Home /News /explained /

CONGRESS DEPENDING ON OUTSIDERS LIKE SAM PITRODA JM LYNGDOH AND NOW PRASHANT KISHOR AK GH

Prashant Kishor: అప్పుడు వాళ్లు.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్.. ప్రతిసారి వారినే నమ్ముతున్న కాంగ్రెస్

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

సంక్షోభంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారీ ఎవరో ఒక ప్రముఖుడిపై ఆధారపడుతోంది. గతంలో శామ్ పిట్రోడా, జేఎమ్ లింగ్డో వంటివారిన

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. ఆయన ఎన్నో రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశాడు. గతంలో రెండు, మూడు పార్టీలతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. తాజాగా కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి.. ప్రశాంత్ కిశోర్ పునర్వైభవం తీసుకొస్తారని కొందరు నేతలు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. సంక్షోభంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారీ ఎవరో ఒక ప్రముఖుడిపై ఆధారపడుతోంది.

గతంలో శామ్ పిట్రోడా, జేఎమ్ లింగ్డో వంటివారిని కాంగ్రెస్ ఆశ్రయించింది. కానీ శామ్ పిట్రోడా ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. లింగ్డో కనీసం కాంగ్రెస్‌ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పరచుకోలేకపోయారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం వీరికి భిన్నమని చెప్పవచ్చు.

పీకే అని పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే దేశ రాజకీయ వర్గాల్లో తన సత్తా చాటుకున్నారు. చెక్కుచెదరని ట్రాక్ రికార్డ్‌ ఈ వ్యూహకర్త సొంతం. ముందు 2014లో నరేంద్ర మోదీ, ఆ తర్వాత నితీష్ కుమార్, కెప్టెన్ అమరీందర్ సింగ్, ఉద్ధవ్ ఠాక్రే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, స్టాలిన్, మమతా బెనర్జీ... వంటి నేతలను అధికారంలోకి తీసుకురావడంలో సఫలమయ్యారు. ఇలా రాజకీయ వర్గాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నారు.

* గాంధీలతో చర్చలు
వాస్తవానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పీకే గత కొన్ని నెలల నుంచి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని గాంధీ త్రయం నిర్ణయించింది. అయితే చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది సీనియర్ నాయకులు.. ముఖ్యంగా రాజకీయాల్లో చాణక్యులమని చెప్పుకునేవారు తమ అసమర్థతను ఒప్పుకోవాల్సి వస్తోందని భావిస్తున్నారు. పీకేను పార్టీలోకి తీసుకుంటే.. ఆయనకంటే గాంధీలు తక్కువ అవుతారని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా పార్టీ వర్గాల నుంచే ప్రశాంత్‌కు వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలాంటి పరిణామాలను అధినాయకత్వం ముందు నుంచే ఊహిస్తోంది.

నిజానికి 2016-17లో కూడా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ.. ప్రశాంత్ కిషోర్‌ సాయం తీసుకున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్‌లో పీకేపై వ్యతిరేక గళాలు వినిపించాయి. అప్పట్లో గులాం నబీ ఆజాద్ యుపీ పార్టీ వ్యవహారాలను చూసుకునేవారు. రాజ్ బబ్బర్ యుపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా ఉన్నారు. ఒక సందర్భంలో రాజ్ బబ్బర్ మాట్లాడుతూ.. ప్రశాంత కిషోర్ కేవలం ఒక "సౌండ్ రికార్డిస్ట్" మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఒక న్యూస్ ఛానెల్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ కిషోర్ కేవలం సౌండ్ రికార్డిస్ట్ మాత్రమే. వాయిస్ పిచ్ పైకి లేదా కిందికి వెళ్లినప్పుడు, అతడు దాన్ని సర్దుబాటు చేస్తాడు. అతడు మా నాయకుడు కాదు... మా నాయకుడు రాహుల్ గాంధీ’ అని చెప్పారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమికి ఘోర ఓటమిని చవిచూసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లు ఉండగా.. ఏకంగా 312 స్థానాలను బీజేపీ గెల్చుకుంది. కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఏడు స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్-పీకే సంబంధాలు అక్కడితో ముగిశాయి.

* శామ్ పిట్రోడా అనుభవం
గతంలో సైతం వ్యూహకర్తలను నియమించుకున్న అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజీవ్ గాంధీ హయాంలో శామ్ పిట్రోడా అన్ని విషయాల్లోనూ కీలకంగా వ్యవహరించేవారు. ఆయన రాజీవ్ గాంధీకి కళ్ళు, చెవులుగా ఉండేవారు. రాజీవ్ ఆదేశంతో పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన భావించారు. కానీ అర్జున్ సింగ్ వంటి కొందరు పార్టీ నాయకులు పిట్రోడా సంస్కరణలను వ్యతిరేకించారు.

1987లో బోఫోర్స్ ఘటన జరిగినప్పుడు.. వ్యతిరేకతను పోగొట్టడానికి పిట్రోడా ఒక ప్లాన్ వేశారు. కొంతమంది అనధికారికంగా ప్రేక్షకులను ఏర్పాటు చేసి, దూరదర్శన్‌లో ప్రోగ్రాం చేయాలని అప్పటి ప్రధానమంత్రికి సూచించారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో గోపీ అరోరా, మణిశంకర్ అయ్యర్ ఈ ఆలోచనను సమర్థించారు. రాజీవ్ అనధికారికంగా కొంతమందితో మాట్లాడితే పరిస్థితుల్లో మార్పువస్తుందని ఇలా భావించారు. ఒక ఆదివారం నాడు ప్రోగ్రాం రికార్డింగ్ చేయాలని భావించారు. కానీ అర్జున్ సింగ్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా ప్రోగ్రాం చేయాల్సిన రోజున రాజీవ్ న్యూఢిల్లీలోని బోట్ క్లబ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అవినీతి ఆరోపణలతో విసిగిపోయిన రాజీవ్ ‘మా ప్రత్యర్థులకు వారి అమ్మమ్మలను చూపిస్తాను’ అని మాట్లాడారు. ఇది పెద్ద దుమారాన్ని రేపింది.

రాజీవ్ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, కాంగ్రెస్‌ను ఆధునీకరించడానికి పిట్రోడా కొన్ని సూచనలు చేశారు. కానీ ఆ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. 1991లో రాజీవ్ మరణం తరువాత, పిట్రోడా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చే సమయానికి సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మరోసారి పార్టీ సంస్కరణల కోసం అతడిని నియమించారు. తరువాత పిట్రోడా సోనియాకు ఒక నివేదిక సమర్పించారు. కానీ ఆ సూచనలకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్లు లాబీయింగ్ చేసి, ప్రణాళికలను బుట్టదాఖలు చేశారు.

యుపీఏ -1 ప్రభుత్వ హయాంలో పిట్రోడా నేతృత్వంలోని నేషనల్ నాలెడ్జ్ కమిషన్‌కు.. హెచ్‌ఆర్‌డీ మంత్రిగా ఉన్న అర్జున్‌ సింగ్‌కు మధ్య గొడవలు జరిగాయి. సింగ్ ఓబీసీల కోసం ఉద్యోగ కోటాను ప్రవేశపెట్టిన సమయంలో ఈ వివాదం రేగింది. కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను వ్యతిరేకించినందుకు ప్రధాని మన్మోహన్ సింగ్.. పిట్రోడాకు మద్దతు ఇచ్చారని కొందరు నమ్ముతారు. అయితే అర్జున్ సింగ్‌కు సోనియా గాంధీ మద్దతు ఉండేది.

* గతంలో చేదు అనుభవం
రాహుల్ గాంధీ AICC జనరల్ సెక్రటరీ అయ్యాక, యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అంతర్గత పార్టీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని భావించారు. ఇందుకు మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ J.M.లింగ్డో నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ (FAME)ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ మాజీ సలహాదారు కేజే రావు అన్ని స్థాయిలలోని కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు. అయితే రాహుల్ మద్దతు ఉన్నప్పటికీ.. లింగ్డో, కేజీ రావు పార్టీతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేకపోయారు. కొన్ని సందర్భాల్లో పార్టీ నేతలు రాహుల్ సమక్షంలోనే వీరిని తక్కువ చేసి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికల సమయానికి ఇతర మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్లు సైతం ఫేమ్‌ సంస్థతో కలిసి కాంగ్రెస్ గెలుపుకు ప్రణాళికలు రచించినా ఫలితం లేకుండా పోయింది. గతంలోనూ కాంగ్రెస్ పీఆర్ కన్సల్టెన్సీ ఏజెన్సీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

* పీకే ముందు సవాళ్లు
మోడీ, నితీష్, మమత వంటి నాయకుల గెలుపునకు కృషి చేసిన కిషోర్ మాత్రం గతంలో కాంగ్రెస్‌కు ప్రతిఫలం చేకూర్చని ఏజెన్సీలు, వ్యూహకర్తల మాదిరిగా మిగలకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే పీకే ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నారు. గతంలో మాదిరిగా కాంగ్రెస్‌లో తనలాంటి వారికి ఎదురైన పరిస్థితుల పట్ల పీకే జాగ్రత్తగా ఉండవచ్చు. అయితే గాంధీ యేతర నాయకులకు పార్టీలో ప్రాధాన్యం అంతంతే అన్నది అందరికీ తెలిసిన విషయమే. పీ.వీ. నరసింహారావు, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్, నట్వర్ సింగ్ వంటి వారి నుంచి పీకే స్ఫూర్తి పొందవచ్చు.

Huzurabad: హుజూరాబాద్‌లో పోటీకి దూరం.. ఆ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా ?

Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..

గతంలో ఎన్నడూ లేనంత అధ్వాన్న స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పరిస్థితులు ఆయనకు సవాళ్లు విసరనున్నాయి. ఇప్పటికే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీనియర్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. సోనియా నుంచి రాహుల్ గాంధీకి నాయకత్వ మార్పు కోసం పార్టీ చూస్తున్న సమయంలో.. ప్రశాంత్ కిషోర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, పార్టీ సీనియర్లను ఆయన ఎలా ఎదుర్కొంటారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Congress, Prashant kishor, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు