Covid-19: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్ డౌన్ తప్పదా? వ్యాక్సీన్ వేసుకుంటే చాలా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్ని రోజులుగా వార్తల్లో ఎక్కడ చూసినా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయనే కనిపిస్తోంది. మళ్లీ గత మార్చి పరిస్థితులు ఏర్పడనున్నాయని.. లాక్ డౌన్ అవసరం అవ్వచ్చని కూడా వినిపిస్తోంది.

  • Share this:
గత కొన్ని రోజులుగా వార్తల్లో ఎక్కడ చూసినా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయనే కనిపిస్తోంది. మళ్లీ గత మార్చి పరిస్థితులు ఏర్పడనున్నాయని.. లాక్ డౌన్ అవసరం అవ్వచ్చని కూడా వినిపిస్తోంది. కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కనిపిస్తున్నాయి. అక్కడ సగటున రోజుకి 16,000 కేసులు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజువారీ కేసుల సంఖ్య 20,000లను దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు కరోనా పెరుగుదల, లాక్ డౌన్ గురించి ఏం చెబుతున్నారంటే..

ఇది సెకండ్ వేవ్ అనుకోవచ్చు..

తాము గమనించిన దాన్ని అంచనా వేస్తే ఈ కరోనా కేసుల పెరుగుదల కరోనా సెకండ్ వేవ్ లా అనిపిస్తోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గతేడాది కరోనా అత్యధికంగా ఉన్న సందర్భంలో ఎలాగైతే రోజుకి 20 నుంచి 30 వేల కేసులు వచ్చాయో.. తాజాగా అదే పరిస్థితులు తిరిగి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గత సెప్టెంబర్ లో కరోనా అత్యధికంగా ఉన్నప్పుడు కనిపించిన విధంగా ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు రోజుకి 16,000 వరకూ చేరుకుంటున్నాయి. కొన్ని రోజులైతే ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అయితే గతంలో వచ్చిన కరోనా కంటే ప్రస్తుతం ఉన్న వేరియంట్ పెద్దగా ప్రమాదకారి కాదని చెబుతున్నారు. అందుకే కేసులు పెరుగుతున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య పెద్దగా పెరగట్లేదన్నది వారి అభిప్రాయం. గత నెల రోజుల నుంచి చూసుకుంటే కేవలం 1 శాతం మరణాలు నమోదయ్యాయి. కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నా.. మరణాల సంఖ్య తగ్గడం అనేది పాజిటివ్ సంకేతమే అంటున్నారు నిపుణులు.

మహారాష్ట్రలోనే ఎందుకంటే..

దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ మహారాష్ట్రతో పోల్చుకుంటే అన్ని చోట్లా తక్కువగానే ఉన్నాయి. అయితే కరోనా సోకడం అనేది రకరకాల కారణాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనికి ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే వారి సంఖ్య వంటివి చాలా కారణాలుగా చెప్పవచ్చు. సంఖ్య ఫలానా చోటులోనే పెరుగుతుందని చెప్పడం కష్టం. అసలు కొన్ని ప్రదేశాలతో పోల్చితే మరికొన్ని ప్రదేశాల్లో కరోనా కేసులు ఎందుకు తగ్గుతున్నాయి. దానికి కారణమేంటి అనేది మాకు అంతు చిక్కట్లేదు. అది మేం తెలుసుకోగలిగితే ఆ సూచనలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రయత్నించేవాళ్లం అంటున్నారు నిపుణులు.

లాక్ డౌన్ పెద్దగా పనికిరాదు..

గతేడాది మనకు వైరస్ గురించి ఏ సమాచారమూ లేదు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు లాక్ డౌన్ ని అస్త్రంగా ఎంచుకున్నాం. అప్పటికి అది సరైన పద్ధతే. కానీ ఇప్పుడు లాక్ డౌన్ పెట్టడం సరి కాదు. లాక్ డౌన్ అంటే కేవలం నిత్యావసరాలను వదిలి మిగిలిన అన్ని సేవలను ఆపివేయాల్సి ఉంటుంది. గతేడాది లాక్ డౌన్ ఏర్పాటు చేయడం వల్లే ప్రజలు చాలా నష్టపోయారు. అయితే అప్పుడు మన హాస్పిటల్స్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మాస్కులు, లాబొరేటరీలు, వెంటిలేటర్స్ వంటి వాటి సంఖ్య ప్రస్తుతం ఉన్నంత లేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కాబట్టి లాక్ డౌన్ పెట్టడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉండదు. అయితే గతంలో చేసినట్లుగానే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే అతడు కలిసిన వ్యక్తులందరినీ క్వారంటైన్ చేయడం, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్, మాస్కుల వంటి పద్ధతులన్నీ పాటించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయడం వల్ల కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతులు ఇంకా ఎన్ని రోజులు అవసరముంటాయన్న ప్రశ్న చాలామంది నుంచి ఎదురవుతోంది. వ్యాక్సీన్ తీసుకున్నా మాస్క్ వాడడం వల్ల కొత్త వేరియంట్ వైరస్ ల నుంచి ముప్పును తగ్గించుకోవచ్చు. అందరికీ వ్యాక్సీన్ అందిన తర్వాత ప్రతి ఒక్కరికీ వచ్చే రోగ నిరోధక శక్తిని ఆధారంగా చేసుకొని అప్పుడు మాస్కులు ధరించడం అవసరమా? లేదా? అని నిపుణులు వివరిస్తారు. అప్పటి వరకూ అయితే మాస్కులు పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి చేయడం మంచిది.

వ్యాక్సినేషన్ వేసుకుంటే సరిపోతుందా?

కరోనాని అడ్డుకోవడం వ్యాక్సీన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో కేవలం 20 నుంచి 25 శాతం జనాభా మాత్రమే కరోనా బారిన పడ్డారు. వీరికి మాత్రమే వైరస్ నుంచి ఇమ్యునిటీ లభించింది. అయితే దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ అందేలా చేయడం వల్ల ప్రతి ఒక్కరిలోనూ కరోనాకి వ్యతిరేకంగా యాంటీబాడీలు ఎర్పడతాయి. వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడే హెర్డ్ ఇమ్యునిటీ స్టేజ్ కి మనం చేరుకోవడం సులవవుతుంది. ప్రస్తుతానికి మన దేశంలో కేవలం అరవై సంవత్సరాల పైబడిన వారికి, దీర్ఘ కాలిక సమస్యలున్న వారికి మాత్రమే వ్యాక్సీన్లు అందజేస్తున్నారు. వ్యాక్సీన్ల పై నిర్వహించిన ట్రయల్స్ చాలామంచి ఫలితాలను చూపాయి. కానీ వీటి గురించి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ వ్యాక్సీన్ వేసుకున్న వారిలో దీర్ఘకాలికంగా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న విషయంపై ఎక్కడా అధ్యయనాలు జరగలేదు. ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే ఈ వ్యాక్సీన్ ని సిద్ధం చేసి వాటిని తీసుకునే దశలో ఉన్నాయి. ప్రస్తుతం తీసుకున్నవారిలో వ్యాక్సీన్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాక్సీన్ తీసుకున్నవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా అవి వ్యాక్సీన్ వల్లనే వచ్చాయా? లేక సాధారణంగానే వచ్చాయా? అని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే ఫార్మకో విజిలెన్స్ అంటారు. కొత్త మందు కనిపెట్టినప్పుడు ప్రతి సంస్థ ఈ పద్ధతిని పాటిస్తుంది. అది ప్రస్తుతం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా వ్యాక్సీన్ తీసుకోవాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి ఆరోగ్య స్థితిని నోట్ చేసుకుంటున్నారు. వాటిని డాక్యుమెంట్ చేస్తున్నారు. ఈ డేటాను అంతా సేకరించి ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనట్లుగా కనిపిస్తే దాన్ని అధిగమించి వ్యాక్సీన్ ని మరింత మెరుగ్గా చేసేందుకు ప్రయత్నించాలి. అందుకే ముందుగా కొందరికి మాత్రమే దీన్ని అందించారు. కొన్ని నెలల్లో వ్యాక్సీన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయితే ఏ వ్యాక్సీన్ వంద శాతం ప్రయోజనాలు అందిస్తుందని చెప్పలేం. వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పూర్తిగా మాయమైపోవు. కొద్ది శాతం అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వ్యాక్సీన్ల ద్వారా మనకు అందిన రోగ నిరోధక శక్తి ఎన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల పాటు మనల్ని కరోనా రాకుండా కాపాడుతుందన్న విషయం కూడా మనం గమనించాల్సిన విషయమే. ఈ విషయంపై కూడా అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రస్తుతం ఎవరూ సమాధానం చెప్పలేరు. అందుకే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికే వరకూ ప్రతి ఒక్కరూ కరోనా రాకుండా వ్యక్తిగతమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.
Published by:Ashok Kumar Bonepalli
First published: