Black Fungus: కోవిడ్-19, బ్లాక్ ఫంగ‌స్‌.. రెండూ ఒకేసారి సోకుతాయా? తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

మ్యూకార్‌మైకోసిస్ అనే బ్లాక్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ ఇప్పుడు కోవిడ్‌-19తో జ‌త‌ కలిసింది. కరోనా సోకి కోలుకున్న కొంతమంది వ్యక్తుల్లో ఈ వ్యాధి బయటపడుతోంది. మరి ఈ రెండు వ్యాధులూ ఒకేసారి సోకుతాయా? నిపుణులు ఏమంటున్నారు?

  • Share this:
క‌రోనా వైర‌స్‌ని నివారించ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కానీ ప‌రిస్థితి మెరుగుప‌డుతున్న‌ట్లు మాత్రం క‌నిపించ‌డం లేదు. భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణతో దేశ‌వ్యాప్తంగా ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ వ్యవస్థ తీవ్ర‌వ‌మైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఈ క్రమంలో నిత్యం ఎదో ఒక కొత్త స‌వాలును దేశం ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కరోనా తరువాత మరో కొత్త రకం వ్యాధి దేశ ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మ్యూకార్‌మైకోసిస్ అనే బ్లాక్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ ఇప్పుడు కోవిడ్‌-19తో జ‌త‌ కలిసింది. కరోనా సోకి కోలుకున్న కొంతమంది వ్యక్తుల్లో ఈ వ్యాధి బయటపడుతోంది. దేశ‌వ్యాప్తంగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదు కావ‌డం గమనార్హం.

వారికి ప్రమాదం ఎక్కువ..
కోవిడ్-19 సోకిన‌వారిలో ఇప్పుడున్న స‌రికొత్త భ‌యం ఈ బ్లాక్ ఫంగ‌స్‌. కోవిడ్‌-19తో పాటు బ్లాక్ ఫంగ‌స్ కూడా కలిసి ఒకేసారి వ్యాపిస్తుందేమో అని చాలామంది భయపడుతున్నారు. కరోనా వైరస్‌తో పాటు ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ కూడా ఒకేసారి వచ్చే అకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే వ్యాధి ల‌క్ష‌ణాలు, తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉండి, ఐసియూలో చికిత్స తీసుకుంటున్న వారికి, మ‌ధుమేహ‌ం, హెచ్ఐవీ లాంటి దీర్ఘ‌కాల వ్యాధులున్న వారికి ఈ రెండూ ఒకేసారి సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఈ వాదనను ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు రుజువు చేయలేదు.

కోవిడ్‌-19తో వ‌చ్చే ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ ల‌క్ష‌ణాలు
కోవిడ్‌-19తో పాటు ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ క‌లిస్తే వ్యాధి ల‌క్ష‌ణాలు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చే అవ‌కాశం ఉంది. ఇలాంటి కొన్ని కేసుల్లో ప్రాణ‌న‌ష్టం కూడా జ‌ర‌గొచ్చు. చాలా కేసుల్లో కోవిడ్‌-19 నుంచి కోలుకున్న త‌ర్వాత ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తోంది. జ్వ‌రం, ముక్కు కార‌డం, త‌ల‌నొప్పి, శ్వాస‌ తీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణ వైరస్ లక్షణాలు ఎక్కువ కాలం వేధిస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి. సరైన సమయంలో వ్యాధికి చికిత్స తీసుకోవడం మంచిది.

కోవిడ్‌-19తో వ‌చ్చే ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ ర‌కాలు
గాలిలో ఉండే కొన్ని రకాల శిలీంధ్రాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లడం ద్వారా ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు వస్తుంటాయి. సాధార‌ణంగా యాస్పెర్‌జిల్లోసిస్‌, ఇన్వేసివ్ కాండిడియాసిస్ అనే రెండు ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. మిగ‌తా వాటిలో మ్యూకార్‌మైకోసిస్, హిస్టోప్లాస్మోసిస్, కాండిడా ఆరిస్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉంటాయి. యాస్పెర్‌జిల్లోసిస్ ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ ఊపిరితిత్తుల‌కు సంబంధించిన వ్యాధి. జిన‌స్ అనే శిలీంధ్రం నుంచి ఇది సోకుతుంది. ఇన్వేసివ్ కాండిడియాసిస్ అనేది కాండిడా ఆరిస్ అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఈ ఇన్‌ఫెక్ష‌న్‌ వచ్చినప్పుడు సాధార‌ణ ల‌క్ష‌ణాలైన జ్వ‌రం, చ‌లి కనిపిస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల‌లో ఇన్‌ఫెక్ష‌న్ రావ‌చ్చు.

మ్యూకార్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్షన్.. మ్యూకార్‌మైకోసిస్ అనే మోల్డ్స్ స‌మూహం వ‌ల్ల వ‌స్తుంది. ఇవి వాతావ‌ర‌ణంలో ఎక్క‌డైనా ఉండొచ్చు. ఈ బ్లాక్ ఫంగ‌స్ ఆరోగ్య స‌మ‌స్య‌లున్న వారికి త్వ‌ర‌గా సోకుతుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వేసుకునే వారికి ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది.
Published by:Shiva Kumar Addula
First published: