భారత్‌లో కరోనా తీవ్రత తగ్గిందా ? ఆర్- ఫ్యాక్టర్ లెక్కలు చెబుతున్నదేమిటి ?

ప్రతీకాత్మక చిత్రం

ఆర్‌- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా ఎక్కువ ఉంటే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌న‌డానికి సంకేత‌మ‌ని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అందువల్ల అధికారులు కోవిడ్ నివార‌ణ‌కు సంబంధిత ప్రోటోకాల్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని ఆ లేఖ‌లో జాగ్ర‌త్త‌లు చెప్పారు.

  • Share this:
భారత్‌లో కోవిడ్ తీవ్రత చాలావరకు తగ్గింది. అయితే ఆర్‌- ఫ్యాక్టర్‌ పెరుగుదలపై కేంద్ర‌ ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతోంది. ఈ విలువ ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను ఇటీవల ప్రధాని మోదీ సైతం అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా.. త‌గ్గుతున్నాయా? అస‌లు ఎలాంటి అంశాల ఆధారంగా కేసుల పెరుగుద‌లను గుర్తిస్తారు? ఆర్- ఫ్యాక్ట‌ర్ అంటే ఏంటి... క‌రోనా కేసుల పెరుగుద‌ల‌కు, దానికి ఉన్న సంబంధం ఏంటి? వంటి వివరాల గురించి తెలుసుకుందాం.

రెండు రోజుల కింద‌ట కేంద్ర హోం శాఖ రాష్ట్రాల‌ను హెచ్చ‌రిస్తూ ఒక లేఖ రాసింది. కోవిడ్-19కి సంబంధించి ఆర్‌- ఫ్యాక్ట‌ర్ పెరుగుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా రాసిన లేఖలో.. ఆర్‌- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా ఎక్కువ ఉంటే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌న‌డానికి సంకేత‌మ‌ని పేర్కొన్నారు. అందువల్ల అధికారులు కోవిడ్ నివార‌ణ‌కు సంబంధిత ప్రోటోకాల్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని ఆ లేఖ‌లో జాగ్ర‌త్త‌లు చెప్పారు.

* ఆర్‌- ఫ్యాక్టర్‌ పెరిగితే కేసులు పెరుగుతాయా?
ఆర్- ఫ్యాక్ట‌ర్ అంటే రీ-ప్రోడ‌క్ష‌న్ రేటు. ఒక కోవిడ్ రోగి ఎంత‌మందికి కోవిడ్ స్ప్రెడ్ చేయ‌గ‌ల‌డు అనేది ఈ రీ- ప్రొడ‌క్ష‌న్ రేటు చెబుతుంది. ఆర్- ఫ్యాక్ట‌ర్ క‌నుక 1.0 కంటే ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువ‌ అవుతున్న‌ట్టు లెక్క‌. అదే స‌మ‌యంలో ఆర్- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా త‌క్కువ ఉన్నా.. కేసుల‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తున్నా.. పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌ట్టు భావించాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక వంద‌ మంది కోవిడ్ బాధితుల ద్వారా మ‌రో వంద‌మందికి క‌రోనా సోకిందంటే.. అప్పుడు ఆర్- ఫ్యాక్టర్‌ విలువ ఒకటిగా ఉంటుంది. అదే వంద‌మంది కేవ‌లం 80 మందికి మాత్ర‌మే వైరస్‌ను వ్యాపింప‌చేయ‌గ‌లిగితే అప్పుడు ఆర్‌- ఫ్యాక్టర్‌ 0.80కు ప‌రిమిత‌మ‌వుతుంది.

* దేశంలో ప్ర‌స్తుతం ఆర్‌- ఫ్యాక్టర్ వాల్యూ ఎంత‌?
దేశంలో ప్ర‌స్తుతానికి ఆర్‌- ఫ్యాక్ట‌ర్ 1.0 క‌న్నా దిగువ‌కు ఉన్నా.. కొన్ని రాష్ట్రాల‌లో కేసుల సంఖ్య పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోందని చెన్నైకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మాటిక‌ల్ సైన్సెస్ (ఐఎంఎస్‌సి) అధ్య‌య‌నం పేర్కొంది. ఈ ఏడాది మే నెల మ‌ధ్య‌లో దేశ‌వ్యాప్తంగా ఆర్‌- ఫ్యాక్ట‌ర్ 0.78గా ఉంది. అంటే వంద‌మంది క‌రోనా రోగులు కేవ‌లం 78 మందికి మాత్ర‌మే వైరస్‌ను వ్యాపింప‌చేయ‌గ‌లిగార‌న్న‌మాట‌. అయితే జూన్ నెలాఖ‌రుకు, అలాగే జులై మొద‌టి వారానిక‌ల్లా ఈ రేటు 0.88కి చేర‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అంటే వందమంది క‌రోనా పేషెంట్లు 88మందికి వైరస్‌ను వ్యాపింప చేశారు.

ఐఎంఎస్‌సీ అధ్య‌య‌నం ప్ర‌కారం.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 21 మ‌ధ్య‌ ఆర్‌- ఫ్యాక్ట‌ర్ 1.37గా ఉంది. ఆ స‌మ‌యంలో కేసులు సెకండ్ వేవ్ ఉద్ధృతిని గుర్తించాయి. ఇక ఏప్రిల్ 24 నుంచి మే 1వ‌ర‌కు ఆర్‌- ఫ్యాక్టర్‌ వాల్యూ 1.18గా ఉంది. ఆ త‌రువాత విలువ త‌గ్గుముఖం ప‌ట్టి ఏప్రిల్ 29 నుంచి మే 7వ తేదీ మ‌ధ్య‌ 1.10కి చేరింది. అప్ప‌టి నుంచి ఈ విలువ‌ క్ర‌మం త‌ప్ప‌కుండా త‌గ్గుతూ వ‌స్తోంది. ఫ‌లితంగా కేసుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌చ్చింది.

* ఆర్‌- ఫ్యాక్టర్ ఏయే రాష్ట్రాల‌లో ఎక్కువగా ఉంది?
దేశంలో ఉత్త‌రాది రాష్ట్రాలు, కేర‌ళ‌లో ఆర్- ఫ్యాక్టర్ పెరిగిందని ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన సీతాభ్రా సిన్హా చెప్పారు. త‌క్కువ విలువ ఉన్న ఆర్- ఫ్యాక్టర్ వల్ల కేసులు వేగంగా త‌గ్గుతాయ‌ని, అలాగే ఇది 1 క‌న్నా ఎక్కువ ఉంటే ప్ర‌తి రౌండ్‌లో బాధితులు పెరుగుతుంటార‌ని సీతాభ్రా తెలిపారు. సాంకేతికంగా దీనిని ఎపిడెమిక్ ద‌శ అని అంటార‌ని విశ్లేషించారు. మే 9 త‌రువాత ఆర్‌- ఫ్యాక్టర్ క్షీణించింద‌ని, మే 15 నుంచి జూన్ 26 మ‌ధ్య‌న 0.78కి వ‌చ్చింది. అయితే జూన్ 20 త‌రువాత అది 0.88కి పెరిగింది. ఆర్- ఫ్యాక్టర్ 1 దాటేదాకా కేసులు వేగంగా పెర‌గ‌వు. అయితే ఈ వాల్యూ పెర‌గ‌డమే ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని సీతాభ్రా చెబుతున్నారు.

మ‌హారాష్ట్ర‌లో జులై 16 నాటికి 1.07 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మే 30న 0.84గా ఉన్న ఆర్- ఫ్యాక్టర్.. జూన్ నెలాఖ‌రుకు 0.89కు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ స‌మ‌యంలో కేసులు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగాయి. ఇక కేర‌ళ‌లో అయితే 1.19ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అక్క‌డ కోలుకుంటున్న‌ వారికంటే కొత్త కేసులు అధికంగా రావ‌డానికి కార‌ణం.. ఆర్‌- ఫ్యాక్టర్ 1.10కి చేర‌డ‌మే. దేశంలోని మొత్తం కేసుల‌లో ప్ర‌స్తుతం ఈ రెండు రాష్ట్రాల‌లోనే స‌గం కేసులు ఉన్నాయి.

చెన్నై సంస్థ చేసిన అధ్య‌య‌నం ప్ర‌కారం మ‌ణిపూర్‌లో ఆర్- ఫ్యాక్టర్ 1.07గా ఉంది. మేఘాల‌య 0.92, త్రిపుర 1.15, మిజోరాం 0.86, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ 1.14 సిక్కిం 0.88, అస్సాం 0,86 రీ ప్రొడక్షన్ రేటును నమోదు చేశాయి. కింద‌టి నెల‌లో ఈ రాష్ట్రాల‌లో త‌గ్గిన కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి.

* ఆర్‌- ఫ్యాక్టర్ పెరుగుద‌ల లాక్‌డౌన్‌కు దారితీస్తుందా?
కేసులు ఇలాగే పెరుగుతూ పోయి.. ఆర్- ఫ్యాక్టర్ 1.0కి చేరుకుంటే లాక్ డౌన్ విధించ‌క త‌ప్ప‌దు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానమిదే. ఆర్- ఫ్యాక్టర్‌ను లాక్‌డౌన్ వ‌ల్ల మాత్ర‌మే నియంత్రించ‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాక‌పోతే కోవిడ్ సోకిన వ్య‌క్తులు మ‌రొక‌రికి వ్యాపింప‌చేయ‌లేరు. మే నెల‌లో కూడా ఆర్-ఫ్యాక్టర్ త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం లాక్‌డౌనే.
Published by:Kishore Akkaladevi
First published: