మన దేశంలో DENV-2 కారణంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. డెంగ్యూ వైరస్ నాలుగు సెరోటైప్‌లతో ఏదో ఒకటి నిర్దిష్ట ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించగలదు. డెంగ్యూ మానవ ఆరోగ్యంతో పాటు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Fever Health Tips: జ్వరం తగ్గించే సింపుల్ చిట్కా.. అరగంటలో మాయం!


ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ భారం
ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి వ్యాప్తి పెరిగింది. చాలా కేసుల్లో లక్షణాలు సైతం బయటపడట్లేదు. లేదంటే తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అందువల్ల అసలైన డెంగ్యూ నిర్ధారణ కేసుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు భావించాలి. ఇలాంటి కేసులను కొన్ని దేశాల్లో కేవలం సాధారణ జ్వరాలుగా తప్పుగా నిర్ధారిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 39 కోట్ల (390 మిలియన్) మంది డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇందులో సుమారు 9.6 కోట్ల (96 మిలియన్లు) కేసులను మాత్రమే వైద్యపరంగా నిర్ధారిస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 129 దేశాల్లో డెంగ్యూ సంక్రమణ ప్రమాదం అధికంగా ఉన్నప్పటికీ.. మొత్తం కేసుల్లో 70 శాతం ఆసియా దేశాల్లోనే నమోదవుతున్నాయని అంచనా.

ఈ ఆకు రసం తాగితే డెంగీ జ్వరం రాకుండా కాపాడుకోవచ్చు.. ఈ కీలక విషయాలు తెలుసుకోండి


గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ దేశాలు WHOకి నివేదించిన డెంగ్యూ కేసుల సంఖ్య ఏకంగా 8 రెట్లు పెరిగింది. 2000లో 5,05,430 కేసులు నమోదు కాగా.. 2010లో ఇది 24 లక్షలకు, 2019 లో 52 లక్షలకు చేరుకుంది. 2000- 2015 మధ్య నమోదైన డెంగ్యూ మరణాలు 960 నుంచి 4032 వరకు పెరిగాయి. డెంగ్యూ కేసులను దేశాల ఆరోగ్య శాఖలు నమోదు చేయడం, డబ్ల్యూహెచ్‌ఓకు నివేదించడంలో భిన్నమైన విధానాలను అవలంభిస్తున్నాయి. అందువల్ల వాస్తవ ఇన్‌ఫెక్షన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెంగ్యూ వల్ల ప్రపంచంపై పడుతున్న వాస్తవిక భారం ఎలా ఉంటుందనేది అనిశ్చితంగా ఉంది.

డెంగ్యూ వ్యాప్తి
1970 కి ముందు కేవలం 9 దేశాల్లో మాత్రమే తీవ్రమైన డెంగ్యూ (severe dengue) మహమ్మారి కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి ఇప్పుడు ఆఫ్రికా, అమెరికా, తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్‌లోని 100 కి పైగా దేశాల్లో వ్యాపిస్తోంది. అమెరికా, ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు దీనికి అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. యూరప్‌తో సహా కొత్త ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఇది ఒక మహమ్మారిలా పరిణమిస్తోంది.

షాకింగ్ సెక్స్ ద్వారా డెంగీ వ్యాప్తి.. తొలి కేసు నమోదు 


2020లో బంగ్లాదేశ్, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, ఇండియా, ఇండోనేషియా, మాల్దీవులు, మారిటేనియా, మయోట్టే (Fr), నేపాల్, సింగపూర్, శ్రీలంక, సూడాన్, యెమెన్, థాయ్‌లాండ్.. వంటి అనేక దేశాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. 2021లో బ్రెజిల్, కుక్ దీవులు, కొలంబియా, ఫిజి, కెన్యా, పరాగ్వే, పెరూ వంటి దేశాల్లో డెంగ్యూ తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

దోమ నుంచి మనిషికి సంక్రమించడం
వైరస్ సోకిన ఆడ దోమల కాటు ద్వారా డెంగ్యూ మానవులకు వ్యాపిస్తుంది. ప్రధానంగా ఏడిస్ ఈజిప్టి దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఏడిస్ జాతికి చెందిన ఇతర దోమలు కూడా వైరస్‌కు వెక్టర్స్‌గా పనిచేస్తాయి. DENV సోకిన వ్యక్తిని కాటువేసి రక్తం పీల్చిన తరువాత.. డెంగ్యూ వైరస్‌ దోమల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా దోమ శరీరంలో వైరస్ వృద్ధి చెందిన తరువాత అది వేరొకరిని కాటు వేస్తే.. వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే ఆ దోమ నుంచి కొత్త హోస్ట్‌కి వైరస్ వ్యాప్తించే వరకు పట్టే సమయాన్ని ఎక్స్ట్రిన్సిక్ ఇంక్యుబేషన్ పీరియడ్ (EIP) అంటారు. ఉష్ణోగ్రత 25-28 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు EIP సుమారు 8-12 రోజుల వరకు ఉంటుంది. అయితే ఇతర అంశాలు సైతం దోమ వైరస్‌ను ప్రసారం చేయడానికి తీసుకునే సమయాన్ని మార్చగలవు.

ఒకసారి దోమ శరీరంలో వైరస్ వృద్ధి చెందిన తరువాత.. అది జీవితాంతం వైరస్‌ను వ్యాప్తి చేయగలదు. వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలు బయట పడటానికి రెండు రోజుల ముందు నుంచి.. వారికి జ్వరం పూర్తిగా తగ్గిపోయిన రెండు రెండు రోజుల తరువాత కూడా.. బాధితులను కాటు వేసే ఈడెస్ దోమల్లోకి డెంగ్యూ వైరస్ ప్రసరించగలదు.

రోగిలో అధిక మొత్తంలో వైరెల్ లోడ్ (వైరమియా) లేదా అధిక జ్వరం ఉంటే.. వారిని కాటువేసిన దోమల ద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం సైతం అంతే మొత్తంలో పెరుగుతుంది. చాలా మంది డెంగ్యూ బాధితులు 4-5 రోజుల వరకు వైరమిక్‌గా ఉంటారు. వైద్యపరంగా చూస్తే మాత్రం వీరిలో వైరమియా 12 రోజుల వరకు ఉంటుంది. అయితే అధిక స్థాయిలో DENV- యాంటీబాడీలు ఉంటే.. దోమల ద్వారా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం తగ్గుతుంది. ప్రసవం సమయంలో గర్భిణులకు డెంగ్యూ సోకితే, తల్లి నుంచి బిడ్డకు సైతం వైరస్ వ్యాపిస్తుంది. అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. DENV ఇన్‌ఫెక్షన్ సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవం, నవజాత శిశువుల్లో అనారోగ్యాలు వంటి సమస్యలు సైతం ఎదురవ్వచ్చు.

వ్యాధి లక్షణాలు
డెంగ్యూ అనేది తీవ్రమైన ఫ్లూ వంటిది. అరుదుగా మరణానికి కారణమవుతుంది. దోమ కాటు తర్వాత వ్యాధి సోకిన వారిలో.. 4-10 రోజుల వరకు వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ (పొదిగే కాలం) ఉంటుంది. ఆ తర్వాత 2-7 రోజుల పాటు లక్షణాలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెంగీని రెండు వర్గాలుగా విభజించింది. లక్షణాలు లేని, సాధారణ లక్షణాలు బయటపడే డెంగ్యూ.. తీవ్రమైన డెంగ్యూగా ఇన్‌ఫెక్షన్‌ను వర్గీకరించింది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

డెంగ్యూ లక్షణాలు
బాధితుల్లో తీవ్రమైన జ్వరం ఉంటుంది. దీంతోపాటు తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. వికారం, వాంతులు, శరీర గ్రంథులు ఉబ్బటం, దద్దుర్లు వంటివి కూడా సాధారణ డెంగీ లక్షణాలుగా గుర్తిస్తారు. జ్వరంతో పాటు ఏవైనా రెండు ఇతర లక్షణాలు కనిపిస్తే.. అది డెంగ్యూ అనే అనుమానించాలి.

తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు
అనారోగ్యం ప్రారంభమైన 3-7 రోజుల తర్వాత బాధితులు క్లిష్టమైన దశకు చేరుకుంటారు. ఈ సమయంలో రోగికి జ్వరం వచ్చి, తగ్గుతున్నప్పటికీ.. తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ప్లాస్మా లీకింగ్, శరీరం నుంచి స్రావాలు విడుదల కావడం, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన రక్తస్రావం, అవయవాల పనితీరు మందగించి ప్రాణాంతకంగా మారడం.. వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.

తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస వేగం పెరగడం, చిగుళ్ళ నుంచి రక్తస్రావం, అలసట, విశ్రాంతి లేకపోవడం, వాంతిలో రక్తం పడటం.. వంటివన్నీ తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. 24-48 గంటలపాటు వైద్య సాయం అందించాలి. తద్వారా మరణ ప్రమాదాన్ని నివారించవచ్చు.

వ్యాధిని ఎలా నిర్ధారించాలి?
DENV నిర్ధారణకు అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో వైరలాజికల్ పరీక్షలు (వైరస్ మూలకాలను నేరుగా గుర్తించడం), సెరోలాజికల్ పరీక్షలు (వైరస్‌ను ఎదుర్కోవడానికి శరీరం సిద్ధం చేసిన ఇమ్యూన్ కాంపొనెంట్స్‌ను పరీక్షించడం) ప్రధానమైనవి. లక్షణాలు కనిపించిన మొదటి వారంలో రోగి నుంచి శాంపిల్స్‌ సేకరించాలి. వీటిని సెరోలాజికల్, వైరాలజికల్ పద్ధతుల ద్వారా పరీక్షించాలి. వైరలాజికల్ విధానంలో డెంగ్యూను గుర్తించడానికి రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ -పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT -PCR) పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్లినికల్ శాంపిల్స్ విశ్లేషించి వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు వైరస్ జన్యుమార్పులను సైతం గుర్తించవచ్చు. ప్రస్తుతం కోవిడ్-19 నిర్ధారణకు సైతం RT -PCR పరీక్షలనే వినియోగిస్తున్నారు.

వైరస్ ఉత్పత్తి చేసిన NS1 అనే ప్రోటీన్‌ను గుర్తిచడం ద్వారా కూడా వైరస్‌ను నిర్ధారించవచ్చు. కనుగొనవచ్చు. ఎంజైమ్-లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సేస్ (ELISA) వంటి సెరోలాజికల్ పద్ధతులు సైతం ఇటీవలి కాలంలో డెంగ్యూ నిర్ధారణకు అందుబాటులోకి వచ్చాయి.

చికిత్స పద్ధతులు
ప్రస్తుతం డెంగ్యూ జ్వరానికి నిర్దిష్ట చికిత్స అంటూ అందుబాటులో లేదు. కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలను నియంత్రించడానికి మందులు ఇస్తుంటారు. ఎసిటమైనోఫెన్ లేదా పారాసెటమాల్ మెడిసిన్‌ను బాధితులకు ఇస్తూ వైరస్‌ను నియంత్రిస్తుంటారు. తీవ్రమైన డెంగ్యూ బాధితులను వైద్యుల పర్యేవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తే.. మరణాల రేటును 20% నుంచి 1% కంటే తక్కువకు తగ్గించవచ్చు.

డెంగ్యూకి టీకాలు ఉన్నాయా?
సనోఫీ పాశ్చర్ అభివృద్ధి చేసిన మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ అయిన డెంగ్వాక్సియా (CYD-TDV).. 2015 డిసెంబర్‌లోనే లైసెన్స్ పొందింది. ఇప్పుడు 20 దేశాల్లో దీన్ని ఆమోదించారు. అయితే దీని పనితీరుపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వ్యాధి నివారణ మార్గాలేవి?
దోమ కాటుకు గురికాకుండా చూసుకోవడమే.. డెంగ్యూ నివారణకు ప్రధాన మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకూడా చూసుకోవాలి. వాటి ఆవాసాలుగా ఉండే నీటి తొట్టెలు, గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఘన వ్యర్థాలను ఇళ్లకు దూరంగా వేయాలి. దోమ లార్వాలను నిర్వీర్యం చేయడానికి పురుగుమందులు స్ప్రే చేయాలి. ఇంటి కిటికీలకు విండో స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకోవాలి. దోమల వికర్షకాలు వాడాలి. పిల్లలను ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు తీసుకెళ్లకూడదు. వారి శరీరం పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేయాలి. డెంగ్యూ వ్యాప్తి, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published: